Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ఎన్ఎల్ కనుమరుగేనా?! చరిత్ర పుటల్లోకి..

ఒకనాడు టెలిఫోన్ల రంగంలో రారాజు. ఆ మాటకు వస్తే అదే శరణ్యం కూడా. కానీ 1991లో పీవీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సంస్కరణల దరిమిలా టెలికం రంగంలోకి ప్రైవేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. నాటి నుంచి బీఎస్ఎన్ఎల్ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లు తయారైంది. అన్ని రకాల వసతులు, వనరులు ఉన్నా.. ప్రైవేట్ సంస్థల తర్వాతే వివిధ సర్వీసులను ప్రారంభించడానికి కేంద్రం అనుమతినిస్తున్న తీరు బీఎస్ఎన్ఎల్ పట్ల దాని సవతితల్లి ప్రేమను తెలియజేస్తోంది.

Govt tells BSNL to look at options, including closure
Author
New Delhi, First Published Feb 14, 2019, 10:22 AM IST

న్యూఢిల్లీ: ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అలంకారంగా మారిందేమో గానీ పీవీ హయాంలో ఆర్థిక సంస్కరణల పర్వం అమలు కాకముందు టెలిఫోన్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. నాడు వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఇక కనుమరుగు కాబోతున్నదా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

‘తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తేవడానికి గల మార్గాలను నిశితంగా పరిశీలించండి, వీటిలో వాటా విక్రయంతోపాటు మూసివేసే ప్రతిపాదనపై కూడా చర్చించండి’ అంటూ కంపెనీ ఉన్నతాధికారులను కేంద్ర టెలికం కార్యదర్శి అరుణా సుందరరాజన్ సూచించినట్లు తెలుస్తున్నది. 
ప్రభుత్వరంగ సంస్థల్లో అత్యధికంగా నష్టపోతున్న సంస్థ ఇదే కావడంతో దీనిని వదిలించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్ రూ.31,287 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకున్నది.

ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితులపై టెలికం కార్యదర్శికి బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారీ నష్టాలు, రిలయన్స్ జియో ప్రవేశంతో వ్యాపారంపై పడిన ప్రభావం, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్), ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రణాళికను అరుణా సుందర రాజన్ ముందు ఉంచారు.

బీఎస్ఎన్ఎల్ పునరుద్దరణలో భాగంగా అవసరమైతే వాటాలనైనా విక్రయించండని, వీలు కానీ పక్షంలో మొత్తం వ్యాపారానికి తాళం వేయండని కేంద్ర ప్రభుత్వానికి బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ్ అందచేసిన నివేదికలో సూచించినట్లు తెలుస్తున్నది. లేకపోతే ఆర్థికంగానైనా సహాయ సహకారాలు అందించండి అంటూ ఆయన కేంద్రానికి సూచించారు.

ఇతర టెలికం సంస్థల నుంచి పోటీ తీవ్రతరం కావడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీఎస్ఎన్ఎల్‌కు గోటిచుట్టు రోకలి పోటులాగా అధిక సంఖ్యలో సిబ్బంది ఉండటంతో వీరికి జీతాలు చెల్లించలేని స్థాయికి దిగజారింది. వీరిని తగ్గించుకోవడానికి వీఆర్‌ఎస్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. అలాగే పదవీ విరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 58 ఏండ్లకు తగ్గించే యోచనలోనూ సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది.

 ఒకవేళ వయస్సును కానీ తగ్గిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వేతన చెల్లింపుల్లో రూ.3 వేల కోట్ల వరకు ఆదా కానున్నది. ప్రస్తుతం సంస్థలో 56 ఏండ్ల నుంచి 60 ఏండ్లలోపు వయస్సు కలిగిన వారు సుమారుగా 67 వేల మంది ఉన్నారు. వీరిలో 50 శాతం మంది(33,846) వీఆర్‌ఎస్ తీసుకోవడానికి అర్హులు. 

మరోవైపు బీఎస్ఎన్ఎల్ వద్ద రూ.15 వేల కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ల తర్వాత సంస్థకే అధికంగా టెలికం వినియోగదారులు ఉన్నారు. కానీ వీరికి సరైన సేవలు అందించకపోవడం, 4జీ సేవల్లో జాప్యానికి తోడు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా సమస్యలు మరింత పెరుగడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత చుట్టుముట్టాయి.

2015-16లో రూ.4,859 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ ఆ తర్వాతి ఏడాది రూ.4,786 కోట్లకు తగ్గినా, మరుసటి ఏడాదిలో మాత్రం రూ. 7,992 కోట్లకు చేరుకున్నాయి. టెలికం రంగంలోకి ముకేశ్ అంబానీకి చెందిన జియో రావడంతో ఇతర సంస్థల నష్టాలు అమాంతం పెరిగాయి.

ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చిన మొత్తం నష్టంలో బీఎస్‌ఎన్‌ఎల్ వాటా 25 శాతంగా ఉన్నది. ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1.89 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. టెలికం రంగంలోని పోటీ వల్ల కాల్ చార్జీలు పెంచడానికి ఏ సంస్థా సాహసించడం లేదు.

పెంచితే ఉన్న కస్టమర్లు వెళ్లిపోతారనే భయం ఒకవైపు..మరోవైపు రోజు రోజుకు పెరుగుతున్న నిర్వహణ ఖర్చు లు తడిసి మోపెడు అవుతున్నాయి. ల్యాండ్‌లైన్ చార్జీలు మొబైల్ కాల్‌రేట్ల కంటే తక్కువగా ఉండటం కూడా ప్రభావాన్ని మరింత పెంచింది. 2015-16లో రూ.32, 411 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..ఆ తర్వాతి ఏడాదికి రూ.31,533 కోట్లకు తగ్గగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.27,818 కోట్లకు పడిపోయింది.

ప్రైవేటు టెలికం ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ప్రతినిధులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే సంస్థకు నష్టాలు కలిగించి ఆ పేరుతో ఉద్యోగులకు అమలు చేయాల్సిన వేతన, పెన్షన్ సవరణ, న్యాయబద్దమైన డిమాండ్స్‌ను తిరస్కరిస్తున్నదని తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్ పరిరక్షణ, అభివృద్ధి కోసం తమ డిమాండ్స్‌ను ఆమోదించాలని కోరుతూ ఉద్యోగ, అధికారుల సంఘాలన్నీ ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ప్రతినిధులు చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios