Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ షాపింగ్ సైట్లకి జియో షాక్...ముకేశ్ అంబాని ప్రకటనతో

టాటా సన్స్ గ్రూపు మాదిరిగా రిలయన్స్ కూడా అన్ని రంగాల్లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చమురు, టెలికం రంగాల్లో సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. తాజాగా ‘ఈ-కామర్స్’ రంగంవైపు ద్రుష్టి సారించారు. గుజరాత్ వేదికగా జియో, రిలయన్స్ రిటైల్ సాయంతో ‘ఈ-కామర్స్’ వేదికను ప్రారంభిస్తామని వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ప్రకటించారు.

Reliance Retail, Jio to launch new e-commerce platform
Author
Gujarat, First Published Jan 19, 2019, 11:31 AM IST

గాంధీనగరం: చమురు, టెలికం రంగాల్లో ప్రభంజనం సృష్టించిన రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ చూపు ఈ-కామర్స్‌ రంగంపై పడింది. త్వరలో జియో, రిలయన్స్‌ రిటైల్‌ కలిసి సరికొత్త ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తాయని శుక్రవారం ‘వైబ్రంట్ గుజరాత్‌’ సమ్మిట్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.

ముందు గుజరాత్‌లో రిలయన్స్ ఈ-కామర్స్‌కు లిట్మస్ టెస్ట్

ముందుగా గుజరాత్‌లోని 12 లక్షల మంది రిటైలర్లు, స్టోర్‌ యజమానుల కోసం ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం తేనున్నట్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వివరించారు. తమ జియో స్టోర్లు, రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఇందుకు ఉపయోగించుకుంటామని తెలిపారు. 

అమెజాన్, వాల్‌మార్ట్‌కు పోటీగా రిలయన్స్ ఈ-కామర్స్

రిలయన్స్ ఈ-కామర్స్ రంగ ప్రవేశంతో దేశీయ ఆన్‌లైన్‌ మార్కెట్లో అమెరికా దిగ్గజం అమెజాన్‌ అనుబంధ అమెజాన్‌ ఇండియా, వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా దేశీయంగా మరో అగ్రశ్రేణి సంస్థ ప్రవేశించినట్లవుతుంది. ప్రస్తుతం జియోకు 28 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. రిలయన్స్‌ రిటైల్‌ సంస్థకు దేశంలోని 6,500 నగరాలు, పట్టణాల్లో దాదాపు 10,000 స్టోర్లు ఉన్నాయి. 

జియో ఆప్‌లు, మొబైల్ ఫోన్లతో ‘రిలయన్స్ ఈ-కామర్స్’ అనుసంధానం

జియో ఆప్‌లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా విక్రయదార్లను రిలయన్స్ -ఈ కామర్స్’ను అనుసంధానిస్తామని రిలయన్స్‌ రిటైల్‌ ఉన్నతాధికారి వీ సుబ్రమణియన్‌ ఫలితాల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో వెలువడిన కొత్త నిబంధనలు కూడా రిలయన్స్‌కు ఉపయోగకరం కానున్నాయి. 

విదేశీ కంపెనీలు తమ వాటాదార్ల ఉత్పత్తుల విక్రయానికి నో చాన్స్

తాజాగా కేంద్రం ఆమోదించిన ఈ-కామర్స్ నిబంధనల ప్రకారం.. విదేశీ పెట్టుబడులు ఉన్న ఈ-కామర్స్‌ కంపెనీలు.. తమ వాటాదారులైన కంపెనీల ఉత్పత్తులను విక్రయించడానికి వీలు ఉండదు. దేశీయ కంపెనీలకు మేలు చేసేవిగా ఉండడంతో రిలయన్స్ రిటైల్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఈ-కామర్స్ నిబంధనలు అమెజాన్‌, వాల్‌మార్ట్‌ (ఫ్లిప్‌కార్ట్‌) కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇక ఒక్కొక్కటిగా రిలయన్స్ ఈ-కామర్స్ ప్రణాళికలు

ఈ కామర్స్ ప్రణాళికలను త్వరలోనే ఒక్కటొక్కటిగా ముకేశ్ అంబానీ వెల్లడిస్తారని తెలిపారు. ఈ-కామర్స్‌ రంగంలోకి వచ్చే అంశాన్ని అంబానీ గత జూలైలోనే ప్రకటించినా ముందడుగు వేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

పదేళ్లలో గుజరాత్‌లో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు

వచ్చే పదేళ్లలో గుజరాత్‌లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. విద్యుత్‌, పెట్రో రసాయనాలు, కొత్త తరం సాంకేతికత, డిజిటల్‌ వ్యాపారాల్లో ఈ పెట్టుబడులు ఉండొచ్చని ఆయన తెలిపారు. 

రిలయన్స్ కర్మభూమి జన్మభూమి గుజరాత్

‘రిలయన్స్‌కు గుజరాత్‌ జన్మభూమి, కర్మభూమి. తొలి ప్రాధాన్యం ఎపుడూ ఈ రాష్ట్రానికే’నని శుక్రవారమిక్కడ జరిగిన తొమ్మిదో ‘వైబ్రంట్ గుజరాత్‌’సమ్మిట్‌లో అన్నారు. ఇప్పటి దాకా గుజరాత్‌లో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు గుర్తు చేశారు. పండిట్‌ దీనదయాళ్‌ యూనివర్సిటీపై రిలయన్స్‌ ఫౌండేషన్‌ మరో రూ.150 కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఆయన హామీనిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios