Asianet News TeluguAsianet News Telugu

‘మీటూ’ ఎఫెక్టేనా?!: ఫ్లిప్ కార్ట్ సీఈఓ కం చైర్మన్ గా బిన్నీ బన్సల్ రిజైన్!!

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ కుదుపునకు గురైంది. సంస్థ సీఈఓ కం చైర్మన్ గా ఉన్న కో ఫౌండర్ బిన్నీ బన్సల్ తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత దుష్ర్పవర్తన వల్లే ఆయన వైదొలుగాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీనిపై ఆయన సమాధానంలో పారదర్శకత లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో బాధాకరమైన పరిస్థితుల్లోనే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చునని వాల్ మార్ట్ పేర్కొంది. దీంతో ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ సంస్థను వీడినట్లయింది. 

Binny Bansal resigns from Flipkart over allegation of sexual assault
Author
Mumbai, First Published Nov 14, 2018, 10:40 AM IST

ముంబై: ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌,  గ్రూప్ సీఈవో కం చైర్మన్ బిన్నీబన్సల్ (37) అనూహ్యంగా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు రావడంతో పదవినుంచి తప్పుకున్నారు. బిన్నీ బన్సల్ రాజీనామాను ఆమోదించిన వాల్మార్ట్ తక్షణం అమలులోకి వస్తుందని ఒక ప్రకటన జారీ చేసింది. అయితే అంతర్జాతీయ వార్తాసంస్థ ‘రాయిటర్స్’ తెలిపిన వివరాల ప్రకారం కొన్నేళ్ల క్రితం ఒక మహిళపై బిన్ని బన్సల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది. 

కొన్నేండ్లు ఫ్లిప్‌కార్ట్‌తో పనిచేసిన ఉద్యోగిని ఫిర్యాదు నుంచి వచ్చిందని సమాచారం. జూలైలో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె సొంతంగా ఓ వెంచర్‌ను నిర్వహిస్తున్నదని సన్నిహిత వర్గాల సమాచారం.  మరోవైపు బన్సల్‌పై వచ్చిన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణల విషయమై పూర్తి వివరాలను వాల్‌మార్ట్ బయట పెట్టలేదు. దీనిపై స్పందించేందుకు బిన్ని బన్సల్ అందుబాటులోకి రాలేదు.  

బిన్నీబన్సల్ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్లువెత్తాయి. కానీ ఈ ఆరోపణలను  బిన్సీ బన్సాల్ తోసిపుచ్చారు. అయితే ఈ ఆరోపణలపై  ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సంయుక్తంగా స్వతంత్ర విచారణ  చేపట్టాయి. బన్సల్‌ ఆరోపణలను  తిరస్కరించినప్పటికీ తాము విచారణ చాలా జాగ్రత్తగా, నిశితంగా చేశామని వాల్‌మార్ట్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

బిన్నీ బన్సల్‌పై వచ్చిన ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ తరఫున స్వతంత్ర దర్యాప్తు జరిగిందని, ఇందులో బన్సల్ తప్పుచేసినట్లు ఎలాంటి రుజువులు లభించలేదని వాల్‌మార్ట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. కానీ ఈ మొత్తం వ్యవహారం బాధించడం వల్లే బన్సల్ రాజీనామాకు సిద్ధపడి ఉండొచ్చనన్నది. కాగా, బన్సల్‌పై ఫిర్యాదుదారు ఆరోపణల్ని బలపరిచే సాక్ష్యాలు విచారణలో ఏమీ దొరుకకున్నా, ఓ అంతర్జాతీయ న్యాయ సంస్థతో నిర్వహించిన ఈ దర్యాప్తులో పారదర్శకత లోపించినట్లు వాల్‌మార్ట్ అభిప్రాయపడింది. 

తీర్పులో ఇతర లోపాలను, ముఖ్యంగా బిన్నీ సమాధానంలో పారదర్శకత లేని కారణంగా బిన్నీ రాజీనామాను ఆమోదించామని తెలిపింది. బిన్నీ స్థానంలో ఫ్లిప్ కార్ట్ సీఈవోగా ప్రస్తుతం మైంత్రా, జబాంగ్‌ విభాగాల సీఈవోగా ఉన్న కల్యాణ్ కృష్ణమూర్తి బాధ్యతలు నిర్వహిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాంలుగా ఉన్న మింత్రా, జబాంగ్‌ను కలపనున్నామని పేర్కొంది. 

తాజా పరిణామాల నేపథ్యంలో సంస్థ ఉద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని, సంస్థ నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి మార్పులుండవని ఫ్లిప్ కార్ట్ కొత్త సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఆరోపణలు దురదృష్టకరమని, బన్సల్‌కు ఇప్పుడు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా అమెజాన్‌ మాజీ ఉద్యోగులైన సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ 2011లో  ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్‌  ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేయడంతో సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోయారు. బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా ఉన్నారు. ఈ-కామర్స్‌ మార్కెట్‌లో మెగాడీల్‌గా పేరొందిన  ఈ ఒప్పందం జరిగిన  కొన్ని నెలల వ్యవధిలోనే  తాజా పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఇద్దరూ కంపెనీని వీడినట్టయింది.

దీనిపై బిన్నీ బన్సాల్ ఒక ప్రకటన చేస్తూ ‘మరో రెండు క్వార్టర్‌లు కంపెనీలో కొనసాగాలనుకున్నాను. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి పరీక్షా సమయం. సీఈవోగా రాజీనామా చేసినా ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారుడిగా, బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతాను’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios