Asianet News TeluguAsianet News Telugu

ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం.. మా లెక్క తప్పదు: నందన్‌

సంస్థ ఇన్వెస్టర్లలో విశ్వాసం ప్రోది చేసేందుకు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని పూనుకున్నారు. దేవుడే చెప్పినా మా లెక్క తప్పదని, సంస్థ లావాదేవీల్లో గానీ, ఆరోపణలపై దర్యాప్తు విషయంలో గానీ తమ అంచనాలు పద్దతులు తప్పవని స్పష్టం చేశారు. సంస్థ టాప్ మేనేజ్మెంట్‌పై ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం అని సంస్థ ఇన్వెస్టర్ల భేటీలో పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, మాజీ ఉద్యోగులపై ఆరోపణలు హేయమైనవన్నారు.

Even God can not change Infosys numbers says Chairman Nandan Nilekani
Author
Hyderabad, First Published Nov 7, 2019, 10:31 AM IST

న్యూఢిల్లీ: స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని తేల్చి చెప్పారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతిక విధానాలకు పాల్పడుతున్నదంటూ ప్రజావేగులు చేసిన ఆరోపణలు అవమానకరమైనవని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు.

మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను నందన్ నిలేకని ఖండించారు.  ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నారు.

భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నీలేకని వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

also read అంతా అనుకున్నట్లే.. బీఎస్ఎన్ఎల్‌లో 80 వేల మందికి వీఆర్‌ఎస్

‘ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని నందన్ నిలేకని తెలిపారు. 

Even God can not change Infosys numbers says Chairman Nandan Nilekani

టాప్‌ మేనేజ్‌మెంట్‌పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియజేస్తామని నీలేకని పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ సంస్థ అభివ్రుద్ధికి కట్టుబడి రెండేళ్లుగా చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు.

రెండేళ్లుగా నిబద్ధతతో సంస్థలో ప్రధాన వ్యాపారంలో పరివర్తన తీసుకు వచ్చేందుకు పని చేశానని, సంస్థ ఉద్యోగుల నుంచి వచ్చిన హ్రుదయ పూర్వక సందేశాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని సలీల్ పరేఖ్ తెలిపారు. ప్రజా వేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్ బోర్డు జరుపుతున్న స్వతంత్ర దర్యాప్తుపై తనకు గౌరవం ఉందన్నారు. ఈ ప్రక్రియకు చాలా దూరంగా ఉన్నాని చెప్పారు. 

also read  వాట్సాప్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్‌లో కొత్త ఫీచర్

ఇదిలా ఉండగా ప్రజావేగుల ఫిర్యాదుల నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. దీనిపై స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. 

దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలు అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్‌ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్‌ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేస్తామంటూ ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది. అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెక్’కూడా విచారణ ప్రారంభించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios