Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ఎన్ఎల్‌లో సంక్షోభం.. 35 వేల మందికి ఉద్వాసన

1990వ దశకం వరకు ఫోన్ అంటేనే బీఎస్ఎన్ఎల్.. కానీ టెక్నాలజీ ప్లస్ ప్రైవేట్ టెలికం ప్రొవైడర్ సంస్థలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. క్రమంగా దాన్ని తెరమరుగు చేసే ప్రక్రియ మొదలైందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

BSNL freezes employee benefits, plans VRS for 35,000 employees to cut down expenditure
Author
New Delhi, First Published Feb 12, 2019, 1:20 PM IST

ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఎల్‌టీసీ తదితర ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 35వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) అమలు చేయాలని భావిస్తోందని సంస్థ సీఎండీ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు.

వ్యయ నియంత్రణ చర్యలతో గతేడాది దాదాపు రూ. 2,500 కోట్ల మేర ఆదా చేయగలిగామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పొదుపు చర్యలు కొనసాగించాలని భావిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో ఉద్యోగులకు ఎల్‌టీసీ తదితర ప్రయోజనాల విలువ సుమారు రూ. 625 కోట్ల మేర ఉంటుందని పేర్కొన్నారు.

సాధారణంగా ప్రైవేట్‌ రంగ టెల్కోల్లో 25,000– 30,000 మంది ఉద్యోగులు ఉంటుండగా, బీఎస్‌ఎన్‌ఎల్‌లో దానికి దాదాపు అయిదు రెట్లు అధికంగా 1.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి వ్యయాలు వార్షికంగా రూ.15 వేల కోట్ల స్థాయిలో ఉన్నాయి.

‘విద్యుత్, అడ్మినిస్ట్రేషన్‌ పరమైన వ్యయాలను తగ్గించుకుంటున్నాం. అలాగే ఉద్యోగులకిచ్చే ప్రయోజనాలను ఫ్రీజ్‌ చేస్తున్నాం. ప్రస్తుతానిౖకైతే ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) మొదలైన ప్రయోజనాలు అందించడం లేదు. వైద్య చికిత్స వ్యయాలను కూడా నియంత్రిస్తున్నాం’ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. 

బీఎస్ఎన్ఎల్ పునర్‌వ్యవస్థీకరణ కోసం ‘ఐఐఎం అహ్మదాబాద్‌’ రూపొందించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు, త్వరలో తుది నివేదిక ఇవ్వనున్నట్లు సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.  రూ.13,000 కోట్ల వ్యయంతో సుమారు 35,000 మంది సిబ్బందికి వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ చేసే ప్రతిపాదన కూడా ఈ సిఫార్సుల్లో ఉన్నట్లు చెప్పారు. 

వీఆర్‌ఎస్‌ ప్యాకేజీకి కావాల్సిన నిధులను సమీకరించుకునే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్  సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్రభుత్వ సాయం కోరడం లేదా తక్కువ వడ్డీకి రుణాల రూపంలో సమకూర్చుకోవడం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. 

వ్యయ నియంత్రణ చర్యలపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందా? అంటే అదృష్టవశాత్తూ కంపెనీని నిలబెట్టేందుకు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రైవేట్‌ టెల్కోలతో పోటీపడలేక నానా తంటాలు పడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. 2016లో రిలయన్స్‌ జియో రాకతో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios