Asianet News TeluguAsianet News Telugu

అసలు మీ వైఖరేంటి: టెలికంశాఖను నిలదీసిన అంబానీ బ్రదర్స్

తమ రెండు సంస్థల మధ్య స్పెక్ట్రం విక్రయ ఒప్పందంపై వైఖరేమిటో తెలియజేయాలని టెలికం శాఖను అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో కోరాయి. మరోవైపు ఆర్ - కామ్ నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు టెలికం శాఖకు జియో స్పష్టం చేసినట్లు సమాచారం. 

RCom, Jio seek clarity on DoT stand on spectrum deal
Author
New Delhi, First Published Jan 5, 2019, 10:35 AM IST

న్యూఢిల్లీ: టెలికం శాఖ వ్యవహార శైలిపై అంబానీ సోదరులు అప్రమత్తం అయ్యారు. తమ రెండు సంస్థల మధ్య స్పెక్ట్రం విక్రయ ఒప్పందంపై మీ వైఖరేమిటో తెలియజేయాలని టెలికం శాఖను అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్), ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రతినిధులు కోరారని సమాచారం. ఈ  మేరకు టెలికం శాఖకు రెండు సంస్థల ప్రతినిధులు ఉమ్మడిగా లేఖ రాశారని తెలుస్తున్నది. 

ఆర్-కామ్ నుంచి స్పెక్ట్రం కొనుగోలుపై జియో ఆసక్తి
మరోవైపు అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్లు టెలికం శాఖ ద్రుష్టికి ముకేశ్ అంబానీకి చెందిన జియో తెచ్చినట్లు మరో కథనం. ఆర్-కామ్ పాత బకాయిల భారం భరించేందుకు తాము సిద్ధంగా లేమని పేర్కొంటూ రిలయన్స్ జియో లేఖ రాయడంతో ఆర్-కామ్ నుంచి స్పెక్ట్రం కొనుగోలు ఒప్పందం ఖరారును పెండింగ్‌లో పెట్టింది. 

బకాయిలను క్లియర్ చేస్తామని టెలికంశాఖకు ఆర్ కామ్ స్పష్టత
ఇదిలా ఉంటే టెలికం శాఖకు తన బకాయిల చెల్లింపుల బాధ్యత ఉన్నదని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేర్కొంది. కానీ దీనిపై స్పందించేందుకు టెలికంశాఖ ప్రతిస్పందించలేదు. ఆర్-కామ్ ఇప్పటికే తన బకాయిల చెల్లింపు విషయమై తన అనుబంధ సంస్థ రిలయన్స్ రియాల్టీ నుంచి రూ.1400 కోట్ల మేరకు టెలికంశాఖకు కార్పొరేట్ గ్యారంటీని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. 

అనిల్‌ అంబానీని జైలుకు పంపండి!
ఆర్‌కాం ఛైర్మన్‌ అనిల్‌ అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా రూ.550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ గురువారం రెండవ పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ టెలికాం లిమిటెడ్‌, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్‌ అనిల్‌ సహా ఈ కంపెనీల అధికారులు దేశం విడిచిపోకుండా నివారించేలా హోంశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది. గడువులోపు బాకీ చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అనిల్‌ అంబానీని జైలుకు పంపాలని డిమాండ్‌ చేసింది. 


2.4 కోట్ల‌ చందాదారులను కోల్పోయిన ఎయిర్ టెల్, వొడాఫోన్
టెలికం ప్రొవైడర్లు భారతి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థలు కేవలం మూడు నెలల్లో 2.4కోట్ల మంది చందాదారులను కోల్పోయాయి. ఈ నెట్‌వర్క్‌లు తక్కువ ఆదాయం కల చందాదారులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటమే దీనికి కారణం. సబ్‌స్క్రైబర్స్‌ విషయంలో దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌- ఐడియా సెప్టెంబర్- నవంబర్ మధ్య 20.57మిలియన్ల మంది చందాదారులను కోల్పోగా, భారతీ ఎయిర్‌టెల్‌  4.22 మిలియన్ల మందిని కోల్పోయింది. ఎయిర్‌టెల్‌ నుంచి నవంబరులో 1,01,534మంది సబ్‌స్క్రైబర్స్‌ వెళ్లిపోయారు.

మున్ముందు ఎయిర్ టెల్, వొడాఫోన్ సంస్థలకు కష్టకాలమే
కొన్ని నెలల్లో ఈ ఆపరేటర్ల నుంచి ఇంకా చాలా మంది చందాదారులు వెళ్లిపోయే అవకాశం ఉంది. వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ అత్యంత తక్కువ రీఛార్జ్‌ (డేటా,వాయిస్‌) ప్లాన్‌ రూ.35 వద్ద ప్రారంభమవుతోంది. ఈ టెలికాం నెట్‌వర్క్‌లు అతి తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌ ధర పెంచడం వల్ల ఈ ప్రభావం దాదాపు 70 నుంచి 90మిలియన్ల వినియోగదారులపై పడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది వినియోగదారులు చాలా తక్కువ రీఛార్జ్‌ చేస్తారని, ఫోన్‌ నంబర్ కేవలం రిసీవింగ్‌ కాల్స్‌ కోసమే ఉపయోగించుకునే వారు కూడా చాలా మంది ఉన్నారని తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios