Asianet News TeluguAsianet News Telugu

RTC Strike: చంద్రబాబును కాపీ కొడుతున్న కేసీఆర్, ఫలితమూ అదేనా...

తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మెపై మొండి పట్టు వీడడం లేదు. గతంలో విద్యుత్ సమస్యపై గళమెత్తిన ప్రజలపై చంద్ర బాబు ఏ వైఖరితో తీసుకున్నారో ఇప్పుడు కెసిఆర్ కూడా అలంటి వైఖరే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చరిత్ర చెబుతున్న పాఠాలు, గత ముఖ్యమంత్రుల తీరుతెన్నులను పరిశీలిద్దాం. 

RTC Strike: kcr mimicking the chandrababu ideas, will the result too be same...
Author
Hyderabad, First Published Nov 19, 2019, 3:30 PM IST

తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె సకలజనుల సమ్మెను కూడా దాటేసింది. హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతుంది. ఒక పక్కనేమో కార్మికులు, విలీనం డిమాండును పక్కన పెట్టాము, చర్చలకు పిలవండి అని వేడుకుంటున్నా, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం చర్చలు లేనే లేవు అని తెగేసి చెబుతున్నారు. కనీసం హైకోర్టు అయినా ఏమైనా చేస్తుందేమో అనుకున్న కార్మికులకు నిరాశే ఎదురైంది. 

కోర్టు తన పరిమితులకు లోబడి, చర్చలు జరిపమని కోరినా కెసిఆర్ గారు మాత్రం తన పట్టు వీడకుండా, కోర్ట్ ఎమన్నా కొడ్తదా అని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి, కార్మికులు ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు ప్రభుత్వం అలా చేయడానికి కారణాలను తరువాత చర్చించుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ ఆర్టీసీ సమ్మె పయనం ఎటు, సమ్మె ప్రభావం ఎమన్నా ప్రభుత్వం మీద పడుతుందా, చరిత్ర చెబుతున్న పాఠాలు ఏమిటో ఒక సారి చూద్దాం. 

ఉప ఎన్నిక ఫలితాలే గీటురాయా...?

ఆర్టీసీ సమ్మె నడుస్తున్నప్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నిక జరిగింది. ఇందులో అధికార తెరాస పార్టీ 43 వేల ఓట్ల పైచిలుకు ఓట్లతో విజయం సాధించింది. సమ్మె కాలంలోనే జరిగిన ఉప ఎన్నికలో తెరాస ఇంత బంపర్ మెజారిటీ సాధించడంతో, కెసిఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ, ప్రజలు తనకు బంపర్ మెజారిటీ ఇచ్చారని, ఆర్టీసీ సమ్మెపై "కెసిఆర్ యు ఆర్ రైట్" అని ప్రజలు తీర్పునిచ్చారని ప్రకటించారు.  

43 వేల మెజారిటీ అనేది చిన్న విషయం కాదు. అందునా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి సీటు, పోటీ చేస్తుంది అతని సతీమణి. ఈ నేపథ్యంలో ఇది అధికార పక్షానికి మంచి విజయమే. కాకపోతే సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పక్షానికి గెలుపవకాశాలు మెండు. పోల్ మానేజ్మెంట్ అనే అంశం ఎంత ఔనన్నా, కాదన్నా అధికార పార్టీకి ఒకింత కలిసొచ్చే అంశం. అందునా తెరాస పెద్ద తలకాయలన్నీ హుజూర్ నగర్ లోనే మకాం వేశారు. తమ అభ్యర్థి సైది రెడ్డిని గెలిపించుకున్నారు. 

RTC Strike: kcr mimicking the chandrababu ideas, will the result too be same...

ఒక వేళ ఉప ఎన్నిక ఫలితాలే గీటురాయి అనుకుంటే,  2017లో నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి అధికార టీడీపీ దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచింది. 2019 వచ్చేనాటికి 34 వేల ఓట్లతో ఓటమి చెందింది. ఉపఎన్నికల్లో గెలుపుతోని సంబంధం లేకుండా, సాధారణ ఎన్నికల ఫలితాలుంటాయనేది ప్రస్ఫుటం. 

Also read: ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మంత్రులవేనా: కేసీఆర్‌కు విజయశాంతి ప్రశ్నలు

తెరాస వారు చెబుతున్న మరో వాదన ఏమిటంటే గత దఫాలోన్ తాము 7వేల ఓట్ల తేడాతో ఒడామని, ఇప్పుడు ఆ 7వేల తేడాను పూడ్చుకోవడంతోపాటుగా మరో 43 వేళా మెజారిటీ అధికంగా తెచుకున్నామని, మొత్తంగా గనుక చూసుకుంటే, 50 వేల ఓట్లు తాము 5ఏండ్ల కాలంలో అధికంగా తెచుకోగలిగామంటున్నారు. పార్లమెంటు ఎన్నికలను పరిశీలిస్తే తెరాస ఓట్లు ఇంతకన్నా భారీ స్థాయిలో ప్రతిపక్షాలకు తరలినట్టు మనకు అర్థమవుతుంది. 

పార్లమెంటు ఎన్నికల్లో తెరాస కు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్లు గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు కరీంనగర్ పార్లమెంటరీ స్థానాన్ని తీసుకుందాము. అక్కడ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. తెరాస బాస్ కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కూడా ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకే వస్తుంది. ఇంకో సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహించే హుజురాబాద్ నియోజకవర్గం కూడా ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకే వస్తుంది. 

RTC Strike: kcr mimicking the chandrababu ideas, will the result too be same...

ఇక్కడ లెక్కలు గనుక తీసుకుంటే, కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 6 నియోజకవర్గాల్లో కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కు వచ్చిన ఓట్లు 8,67,703. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి తెరాస అనూహ్యంగా ఓటమి చెందింది. ఏకంగా 89,508 ఓట్ల తేడాతో ఓటమి చెందింది. 4,58,935 ఓట్లు కేవలం ఆరు నెల్ల కాలంలోనే అధికార తెరాస నుండి ప్రతిపక్షానికి బదిలీ అయ్యాయి. కరీంనగర్ లో గెలిచింది బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కాబట్టి ఏదో మోడీ మేనియా లో గెలిచాడు అని తెరాస చెబుతుంది. మరి మూడు స్థానాల్లో గెలిచినా కాంగ్రెస్ వారి పరిస్థితేంటి? దయనీయమైన స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ ముగ్గురు గెలిచారు. రెండు సీట్లలో వెంట్రుకవాసిలో ఓడిపోయారు. 

దానికి మాత్రం తెరాస నుండి సమాధానం లేదు. సారూ, కారు, పదహారు, ఢిల్లీ సర్కారు అని భావించిన కెసిఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. ఇప్పుడు ఆర్టీసీ విషయంలో కూడా ఆర్టీసీ కార్మికుల్లో పెరుగుతున్న వ్యతిరేకతనుఁ కెసిఆర్ కరెక్ట్ గా అంచనా వేయలేకపోతున్నారనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనము చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాజా చరిత్రే అందుకు నిదర్శనం. 

బషీర్ బాగ్ కాల్పులు... చంద్రబాబు ఒంటెద్దు పోకడలు

చంద్రబాబు నాయుడు 1999లో అప్పోర్వ విజయాన్ని అందుకున్నాడు. మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని అన్నప్పటికీ అది ఒక బ్రహ్మానందమైన విజయంగానే చెప్పుకోవాలి. ఉన్న 294 సీట్లలో 190 సీట్లు సాధించారు(బీజేపీ తోని పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ 10 సీట్లు సాధించింది). ఇంత బంపర్ మెజారిటీ వచ్చినప్పటికీ, 2004లో అడ్రస్ గల్లంతయ్యింది. కేవలం 47 సీట్లకు టీడీపీ పడిపోయింది. 

సంస్కరణల పేరుతో చేపట్టిన చర్యల వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబికింది. 2001, 2002 నాటికి ఉద్యోగ వర్గం ప్రభుత్వ వైఖరిపట్ల తీవ్రమైన కోపంతో ఒకింత వ్యతిరేకంగా మారారు. విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో చేసిన చర్యల వల్ల విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. దీనిపై నిరసనలు మిన్నంటాయి.

2000 సంవత్సరంలో అసెంబ్లీ ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చాయి. నిరసనకారులపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులకు ఆదేశించాడు. ముగ్గురు పౌరులు మృతి చెందారు. వారు మృతి చెందిన తరువాత వారికి  ఎక్స్ గ్రేషియాప్రకటించామని అడిగినా కూడా దానికి ఒప్పుకోలేదు సరికదా, కనీసం గాయపడ్డవారిని పరామర్శించడానికి ఆసుపత్రికి కూడా రాలేదు. 

ఇప్పుడు ప్రస్తుత కేసీఆర్ వైఖరి కూడా అలానే ఉంది. ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వారికి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పకపోగా, కనీసం వారికి సంతాపం కూడా తెలపలేదు. సంతాపం తెలుపకపోగా, వారి మృతదేహాల తరలింపు విషయంలో కుటుంబ సభ్యులకు తీవ్ర వేదనకు కూడా గురి చేసారు. 

ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నారు కదా అని కెసిఆర్ ను ప్రశ్నించగా ఆ చావులన్నిటికీ ప్రతిపక్షమే కారణం అని వారి మీదకు తోసేశారు. కారకులెవరైనా, తెలంగాణ ఉద్యమ సమయంలో కదం తొక్కిన ఆర్టీసీ కార్మికులు ఇలా మరణిస్తుంటే కనీసం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న కెసిఆర్ తీరు ఖచ్చితంగా ప్రజావ్యతిరేకతను దారి తీసే ఆస్కారం ఉంది. 

ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే ఖచ్చితంగా చార్జీలు పెరుగుతాయి. కెసిఆర్ గారు ఎంత పెరగవు అని చెప్పినా, నష్టాలతో మాత్రం ప్రైవేట్ కంపెనీలు బస్సులను నడపలేవు కదా. కెసిఆర్ గారు చెబుతున్న బెంగాల్ మోడల్ లో కూడా ప్రయివేట్ బస్సు సిండికేట్లు చార్జీలను పెంచమని చాలాసార్లు బస్సులను నడపడం బంద్ చేసారు. 

కాబట్టి ప్రైవేట్ బస్సుల వల్ల చార్జీలు పెరిగితే ఖచ్చితంగా అది ప్రజల్లో ఒకింత వ్యతిరేకతకు కారణం అవుతుంది. ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరిగి అది ప్రజా వ్యతిరేకతకు దారితీస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఉదంతమే మనకు నిదర్శనం. 199లో అంత బంపర్ మెజారిటీతో గెలిచినా చంద్రబాబు 2004లో ప్రజా వ్యతిరేకతలో  కొట్టుకుపోయాడు.  ఇప్పటికిప్పుడు కెసిఆర్ కి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా, భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇది కెసిఆర్ కు ప్రమాదకారిగా పరిణమిస్తుంది. 

ఉద్యోగులకు కెసిఆర్ ఫిట్మెంట్ ఇస్తానని ప్రస్తుతానికి మిగిలిన ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ సమ్మెకు దూరంగా ఉంచగలిగారు. ఒక వేళ ఫిట్మెంట్ అమలు చేయడంలో గనుక ఆలస్యం అయితే వారందరిలో లోలోపల ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో ఈ ఫిట్మెంట్ ఒకింత భారంగా పరిణమిస్తుంది. దీనిని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి. 

విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. జీతం పెన్షన్ ఇతరాత్ర డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇవ్వగానే ప్రభుత్వం ఆఘ మేఘాలమీద వారితోనే చర్చలు జరిపించి, సమ్మెను వాయిదా వేసుకునేలా చేయగలిగారు. తాజాగా 10వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని, అయితే అది ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వాలని, లేని పక్షంలో చార్జీలను పెంచాల్సొస్తుందని వారు తెలియజేశారు. 

ఉద్యోగులందరూ సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నూతన పెన్షన్ విధానం వద్దు, పాత విధానాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అన్ని పరిస్థితులను బట్టి చూస్తుంటే ఉద్యోగుల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా  ఉందనేది వాస్తవం. 

సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయా...?

బంపర్ మెజారిటీతో తెరాస సర్కారును ఏర్పాటు చేసి ఉండవచ్చు, ప్రజామోదయోగ్యమైన పథకాలను తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ అవి మాత్రమే గెలిపిస్తాయనుకుంటే పొరపాటే. ఉదాహరణకు ఎన్టీఆర్ ని తీసుకుంటే, 1989 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. 2 రూపాయలకే కిలో బియ్యం, పట్వారి వ్యవస్థ రద్దు వంటి ఎన్నో గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. అయినప్పటికీ ఓటమి చెందాడు. 

మరో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఆరోగ్య శ్రీ, ఫీజు రి ఎంబర్సుమెంట్ వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చాడు. 2009లో వారు గెలిచినప్పటికీ కూడా సీట్లు మాత్రం భారీ స్థాయిలో తగ్గాయి. ఈ నేపథ్యంలో కేవలం ప్రజాకర్షక పథకాలు మాత్రమే గెలిపిస్తాయి అని కూడా అనుకోలేము. 

ఇక్కడే మరో అంశం, కెసిఆర్ అనుకుంటుండొచ్చు తెలంగాణాలో ప్రతిపక్షం అనేదే లేదు కదా, కాబట్టి తనకొచ్చిన ఢోకా కూడా ఏమి లేదు అని. ఎన్టీఆర్ ఉదాహరణ మాత్రం మరోవిధంగా సమాధానం చెబుతుంది. ఎన్టీఆర్ 1989లో ఓటమి చెందినప్పుడు, రాష్ట్రంలో కాంగ్రెస్ దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. దేశంలో కూడా వారి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సమయం. వారు కేంద్రంలో కూడా అధికారం కోల్పోయిన వైనం. ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పవచ్చు. 

ప్రపంచ దార్శనిక నేతగా వరల్డ్ బ్యాంకు చేత కీర్తింపబడ్డ చంద్రబాబు నాయుడు పరిస్థితి 2004 వచ్చేసరికి ఎలా మారిపోయిందో కూడా మనము చూసాము. కాబట్టి పెరుగుతున్న అసంతృప్తి అనేది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. ప్రజల్లో ఇలా చిన్నగా మొదలైన అసంతృప్తి జ్వాలలు గనుక ఎక్కువైతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios