Asianet News TeluguAsianet News Telugu

జార్జి రెడ్డి మూవీపై వివాదం: కారణాలు ఇవీ...

ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జిరెడ్డిపై సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ వివాదాలకు కారణం రెండు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాల మధ్య ఘర్షణే కారణమా...

Why the controversy created around George Reddy movie
Author
Hyderabad, First Published Nov 19, 2019, 5:52 PM IST

జార్జిరెడ్డి సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎందుకు ఈ వివాదాలు ముసురుకుంటున్నాయనేది చాలా మందికి తెలిసి ఉండదు. జార్జిరెడ్డి కథ 1970 దశకంనాటిది. అది జార్జిరెడ్డి కథ మాత్రమే కాదు, హైదరాబాదులోని ఉస్మాయా విశ్వవిద్యాలయం చరిత్ర కూడా. నక్సలైట్ ఉద్యమానికి తెలంగాణలో పాదులు పడిన రోజులు. శ్రీకాకుళం పోరాటం నేపథ్యంలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. 

కమ్యూనిస్టు చీలిపోయి అతివాదులు పీపుల్స్ వార్ పేరిట నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పాయకు చెందిన తొలితరం విద్యార్థి జార్జిరెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ లెఫ్ట్ రాజకీయాల పంథాలో విద్యార్థి ఉద్యమాన్ని నడిపివాడు ఆయన. ఉస్మానియాలో రైట్ వింగ్ విద్యార్థి సంఘం కూడా ఉండేది. ఈ రెండు పాయల మధ్య ఘర్షణలు చెలరేగుతూ ఉండేవి. 

Also Read: మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

తొలుత పిడిఎస్ పేరు మీద లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘం ఏర్పడి పనిచేస్తూ ఉండేది. దీనికి జార్జిరెడ్డి ప్రతినిది. ప్రతినిధి మాత్రమే కాదు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు. ఇప్పటికీ లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘానికి ఆయనే స్ఫూర్తి. అతని మీద పాటలు కట్టి పాడుతూ ఉంటారు. 

"కాలేజీ కుర్రవాడ, కులాసాగా తిరిగెటోడ, విలాసాల మాట మరువరో విద్యార్థి, విప్లవాల బాట నడవరో విద్యార్థి" అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 1983 వరకు లెఫ్ట్ వింగ్ ఉద్యమం బలంగా ప్రవహిస్తూ ఉండేది. నక్సలైట్ పార్టీల్లో చీలికలు వచ్చినట్లుగానే వాటికి అనుబంధంగా లేదా వాటి సిద్ధాంతాల బాటలో నడిచే విద్యార్థి సంఘాలు కూడా చీలిపోతూ వచ్చాయి. జార్జిరెడ్డి ప్రారంభించిన పిడిఎస్ క్రమంగా పిడిఎస్ యు (ప్రగతిశీల విద్యార్థి సంఘం) గా మారింది. పిడిఎస్ యుకు ఇప్పటికీ జార్జి రెడ్డి స్ఫూర్తి. 

Also Read: 'జార్జి రెడ్డి'పై చిరు ఇంటరెస్టింగ్ కామెంట్స్!

సిద్ధాంత వైరుధ్యాలు, ఘర్షణలు ప్రస్తుత వివాదానికి కారణమవుతున్నాయి. జార్జిరెడ్డి సినిమాపై ప్రచారం చూస్తుంటే ఆయన హీరోయిజాన్ని ఎత్తిచూపే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ చూసినా అదే కనిపిస్తోంది. జార్జిరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలో హత్యకు గురయ్యాడు. ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించే రైట్ వింగ్ విద్యార్థి సంఘం నాయకులు ఆయనను హత్య చేశారని చెబుతూ ఉంటారు. పిడిఎస్ యు నాయకులు ఇప్పటికీ అదే ఆరోపణ చేస్తూ ఉంటారు. 

ఈ నేపథ్యంలోనే జార్జిరెడ్డి మూవీ ఏ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా ఉంటుంది, జార్జిరెడ్డి నాయకత్వాన్ని, ఆయన నడిపిన ఉద్యమాన్ని సానుకూల దృక్పథంతో చూపిస్తే రైట్ వింగ్ రాజకీయాలు నడిపేవారికి కాస్తా ఇబ్బందిగానే ఉండవచ్చు. అందుకే ఎబీవీపి కార్యకర్తలు జార్జిరెడ్డి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. సినిమా తీస్తున్నవారిని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. 

అదే సమయంలో జార్జిరెడ్డిని తక్కువ చేసి చూపిస్తే ఆందోళనకు దిగుతామని పిడిఎస్ యూ తెలంగాణ నేత రామకృష్ణ అన్నారు. అయితే, సమస్యల్లా ఎక్కడ వచ్చిందంటే, లెఫ్ట్ సిద్ధాంతం వెలుగులో కమర్షియల్ హంగులతో జార్జిరెడ్డి సినిమా నిర్మితమవుతున్నట్లు అర్థమవుతోంది. పైగా, విశేషమైన అభిమానులు ఉన్న పవన్ కల్యాణ్ ఆ సినిమాకు మద్దతు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేలా వ్యవహరించారు. ఆయన జార్జిరెడ్డి గురించి మాట్లాడారు.

Also Read: వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలో ఏ విధమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ను ప్రవేశపెడుతారు, ప్రేమ వ్యవహారాల వంటివి ఉంటాయా, అలాంటి సన్నివేశాలు ఉంటే జార్జిరెడ్డి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందా అనే అనుమానాలు బహుశా పీడిఎస్ యు కార్యకర్తలకు ఉండవచ్చు. అదే సమయంలో జార్జిరెడ్డి తలకెత్తుకున్న సిద్ధాంతాలను ప్రమోట్ చేసే విధంగా జార్జిరెడ్డి సినిమా తీస్తున్నప్పుడు తమపై నిందలు వేసే ఎలిమెంట్స్ ఉంటాయని ఎబీవీపీ కార్యకర్తలు అనుకుంటూ ఉండవచ్చు. 

అయితే, జార్జిరెడ్డి మీద సినిమా తీయడం కత్తి మీద సాము వంటిదే. ఆ కత్తి మీద సామును దర్శకుడు చేశాడనేది ఆసక్తికరమైన విషయం. ఏమైనా, సినిమా అనేది కల్పనతో కూడుకున్నది కాబట్టి అన్ని సినిమాలను చూసినట్లుగానే చూస్తే పోతుంది కదా అనేది కూడా ఉంది. ఏమవుతుందో చూద్దాం...

Follow Us:
Download App:
  • android
  • ios