Asianet News TeluguAsianet News Telugu

ఆమెజాన్ వర్సెస్ ఫ్లిప్‌కార్ట్: ఎవరికేది బెనిఫిట్.. 9లోగా జవాబివ్వాలి

సంప్రదాయ వర్తకుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ-కామర్స్‌పై ముసాయిదాను ప్రకటించింది. ఈ ముసాయిదాపై ఈ నెల తొమ్మిదో తేదీలోగా సదరు ఈ-కామర్స్ సంస్థలు అభిప్రాయాలు చెప్పడానికి కసరత్తు చేస్తున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఈ-కామర్స్‌లో మరింత పారదర్శకతకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.

Firms scramble to reply to draft ecommerce policy within a week
Author
Hyderabad, First Published Mar 5, 2019, 1:44 PM IST

ప్రతి ఇంటిలోనూ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు సాధారణం అయ్యే పరిస్థితులు వచ్చాయి. దేశీయ ఈ- కామర్స్‌ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ఈ-కామర్స్ మేజర్లు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ-కామర్స్ సంస్థలు ఇస్తున్న రాయితీలు, ఆయా సంస్థల విధానాలతో తమ మనుగడ దెబ్బతినకుండా చూడాలని ట్రెడిషినల్ ట్రేడర్లు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దేశీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య సమతూకం పాటించేలా, నూతన నిబంధనల ముసాయిదాను గత నెల చివర్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి అమల్లోకి వస్తే, ఏ సంస్థలు లాభపడతాయి, ఎవరికి నష్టం జరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారం సుమారు రూ.2.8 లక్షల కోట్ల (40 బిలియన్‌ డాలర్ల)కు చేరిందని అంచనా. దేశీయ సంస్థలు రంగంలో ఉన్నా, అమెరికా దిగ్గజాలు అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మధ్యే ప్రధాన పోటీ పెరుగుతోంది. 

అమెజాన్‌ తన అనుబంధ సంస్థ ద్వారా, దేశీయ అగ్రగామి ఆన్‌లైన్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అధికవాటాలు కొనుగోలు ద్వారా వాల్‌మార్ట్‌ ఈ-కామర్స్‌ రంగంపై పట్టు సాధించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉన్నా,  ‘వెచ్చించే ప్రతి రూపాయికి తగిన విలువ పొందాలన్నది’ దేశీయుల దృక్పథం. 

ఇందుకు అనుగుణంగానే వినియోగదారుల మన్ననలు పొందేందుకు, దుకాణాలకు వెళ్లే కొనుగోలుదార్లను, తమ పోర్టళ్లపైకి ఆకర్షించేందుకు భారీ రాయితీ అమ్మకాలపై ఈ- కామర్స్‌ సంస్థలు దృష్టి సారించాయి. కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుని, అత్యధిక అమ్మకాలకు ఆస్కారం ఉన్న కొన్ని మోడళ్ల స్మార్ట్‌ఫోన్లను కేవలం తమ పోర్టల్‌ ద్వారానే అమ్ముతున్నాయి.

ఇందువల్ల మార్కెట్‌లో పోటీకి ఆస్కారం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ-కామర్స్‌ సంస్థల కొనుగోళ్లు, స్వాధీనతలు చోటుచేసుకున్నాయి. నకిలీ ఉత్పత్తులు సరఫరా చేసే వ్యాపారుల వివరాలు, ఖాతాదారుల సమాచారం పంచుకోవడం కూడా ఈ-కామర్స్‌ సంస్థల మధ్య జరుగుతోంది.

ఆర్థికంగా పటిష్టమైన ఈ- కామర్స్‌ సంస్థలు అనుసరిస్తున్న విధానాల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని సంప్రదాయ వ్యాపారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ- కామర్స్‌ సంస్థలు మాత్రం తమ వేదికను వినియోగించుకుని, వ్యాపారులే తమ ఉత్పత్తులు విక్రయించుకుంటున్నారని పేర్కొంటున్నారు.

ఏటా ఆయా సంస్థలకు వస్తున్న రూ.వందల కోట్ల నష్టాలు చూస్తుంటే, ప్రోత్సాహకాలకు ఎంతగా వెచ్చిస్తుందీ అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో దేశీయ సంస్థలను కాపాడాలనే వాదనా మొదలైంది. ఈ పరిస్థితుల్లో నూతన విధానాల ముసాయిదాను విడుదల చేసి, ఈనెల 9లోపు అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది.

మన వినియోగదారుల ఆర్థిక లావాదేవీల వివరాలు (డేటా) దేశీయంగానే నిల్వ చేయాలన్న ఆదేశాలు విదేశీ సంస్థలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎన్నారైలు అధికంగా ఉన్న పరిస్థితుల్లో, డేటాను విభజించడం సంక్లిష్టమైన పనే అని, ఇది కొన్ని దేశీయ సంస్థలకు మేలు చేయడానికే విధించారనే ఆరోపణను విదేశీ సంస్థలు చేస్తున్నాయి.

బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీ) వినియోగదారుల కొనుగోలు/ఉత్పత్తులు-సేవల పరిశీలన ధోరణి బట్టి, కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సహకారంతో, భారీ డేటాను నమోదు చేస్తున్నాయి. కస్టమర్ల అభిరుచికి అనుగుణమైన వాటిపై ఆఫర్లు, సమీప ప్రాంతాల్లో అవి లభ్యమయ్యే చిరునామాలను అందిస్తున్నాయి. 

ఈ సమాచారాన్ని చిన్న సంస్థలకూ అందివ్వాలనడం మంచిదైనా, కీలక వ్యవస్థలను బహిరంగ పరచడం ఇంటర్నెట్‌ కంపెనీలకు కష్టమే. తమ పోర్టల్‌ ద్వారా సరకు విక్రయిస్తున్న వ్యాపారుల వివరాలను ఈ- కామర్స్‌ సంస్థలు బహిర్గతం చేయాల్సి వస్తుంది. కొనుగోలుదారుకు సమస్య వస్తే వారంలో పరిష్కరించాల్సి రావడానికి వీలుగా వ్యాపారుల ఫోన్‌ నెంబర్లు, ఈ-మెయిల్‌ వివరాలు కూడా ప్రదర్శించాలి.

తాజా ముసాయిదా అమలులోకి వస్తే అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు తమ వ్యాపార విధానాన్ని గణనీయంగా మార్చుకోవాల్సి వస్తుంది. దిగ్గజ సంస్థలు తమ దగ్గర ఉన్న సమాచారం చిన్న సంస్థలతో పంచుకోవాల్సి వస్తుంది. నకిలీ ఉత్పత్తుల నిరోధానికి పోరాడాల్సి వస్తుంది. ఇలా చేయడం, ఈ-కామర్స్‌ సంస్థలకు మేలు చేస్తుందన్నది విశ్లేషకుల అంచనా.

ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై దేశీయంగా నియంత్రణ అంతంత మాత్రంగానే ఉంది. ఫిర్యాదులు వచ్చినపుడు మినహా తనిఖీలు తక్కువే. స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండా, ఉబర్‌ఈట్స్‌ వంటి యాప్‌ల ద్వారా కోరుకున్న రెస్టారెంట్‌ నుంచి ఆహారం తెప్పించుకోవడం పెరుగుతోంది. తగిన ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను ఈ సంస్థలు తమ జాబితా నుంచి తప్పించడం, ప్రజలకు మేలు చేసేదే.

ఇప్పటివరకు రూ.5,000లోపు విలువైన వ్యక్తిగత బహుమతులకు దేశీయంగా సుంకాలు విధించడం లేదు. ఈ నిబంధన తక్కువ విలువ ప్రకటిస్తూ, ఒకే చిరునామాకు భారీ బహుమతులను కూడా చైనా సంస్థలు క్లబ్‌ ఫ్యాక్టరీ, రోవె, షీన్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థలు సరఫరా చేశాయి.

దీనిని కస్టమ్స్‌ విభాగం గుర్తించింది. ఇకపై విదేశాల నుంచి మన దేశ చిరునామాకు వచ్చే బహుమతులు దేశంలో నమోదైన సంస్థ ద్వారా, కస్టమ్స్‌ మార్గంలోనే రావాల్సి వస్తుంది. ఇందువల్ల మోసపూరిత సంస్థలు తమ కార్యకలాపాలు నిలిపి వేయవచ్చు.

ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలు నిలిస్తే, ఈ రంగంలోకి పెట్టుబడులు తగ్గొచ్చు. ఇది తీవ్రమవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఉత్పత్తిలో 25 శాతానికి మించి ఒకే సంస్థ విక్రయించకుండా చూసే నిబంధన వల్ల, సాధారణ దుకాణాలకూ అవి చేరతాయి. వాస్తవానికి 80% అమ్మకాలు దుకాణాల్లోనే జరుగుతున్నాయి.

అందువల్ల వీరిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కంపెనీలూ గుర్తించాయి. శామ్‌సంగ్‌, సోనీ వంటి సంస్థలు తాము నిర్ణయించిన ధర కంటే, తక్కువకు ఏ ఉత్పత్తిని విక్రయించడానికి వీలులేదని ఇప్పటికే హెచ్చరికలు చేశాయి. ఈ మార్పులతో, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.10వేల కోట్లకు పైగా అదనపు వ్యాపారం సంప్రదాయ దుకాణాలకు వస్తుందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios