Asianet News TeluguAsianet News Telugu

ఇక టోకెన్ నంబర్‌తో డెబిట్/క్రెడిట్ కార్డులు సేఫ్

ఇక డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. ఇప్పటివరకు ఆయా కార్డులపై గల 16 అంకెల సంఖ్య, పిన్ తదితర సున్నితమైన అంశాలు వెల్లడించకుండా బ్యాంకులు సంబంధిత ఖాతాదారులకు టోకెన్ సంఖ్య జారీ చేస్తాయి. ఈ టోకెన్ సంఖ్యతో వినియోగదారులు ఆన్ లైన్ లో గానీ, థర్డ్ పార్టీ వద్ద గానీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల లావాదేవీల నిర్వహణకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 

RBIs new move to make card payments safer: All you need to know about tokenisation
Author
New Delhi, First Published Jan 10, 2019, 10:00 AM IST

న్యూఢిల్లీ: ఇక క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల లావాదేవీలు మరింత సురక్షితం కానున్నాయి. ఆన్‌లైన్‌లో గానీ, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల వద్ద గానీ ఇక నుంచి కార్డుల సున్నిత సమాచారం అవసరం లేకుండానే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇందుకు టోకెనైజేషన్‌ విధానం వీలు కల్పించనున్నది. కార్డులపై ఉండే 16 అంకెల సంఖ్య, కార్డు గడువు తేదీ, భద్రతా కోడ్‌ తదితర సున్నితమైన సమాచారానికి ఇది ఒక సురక్షిత తెరలా ఉపయోగపడనున్నది.

మీకు ఇలా టోకెన్ సంఖ్య కేటాయింపు
ఈ విధానంలో మీ కార్డు సున్నిత సమాచారానికి అనుబంధంగా ఓ టోకెన్‌ సంఖ్య వస్తుంది. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిపినప్పుడు కార్డుల సున్నిత సమాచారం చెప్పకుండా ఈ సంఖ్యను ఉపయోగిస్తే సరిపోతుంది. మీ లావాదేవీ సురక్షితంగా పూర్తి అవుతుంది. ఆర్థిక సేవల సంస్థలు, వ్యాపార సంస్థలు, థర్డ్‌పార్టీ చెల్లింపు సేవలు అందించే సంస్థలు (డిజిటల్‌ వ్యాలెట్లు లాంటివి) అడిగితే ఈ తరహా టోకెనైజేషన్‌ సేవలు అందించేందుకు అథీకృత కార్డు చెల్లింపు నెట్‌వర్క్‌లకు ఆర్బీఐ అనుమతినిచ్చింది.

‘వీసా’ తదితర సంస్థల ఆధ్వర్యంలో ‘టోకెన్’ సేవలు
వీసా లాంటి ప్రపంచవ్యాప్త దిగ్గజ కార్డు నెట్‌వర్క్‌ సంస్థలన్నీ కూడా ఈ టోకెన్‌ సేవలను అందిస్తున్నాయి. మొబైల్‌ లాంటి పరికరాలకు, రిటైలర్లకు, లావాదేవీల విధానం ఆధారంగా టోకెన్లు రకరకాలుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సేవలను మొబైళ్లు, ట్యాబ్లెట్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ విధానం పనితీరుపై సమీక్ష ఆధారంగా ఆ తర్వాత మిగిలిన పరికరాలకు విస్తరిస్తామని తెలిపింది.

దీనికి ఫీజు చెల్లించనవసరం లేదు
టోకెన్‌ రిక్వెస్టర్స్‌ యాప్‌ ద్వారా వినియోగదారుడి పూర్తి సమ్మతితోనే టోకెనైజేషన్‌కు కార్డు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సేవల నిమిత్తం వినియోగదారుడు ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదని ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటివరకు కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేందుకు పీఓఎస్‌ల వద్ద పాస్‌వర్డ్‌, ఆన్‌లైన్‌ లావాదేవీలకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విధానాన్ని బ్యాంకులు పాటిస్తున్నాయి. 

బ్యాంకులు ఇలా థర్డ్ పార్టీ సేవల వినియోగం
ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులూ లావాదేవీలు జరిపే వీలు ఉన్నందునే, కార్డుపై ఉన్న వివరాలన్నీ నమోదు చేశాక, బ్యాంకులో నమోదైన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ పంపుతున్నాయి. ఇది సక్రమంగా నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది.  ఈ కార్యకలాపాల నిర్వహణకు థర్డ్‌పార్టీ సంస్థ (చెల్లింపు గేట్‌వే)లను బ్యాంకులు వినియోగించుకుంటున్నాయి. 

ఇవీ డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలో సమస్యలు
కొన్ని సందర్భాలలో ఉచితం/బహుమతులు ఆఫర్లు ఇస్తామని నకిలీ వెబ్‌సైట్లు, మోసగాళ్లు కూడా కార్డులపై వివరాలను తస్కరిస్తున్నారు. కనుక ఆర్బీఐ నూతన ఆదేశాలు అమల్లోకి వస్తే, అసలు కార్డులపై వివరాలే నమోదు చేయాల్సిన అవసరం లేదు.  
బ్యాంకులు ఓటీపీ మాదిరే, టోకెన్‌ నంబర్‌ను తమ ఖాతాదార్లకు కేటాయిస్తాయి. ఈ నెంబర్‌ను మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది. ఇందువల్ల మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. నూతన విధానం అమలుకు బ్యాంకులు చర్యలు ప్రారంభించాల్సి ఉంది. చెల్లింపు గేట్‌వే సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉన్నది.

నమోదు కాని ఎలక్ట్రానిక్స్‌పై నిషేధం
భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) దగ్గర నమోదు కాకుండా దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌, ఐటీ పరికరాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ పరికరాల ఆదేశం 2012 ప్రకారం.. ఇటువంటి ఉత్పత్తుల దిగుమతికి బీఐఎస్‌ వద్ద నమోదు తప్పనిసరి లేదా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక మినహాయింపు లేఖ అయినా పొంది ఉండాలి. నమోదు కాకుంటే.. దిగుమతిదారే మళ్లీ ఆయా ఉత్పత్తులను తిరిగి వెనక్కి పంపాల్సి ఉంటుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. తాజా ఆదేశాలతో దేశంలో మొబైల్‌ ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీ, ఎల్‌ఈడీ దీపాలు వంటివి విక్రయించాలంటే బీఐఎస్‌ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios