Asianet News TeluguAsianet News Telugu

యాపిల్‌కు షాక్: అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్

టెక్ దిగ్గజం యాపిల్ ను సంపదలో మైక్రోసాఫ్ట్ అధిగమించింది. అత్యంత విలువైన అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. 2010 తర్వాత 753.3 బిలియన్ల డాలర్ల సంపదతో అగ్రస్థానంలో మైక్రో సాఫ్ట్ నిలువగా, ఆగస్టు నాటికి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఉన్న యాపిల్ 746 బిలియన్ల డాలర్లకు పడిపోయింది.

Microsoft surpasses Apple to become most valuable US company
Author
Washington, First Published Nov 25, 2018, 10:53 AM IST

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం యాపిల్‌ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ అవతరించింది. 2010 తర్వాత 753.3బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా ఉన్న యాపిల్‌ తాజాగా 746 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 

నాలుగు నెలల క్రితం యాపిల్‌ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్‌ను అందుకొని, దాన్ని సాధించిన తొలి ట్రిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచి యాపిల్‌ కొత్త రికార్డులను సాధించడం ప్రారంభించింది. ఏడు వారాల క్రితం 231 డాలర్ల షేర్‌ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా యాపిల్‌ షేర్లు బిజినెస్‌ ఎనలిస్ట్‌లకూ అర్థం కాని స్థితిలో నిలకడలేమితో కొనసాగుతున్నాయి. 

ఊహించని పరిణామాలు జరుగుతుండడంతో ఆపిల్‌లో పెట్టుబడులు పెట్టడానికి మదుపరులు సైతం వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. దీంతో యాపిల్‌ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ సేల్స్‌లో బోల్తా పడ్డాయి. ఇక వ్యయ నియంత్రణ, ఉద్యోగుల కొరత తదితర అంశాలు యాపిల్‌ను వేధిస్తున్నాయి. 

శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి యాపిల్‌ షేర్లు 172.29 డాలర్లకు దిగజారాయి. కొద్ది వారాల సమయంలోనే ఆపిల్‌ షేర్లు 25 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. దీంతో ఆపిల్‌ ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ అనేది చేదు కలగానే మిగిలిపోయింది. అంతేకాదు ఆపిల్‌ మూలధనం (మార్కెట్‌ క్యాపిటల్‌) కూడా భారీ మార్పు చవిచూసింది. మైక్రోసాఫ్ట్, యాపిల్‌ సంస్థల తర్వాత ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ 736.6 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది.

యాపిల్ తర్వాత ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 736.6 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 725.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.  ‘ఆ మూడు దిగ్గజ సంస్థలను మైక్రోసాఫ్ట్‌ వెనక్కి నెట్టి, సిలికాన్‌ వ్యాలీలోని కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది’ అని ఎంఎస్‌పవర్‌యూజర్‌.కామ్‌ తన నివేదికలో తెలిపింది.

ప్రస్తుతం అన్నిటెక్నాలజీ సంస్థలు క్లౌడ్‌ సేవలు, సాఫ్ట్‌వేర్‌ సేవలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. చిన్న, పెద్ద సంస్థల నుంచి వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అజ్రీ క్లౌడ్‌, గేమింగ్‌, ల్యాప్‌టాప్‌ విభాగాల్లో మొదటి త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్‌ 29.1బిలియన్‌ డాలర్ల ఆదాయం రాగా, నికర ఆదాయం 8.8బిలియన్‌ డాలర్లుగా ఉంది. సంస్థ ఆదాయం 19శాతం పెరగ్గా, నికర ఆదాయం 34శాతం పెరిగినట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios