Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ డేటా మన దగ్గరే చాలా చీప్.. అదీ రిలయన్స్ జియో వల్లే


కారణాలేమైనా భారతదేశంలోనే మొబైల్ డేటా సేవలు అతి చౌక అని బ్రిటన్‌కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తేల్చేసింది. 2016లో రంగ ప్రవేశం చేసిన రిలయన్స్ జియో వల్ల మరింత తగ్గాయని ఒక జీబీ మొబైల్ డేటా రూ.18.50లకే లభిస్తోందని ఆ అధ్యయనం సారాంశం. 

India has the cheapest mobile data in world: Study
Author
Hyderabad, First Published Mar 7, 2019, 1:51 PM IST

ప్రపంచదేశాల్లోకెల్లా మొత్తం మీద మొబైల్ డేటా సేవలు ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన కేబుల్‌ అనే వెబ్‌సైట్‌ అధ్యయనంలో తేలింది. 230 దేశాల్లో అమలవుతున్న ఇంటర్నెట్ సేవల ధరలను పోల్చి చూస్తే ఈ విషయం వెలుగు చూసింది. అన్ని దేశాలతో పోలిస్తే సరాసరిగా ఒక జీబీ ఇంటర్నెట్‌ డేటా ధర రూ.600 పలుకుతోంది. కాని మనం కేవలం రూ.18.50 కే పొందుతున్నాం.  భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు అతి తక్కువ ధరకు రావడానికి పలు కారణాలున్నాయి. 

భారతదేశంలో మొదటి నుంచి డేటా సేవలు చౌకే
ఇండియాలో దాదాపు 430 మిలియన్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు అనేక సంస్థలు పోటీపడుతుండటంతో కొంచెం తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందుతూ వచ్చింది. 2016లో ముఖేశ్‌ అంబానీ జియో 4జీ  సేవలు ప్రారంభిస్తూ ముందు కాల్స్, డేటా పూర్తిగా ఉచితంగా ఇవ్వడంతోపాటు అత్యధిక వేగాన్ని వినియోగదారులకు పరిచయం చేశారు. 

నామమాత్రపు ధరకే రిలయన్స్ జియో డేటా సేవలు
ఆ తర్వాత నామమాత్రపు ధరకే సేవలు రిలయన్స్ జియో కొనసాగిస్తున్నది. ఫలితంగా రిలయన్స్ జియో అనతి కాలంలోనే దాదాపు 230 మిలియన్ల వినియోగదారులను తనవైపు తిప్పుకోగలిగింది. దీన్ని చూసిన మిగతా సంస్థలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి డేటా ధరలు పూర్తిగా తగ్గించక తప్పలేదు. 

ఇలా కుబేరుల జాబితాలో ముకేశ్ ర్యాంక్ పెరుగుదల
ఫోర్బ్స్ వెలువరించిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్‌ ఆరు స్థానాలు పైకి ఎగబాకడానికి ఈ జియో సంస్థ ఉపయోగపడింది. గతంలో ప్రపంచ కుబేరుల్లో 19వ స్థానంలో కొనసాగిన ఆయన ప్రస్తుతం 13వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే చౌక మొబైల్ డాటా ఇండియన్ల సొంతమైంది. తాజా ఫోర్బ్స్ జాబితా సైతం జియో వ్యాపారాన్ని ప్రశంసించగా, ముకేశ్ సంపద వృద్ధిలో దాని పాత్రనూ కొనియాడింది. 2016లో జియో 4జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

జింబాబ్వేలో గరిష్ఠంగా 75.20 డాలర్లు
అదే ఒక జీబీ డేటా పొందాలంటే యునైటెడ్ కింగ్ డమ్‌లో 6.66 అమెరికన్‌ డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లు ఖర్చు చేయాల్సిందే. ఒక జీబీ డేటా కోసం జింబాబ్వేలో అత్యధికంగా 75.20 డాలర్లు చెల్లించాల్సి వస్తే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఒక్క డాలర్, మరి కొన్ని చోట్ల అదే డేటాకు దాదాపు 50 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

చైనాలో ఒక జీబీ ఇంటర్నెట్ డేటా 9.89 డాలర్లు
ఒక జీబీ డేటా చైనాలో 9.89డాలర్లు, శ్రీలంకలో 0.87డాలర్లు, బంగ్లాదేశ్‌లో 0.99 డాలర్లు, పాకిస్థాన్‌లో 1.85 డాలర్లు పలుకుతోంది. ఆఫ్రికా దేశాల్లో రువాండా, సుడాన్, కాంగోల్లో ఒక జీబీ డాటా సగటు ధర డాలర్‌లోపే ఉండగా, గయానా, సెయింట్ హెలీనాల్లో మాత్రం 50 డాలర్లకు పైనే ఉందని కేబుల్ వెబ్ సైట్ పేర్కొన్నది. 

ఇలా కేబుల్’ వెబ్ సైట్ వివిధ దేశాల డేటాపై అధ్యయనం 
గతేడాది అక్టోబర్ 23 నుంచి నవంబర్ 28 వరకు ప్రపంచవ్యాప్తంగా 230 దేశాల్లో డాటా ధరలను వెబ్ సైట్ పరిశీలించింది. ఈ సందర్భంగా 6,313 మొబైల్ డాటా ప్లాన్లను ఒకదానితో మరొకదాన్ని పోల్చిచూసింది. భారత్‌లో వివిధ సంస్థలు విక్రయిస్తున్న 57 ప్లాన్లను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నది.

62.7 కోట్లకు భారత నెటిజన్లు 
ఈ ఏడాది భారత్‌లో ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య 62.7 కోట్లకు చేరవచ్చని అంచనా. స్మార్ట్‌ఫోన్ల ధరలు సామాన్యులకూ అందుబాటులో ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతుండటం నెటిజన్ల సంఖ్యను పరుగులు పెట్టిస్తున్నదని మార్కెట్ రిసెర్చ్ ఏజెన్సీ కాంతర్ ఐఎంఆర్బీ బుధవారం తెలిపింది. కాగా, స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. భారత్‌లో 43 కోట్ల స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios