Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్లలో స్మార్ట్ ఫోన్లు రెట్టింపు..ఇక అన్ని సేవలూ వాటిల్లోనే!!

2022 నాటికి స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య రెట్టింపు కానున్నాయి. గతేడాది 40 కోట్లు దాటిన స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు నాలుగేళ్లలో 82.9 కోట్లకు చేరుకుంటారు. మున్ముందు ఇక అన్నీ ఇంటర్నెట్ సేవలు స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులోకి రానున్నాయని సిస్కో తెలిపింది. 

Smartphone users in India to double to 829 mn by 2022: Report
Author
Mumbai, First Published Dec 4, 2018, 11:01 AM IST

ముంబై: భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. డిమాండ్‌కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్‌లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య వాయువేగంతో దూసుకు వెళ్తున్నది. 

2017 నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య 40కోట్లకు పైనే ఉంది. మరో నాలుగేళ్లలో 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 82.9 కోట్లకు చేరనున్నట్లు సిస్కో అంచనా వేస్తోంది. దేశ జనాభాలో ఇంటర్నెట్ వినియోగదారులు 60 శాతం ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. 

విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌(వీఎన్‌ఐ) పేరుతో సిస్కో తాజాగా ఓ అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించింది. ఇక తలసరి డేటా వినియోగం కూడా 14జీబీకి చేరే అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ‘2022 నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగం ఐదు రెట్లు పెరగనుంది. 2017లో తలసరి డేటా వినియోగం 2.4జీబీగా ఉంది. 2022 నాటికి ఇది దాదాపు 14జీబీకి పెరగనుంది’ అని సిస్కో నివేదికలో పేర్కొంది.

దేశజనాభాలో 27 శాతం మంది ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నారని సిస్కో విజ్వల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్(వీఎన్‌ఐ) నిర్వహించిన సర్వేలో తేలింది. గతేడాది 108 పెటాబైట్స్‌గా వినియోగించిన ఇంటర్నెట్ డాటా 2022 నాటికి ఐదింతలు పెరిగి 646 పెటాబైట్స్‌కు చేరుకునే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రతియేటా వీడియో ట్రాఫిక్ 73 శాతంగా వృద్దితో వచ్చే ఐదేళ్లలో 13.5 ఎక్సాబైట్స్‌కు చేరుకోనున్నదని పేర్కొంది.

ఇంటర్నెట్ అనుసంధాన పరికరాల సంఖ్య 220 కోట్లకు చేరుకోనున్నదని అంచనా. ప్రస్తుతం ఇది 160 కోట్లుగా ఉన్నది. ఇంటర్నెట్ పరిధిలోకి పలు రకాల పరికరాలు వస్తుండటంతో డాటా వినిమయం భారీగా పుంజుకుంటున్నదని, ఇదే క్రమంలో 2022 నాటికి 14 గిగాబైట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది. గతేడాది ఇది 2.4 గిగాబైట్లుగా ఉన్నది. 2022 నాటికి మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 44శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులే ఉంటారని సిస్కో అంచనా వేసింది. కంప్యూటర్లలో ఇంటర్నెట్‌ వినియోగం నానాటికీ తగ్గిపోతోందని తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 వేలుగా ఉన్న వై-ఫై హాట్‌స్పాట్స్ కేంద్రాలు 60 లక్షలకు చేరుకోనున్నాయని తెలిపింది. సోషల్ మీడియా, వీడియో వినిమయం, కమ్యూనికేషన్స్, బిజినెస్ అప్లికేషన్స్, సంప్రదాయక డిమాండ్ నెలకొంటుండటంతో స్మార్ట్‌ఫోన్లలో డాటా వినిమయం ఐదు రెట్లు పెరుగనున్నదని సిస్కో ఆసియా పసిఫిక్ హెడ్ సంజయ్ కౌల్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios