Asianet News TeluguAsianet News Telugu

రెగ్యులేటరీ సవాళ్లు డోంట్ కేర్: $ 1.2 లక్షల కోట్లకు డిజిటల్ బిజినెస్

 

ఇటీవల ఫ్లిప్ కార్ట్ - వాల్ మార్ట్, అమెజాన్ వంటి విదేశీ సంస్థల ఈ- కామర్స్ వాణిజ్యంపై కేంద్రం విధించిన ఆంక్షలు ఏ రకంగా ప్రభావం చూపబోవని డెలాయిట్ ఇండియా అండ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. 2021 నాటికి భారత ఈ- కామర్స్ బిజినెస్ 1.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.

Next level of consumer growth in India in 2019 through e-commerce: Deloitte
Author
Mumbai, First Published Feb 27, 2019, 3:07 PM IST

ముంబై: భారతదేశీయ ఈ-కామర్స్ మార్కెట్‌పై తాజాగా కేంద్రం విధించిన ఆంక్షలతో ఇబ్బందులే ఉండబోవని డెల్లాయిట్ ఇండియా పేర్కొంది. వచ్చే రెండేళ్ల నాటికి ఈ-కామర్స్ బిజినెస్ టర్నోవర్ 1.2 లక్షల కోట్ల డాలర్లను తాకనున్నదని డెలాయిట్ ఇండియా అండ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక అంచనా వేసింది. 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ భారత్. ఈ క్రమంలోనే ఈ-కామర్స్ మార్కెట్ మరో మూడేండ్లలో 1.2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని మంగళవారం డెలాయిట్ నివేదిక పేర్కొన్నది. సంప్రదాయ మార్కెట్‌ను మించి ఆన్‌లైన్ మార్కెట్‌కు ఆదరణ పెరుగుతుందని చెప్పింది. 

దీంతో ప్రస్తుత ఈ-కామర్స్ మార్కెట్ విలువ ఎన్నో రెట్లు పెరుగగలదని డెలాయిట్ ఇండియా అండ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. దేశీయ ఆన్‌లైన్ మార్కెట్ ప్రగతికి బ్రేకులు వేశాయన్న అభిప్రాయాల మధ్య తాజా నివేదిక అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గుతున్నా, ముడి చమురు దిగుమతుల భారం పెరుగుతున్నా భారతీయ రిటైల్ మార్కెట్ పరుగులు పెట్టగలదని డెల్లాయిట్ తాజా నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే 2021 నుంచి 2026 మధ్య వృద్ధిరేటు 7.8 శాతం ఉండగలదని పేర్కొంది.

పెరుగుతున్న ఆన్‌లైన్ మార్కెట్ కొనుగోళ్లు మొత్తంగా రిటైల్ మార్కెట్ వృద్ధికి దోహదపడగలదని డెలాయిట్ ఇండియా అండ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక చెప్పింది. అన్ని రకాల వస్తువులు, సేవలు ఆన్‌లైన్‌లోనే లభిస్తుండటం, ఇంటి వద్దకే వస్తుండటం, ముఖ్యంగా సమయం ఆదా అవుతుండటం ఈ-కామర్స్ మార్కెట్‌కు కలిసొస్తున్నది.

దేశంలో స్మార్ట్‌ఫోన్ల రాక, ఇంటర్నెట్ వినియోగం పుంజుకున్న నేపథ్యంలోనే ఈ-కామర్స్ మార్కెట్ పురుడు పోసుకున్నది. నెట్ వినియోగం పెరుగుతున్నాకొద్దీ.. ఆన్‌లైన్ వ్యాపారం కూడా విస్తరిస్తోంది.

 ముఖ్యంగా రిలయన్స్ జియో రాకతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం విపరీతమైంది. నెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్లు సామాన్యుడి చేతికి అందడంతో ఆన్‌లైన్ కొనుగోలుదారులూ పెరిగిపోయారని డెలాయిట్ చెబుతున్నది. 

2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్లుగా ఉన్న మొబైల్ వాలెట్ల లావాదేవీలు.. 2017-18లో రూ.3 లక్షల కోట్లకు చేరాయని గుర్తుచేసింది. పెరిగిన మొబైల్ ఆధారిత ఆన్‌లైన్ వ్యాపారమూ ఇందుకు దోహదం చేసిందని డెల్లాయిట్ నివేదించింది.

ఇదిలా ఉండగా, ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలకే పరిమితమైన ఆన్‌లైన్ వ్యాపారం.. ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ వ్యాపించింది. ఓ మోస్తరు గ్రామాలకూ దూసుకువెళ్లింది. దీంతో కస్టమర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆన్ లైన్ లావాదేవీలూ అంతే స్థాయిలో పెరిగాయని డెలాయిట్ నివేదిక అంటున్నది. నేడు మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సేవలు ఉన్నాయని, దీంతో ఈ-కామర్స్ సంస్థలూ వారికి అందుబాటులో తమ ప్రతినిధులను ఏర్పాటు చేసుకుంటున్నాయని చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios