Asianet News TeluguAsianet News Telugu

సిడ్నీ టీ20: కసితో పోరాడి భారత్‌ను గెలిపించిన కోహ్లీ

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించింది. 

Australia vs India, 3rd T20 updates
Author
Sydney NSW, First Published Nov 25, 2018, 2:30 PM IST

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించింది. వికెట్లు పడుతున్నప్పటికి సంయమనంతో ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌ను భారత స్పిన్నర్లు ముప్పు తిప్పలు పెట్టారు. స్పిన్ మాయాజాలంతో ఆసీస్‌కు పరుగులు చేయడం కష్టంగా మారింది.

అయినప్పటికీ ఓపెనర్లు ఫించ్, షార్ట్ తొలి వికెట్‌కు 68 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కులదీప్ విడదీశాడు. అనంతరం షార్ట్, మెక్‌డెర్మాట్, మాక్స్‌వెల్, అలెక్స్ కారీలను ఔట్ చేశాడు.

ఈ దశలో ఆసీస్ 150 పరుగుల మార్క్‌ను చేరుకుంటుందా లేదా అన్న అనుమానం కలిగింది. అయితే భారత ఫీల్డింగ్ పేలవంగా ఉండటంతో  కౌల్టర్ నైల్, స్టోయినిస్‌లు బౌండరీలు బాది జట్టు స్కోరును నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులకు చేర్చారు.

ఈ మ్యాచ్‌లో బెరెన్‌డార్ఫ్ స్థానంలో మిచెల్ స్టార్క్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే భారత్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా రెండు టీ20లకు ఏ జట్టును కొనసాగించిందో అదే జట్టుతో బరిలోకి దిగింది.

ఆసీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలుత ఓపెనర్ల దూకుడుతో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే కొద్దిసేపటికే రోహిత్, ధావన్ అవుట్ అయ్యారు.

ఆ తర్వాత బరిలోకి వచ్చిన లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్ కూడా వెంటనే అవుట్ అవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే దినేశ్ కార్తీక్ సాయంతో కోహ్లీ జట్టును గెలిపించాడు.

చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోహ్లీ 61, శిఖర్ ధావన్ 41, రోహిత్ 23 పరుగులు చేశాడు. దీంతో సిరీస్ 1-1 తేడాతో సమమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios