Asianet News TeluguAsianet News Telugu

RTC Strike: కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ లోని డొల్లతనం ఇదే...

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు. అయితే, ఆ మాట చెల్లుబాటు అవుతుందా, డిస్మిస్ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులేమిటి చూద్దాం

RTC Strike: truth behind telangana government not serving removal orders despite self dismissal
Author
Hyderabad, First Published Oct 31, 2019, 5:44 PM IST

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్ ఎన్నడూ వినని, కనని ఒక వింత పదాన్ని వాడి 50 వేల మంది కార్మికులు "సెల్ఫ్ డిస్మిస్" అయిపోయారని తేల్చేశారు. మరి డిస్మిస్సో సెల్ఫ్ డిస్మిస్సో ఏదో ఒకటి అయినప్పుడు ఇంకా కార్మిక యూనియన్ తోటి చర్చలు జరపడానికి అధికారులను ఎందుకు పంపినట్టు? అసలు కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయిన తరువాత ఇంకా ఈ చర్చలేంటి? ఒక సంతకంతో 7000 రూట్లలో బస్సులను తిప్పుతానంటున్న కెసిఆర్ ఒక్క సంతకం పెట్టి కార్మికులు డిస్మిస్ అయిపోయారని ఆర్డర్స్ ఇవ్వొచ్చు కదా? పోనీ కోర్టులో కేసు ఉందనుకుందాం కోర్ట్ ఎమన్నా కొడతదా చెప్పండి?

Also read: RTC Strike: ప్రభుత్వం కాకి లెక్కలు, ఆర్టీసీ ఆర్థిక స్థితిపై వాస్తవాలు ఇవీ..

కెసిఆర్ గారు ఉద్యోగులు డిస్మిస్ అయినట్టు ఆర్డర్స్ ఇవ్వలేరు. అలా గనుక ఆర్డర్స్ ఇస్తే అవి చెల్లవు. కార్మికులు ఎమ్మటే సుప్రీమ్ కోర్టుకు పోయి ఆ ఉత్తర్వులు చెల్లవు అని తమకనుకూలంగా తీర్పు తెచుకోగలవు. కేసీఆర్ కు, అధికారులకు ఈ విషయం తెలియనిది కాదు. 

ఈ నేపథ్యంలో అసలు కార్మికులను తొలగించాలంటే పాటించాల్సిన పద్ధతులేంటి? కెసిఆర్ అవలంబించిన సెల్ఫ్ డిస్మిస్ల్ విధానం ఎందుకు తప్పో ఒక సారి చూద్దాం. 

మొదటగా కెసిఆర్ వాదిస్తున్నట్టు సమ్మె చట్ట విరుద్ధమా అనే ప్రశ్న గురించి మాట్లాడుకుందాము. సమ్మె చట్ట విరుద్ధమైతే ఈపాటికి చట్టానికి లోబడి పనిచేసే కోర్టులు సమ్మె చేస్తున్న కార్మికులను 27 రోజులైనా తొలగించదా చెప్పండి. కోర్టు తొలగించకపోగా, వారిని సమ్మె ఆపమని మేము చెప్పలేము అని అన్నది. దాని అర్థం ఏమిటి, సమ్మె చేయడం చట్ట బద్ధమే!

ఇప్పుడు అసలు ఈ సమ్మె నోటీసులు ఇచ్చిన దగ్గర నుండి ఫాలో అవ్వాల్సిన విధి విధానాలేంటో ఒకసారి చూదాం.  మొదటగా సమ్మె నోటీసును గుర్తింపు పొందిన కార్మిక సంఘం  ఇవ్వగానే యాజమాన్యం చర్చలకు పిలవాలి. ఈ సంస్థలకు గుర్తింపును ఇచ్చేది ప్రభుత్వమే. ఇలా గుర్తింపు పొందిన సంఘాలు నెల ముందు నోటీసులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం వారిని చర్చలకు పిలవాలి. కానీ కెసిఆర్ సర్కార్ చర్చలకు పిలవకుండా తాత్సారం చేస్తూ ఒక ఐఏఎస్ ల కమిటీ ని నియమించింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఆక్ట్ 1947 ప్రకారం ఇది చట్ట విరుద్ధం. మొదటగా చట్ట విరుద్ధమైన పనిని చేసింది ప్రభుత్వమే!

Also read: హైకోర్టు ఏమైనా కొడతదా..? : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు కార్మికుల సెల్ఫ్ డిస్మిసల్ విషయానికి వద్దాము. ఒక కార్మికుడిని తొలగించాలంటే, మొదటగా ఆ కార్మికుడు చేసిన తప్పేమిటో వివరిస్తూ షో కాజ్ నోటీసు జారీ చేయాలి. చేసిన తరువాత నిర్ణీత గడువు లోపు ఉద్యోగి నుండి వివరణ స్వీకరించాలి. తరువాత దాన్ని పరిశీలించాలి. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అప్పుడు ఆ సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ సస్పెన్షన్ కాలంలో ఆ సదరు ఉద్యోగికి సగం జీతం చెల్లించాలి కూడా. ఆ తరువాత ఫైనల్ స్టేజిలో డిస్మిస్ చేయాలి. 

మన కేసీఆర్ గారేమో ఈ పద్దతేది లేకుండా కార్మికులను డిస్మిస్ చేయకుండా, వారే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. తెలంగాణ సర్కార్ కార్మికులకు షో కాజ్ నోటీసు జారీ చేయకుండా డిస్మిస్ చేయలేదు. ఇది ఏ న్యాయస్థానంలోనూ నిలబడలేదు. 

Also read: huzurnagar result: హుజూర్‌నగర్‌‌లో ఆర్టీసీ బస్సు ఫెయిల్, కారు జోరుకు కారణం ఇదే..

గతంలో సకల జనుల సమ్మె సమయంలో ఇలా తొలగించవచ్చని తెలిస్తే ఉమ్మడి సర్కార్ ఊరుకునేదా? జయలలిత ఉద్యోగులను తొలగించినప్పుడు సుప్రీమ్ కోర్టులో ఎం జరిగిందో మనకు తెలియదా. సమ్మె చేయడం అనేది కార్మికుల నుండి విడదీయలేని హక్కు అని సుప్రీమ్ కోర్ట్ ఒక తీర్పులో తేల్చి చెప్పింది.  

ఈ నెల 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె 27వ రోజుకు చేరగా.. 17 మంది కార్మికులు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదొక విషయమైతే అనుభవం లేని ప్రైవేట్ సిబ్బంది బస్సులు నడపడం వల్ల ఎన్ని ప్రమాదలవుతున్నాయో మనం చూస్తున్నాము. అసలు నడిచే బస్సులే తక్కువయ్యాయి. ఉన్న కొద్దిపాటి బస్సులు కూడా రోడ్డు మీద బీభత్సము సృష్టిస్తున్నాయి. 

ప్రగతి రథ చక్రాల చోదకుల గుండె ఆగిపోతుంది. కొందరు కండక్టర్లు కూడా మృత్యువాత పడుతున్నారు. కొందరేమో ఆత్మ బలిదానాలకు పాల్పడుతున్నారు. సమ్మె ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట విరుద్ధం కాదు. కాకపోతే కార్మికులు తమ ఆత్మస్థైర్యాన్ని గుండె నిబ్బరాన్ని కోల్పోకూడదు. 

Follow Us:
Download App:
  • android
  • ios