Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్: హైదరాబాద్ ఐటీ కంపెనీలకు లబ్ది

భారత ఐటీ రంగం పురోగతికి మున్ముందు కృత్రిమ మేధస్సు ఆధారం కానున్నది. క్రమంగా ఐటీ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకే వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్ గ్రామాలను రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. 

Interim Budget 2019-20: India to bolster Artificial Intelligence industry for tech-driven society
Author
New Delhi, First Published Feb 2, 2019, 11:27 AM IST

ఐటీ రంగానికి మేలు చేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రతిపాదనల్లో చర్యలు ప్రతిపాదించడం వల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాధనకు మరింత అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్‌, విశాఖపట్టణం కేంద్రంగా ఐటీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు లబ్ది చేకూరుతుందని ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ ఎగుమతుల పరంగా బెంగుళూరు తర్వాత అగ్రస్థానంలో హైదరాబాద్‌ ఉంది.

హైదరాబాద్ నుంచే రూ. లక్ష కోట్లకు ఐటీ ఎగుమతులు
హైదరాబాద్ నుంచే ఒక ఏడాది ఐటీ సేవల ఎగుమతులు రూ.ఒక లక్ష కోట్లకు చేరువయ్యాయి. ఎన్నో దేశ, విదేశీ ఐటీ కంపెనీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరోపక్క విశాఖపట్టణంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అదే సమయంలో తిరుపతి చుట్టుపక్కల మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, విడి భాగాల తయారీ బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ వర్గాలు ఈ బడ్జెట్‌ను తమదైన కోణంలో విశ్లేషిస్తున్నాయి.

ఐదేళ్లలో లక్ష డిజిటల్ గ్రామాల రూపకల్పన
గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ విప్లవాన్ని తీసుకువెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. అందుకోసం వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌  ప్రతిపాదించారు. ఇప్పటికే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు పెద్దపీట వేయడంతో దేశంలో మొబైల్‌ ఫోన్లు, విడిభాగాలు తయారు చేసే సంస్థల సంఖ్య రెండు నుంచి 268కి పెరిగినట్లు మంత్రి వివరించారు.

సీఎస్ఓలో 12 లక్షల మంది ఉద్యోగుల సేవలు
దేశంలో 3 లక్షలకు పైగా కామన్‌ సర్వీస్‌ సెంటర్లు (సీఎస్‌ఈ) ప్రజలకు డిజిటల్‌ సేవలు అందిస్తున్నాయి. ఈ సెంటర్లలో 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ డిజిటల్‌ విప్లవానికి ఇవి సంకేతాలని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.

ఇలా సామాన్యుల చెంతకు ఐటీ ఫలాలు
కృత్రిమ మేధ, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తోందని, దీంతో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఫలాలను సామాజ్య ప్రజల చెంతకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం కృత్రిమ మేధ జాతీయ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ జాతీయ కేంద్రాన్ని నెలకొల్పుతారు. దీనికి అనుబంధంగా మరికొన్ని ‘సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను ఏర్పాటు చేస్తారు. కృత్రిమ మేధకు సంబంధించి తొమ్మిది ప్రాధాన్యతాంశాలను గుర్తించారు. ‘నేషనల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ పోర్టల్‌’ ను త్వరలో రూపొందిస్తారు.

సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట
సాంకేతిక పరిజ్ఞానం అమలు, విస్తరణకు ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని సైయెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక లక్ష డిజిటల్‌ గ్రామాల అభివృద్ధి, ఎలక్ట్రానిక్‌ టాక్స్‌ రిటర్న్‌ ఎసెస్‌మెంట్‌ విధానం, కస్టమ్స్‌ లావాదేవీల డిజిటలీకరణ, డిజిటల్‌ సేవలు అందించే విధంగా కామన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్‌ఈ) కు మద్దతు ఆహ్వానించదగ్గ ప్రతిపాదనలన్నారు. కృత్రిమ మేధ జాతీయ కేంద్రం ఏర్పాటు వల్ల కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం, అమలు, విస్తరణలో దేశం ఎంతో ముందంజ వేసే అవకాశం కలుగుతుందని బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పోర్టల్ రూపకల్పన సరైందే
‘నేషనల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ పోర్టల్‌’ను రూపొందించాలనేది ఎంతో సరైన నిర్ణయమని పెగాసిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఈ సుమన్ రెడ్డి పేర్కొన్నారు.. ఐటీ రంగం అభివృద్ధికి దోహదపడే ఎన్నో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పొందుపరచిందన్నారు. లక్ష డిజిటల్‌ గ్రామాల అభివృద్ధి, కృత్రిమ మేధ జాతీయ కేంద్రం ఏర్పాటు ఈ కోవలోనివే. అయితే ఈ నిర్ణయాలు ఏ విధంగా అమలు అవుతాయి, ఏమేరకు నిధులు కేటాయిస్తారనేది చూడాడని, మొత్తం మీద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించేదిగా ఈ బడ్జెట్‌ ఉందని సుమన్‌రెడ్డి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios