Asianet News TeluguAsianet News Telugu

చిరు ఎఫెక్ట్: చంద్రబాబు కన్నా ముందే పవన్, జగన్ తో..

జగన్ సర్కార్ పైన ఇసుక కొరత విషయంలో పవన్ భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. పవన్ ఇదంతా బాబు డైరెక్షన్లో చేస్తున్నాడని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులోని వాస్తవాలేంటి,నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం. 

pavan increases his attack on andhra pradesh government...the reasons behind
Author
Vijayawada, First Published Oct 29, 2019, 4:30 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఇసుక కొరతపై గళమెత్తి వైసీపీపై తుపాకీ ఎక్కుపెట్టాడు. భవన నిర్మాణ కార్మికుల కవాతు పేరిట రండి కలిసి పోరాడుదామంటూ ఆ వర్గానికి చెందిన ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ తమ మీద విరుచుకు పడుతుండడంతో పవన్ ని చంద్రబాబు ఏజెంట్ గా పేర్కొంటూ, బాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నాడంటూ పవన్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవిక పరిస్థితులు ఏమిటనేది ఒకసారి చూద్దాం. 

Also read: రండి కలిసి పోరాడుదాం: భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై పవన్ పిలుపు

వైసీపీని ఎన్నికల ముందు కూడా పవన్ టార్గెట్ చేసాడు అనే మాట వాస్తవం.అప్పుడు వైసీపీ శ్రేణులు పవన్ ని తీవ్రంగా విమర్శించాయి. అధికార పక్షాన్ని విమర్శించాలి కానీ ప్రతిపక్షాన్ని కాదని ఎద్దేవా చేసాయి. పవన్ పొరపాటు వల్లనే పవన్ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయాడు. అది గతం. 

ఇప్పుడు ప్రభుత్వం వైసీపీది. ఇప్పుడు కూడా పవన్ ని విమర్శ చేయొద్దు అనడం భావ్యం కాదు. ఇప్పుడు పవన్ విమర్శిస్తోంది వైసీపీని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని  ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎత్తి చూపుతున్నాడు. ఇప్పటికి కూడా పవన్ ని విమర్శ చేయొద్దనడం బాధ్యతాయుత ప్రభుత్వ లక్షణం కాదు. 

చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నాడనే మాట విషయానికి వస్తే, వాస్తవానికి ఇసుక కొరత సమస్యను తొలుత ఎత్తుకుందే పవన్. పవన్ కళ్యాణ్ ఆ విషయంపై మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత టీడీపీ ఫీల్డ్ మీదకు వచ్చింది. 

also read: ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మాజీకి జనసేన అండ.. పవన్ విరాళం

అప్పటివరకు టీడీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ, అరెస్ట్ అయిన తమ నేత చింతమనేని గురించో, పార్టీ మారాలని చూస్తున్న వల్లభనేని వంశీ గురించో ఆలోచించారే తప్ప వాస్తవ ప్రజా సమస్యలపై గొంతెత్తలేదు. 

పవన్ కళ్యాణ్ తన ఆరోపణలనైతే ఎక్కువ చేసాడనే మాట వాస్తవం. ఎందుకు పవన్ ఇలా చేస్తున్నాడు, దాని వెనుక కారణాలేంటో ఒకసారి చూద్దాం. 

మొదటగా అపోజిషన్ స్పేస్ పవన్ పొందడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏదన్నా కార్యక్రమం మొదలు పెడుతున్నాడంటే రాజకీయ నాయకులూ ఒకింత దాన్ని నిశితంగా గమనించేవారు. మీడియా కూడా అతనికి పూర్తి స్థాయి కవేరజ్ ఇచ్చేది. కానీ ఎన్నికలయిపోయిన తరువాత పవన్ కి అంత కవరేజ్ దొరకడం లేదు. ఇలా ఇప్పుడు ప్రజా సమస్యలను ఎత్తుకొని ఉద్యమిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా పవన్ కనిపించడం తథ్యం. దానికి తోడు ప్రజలు వెంటనడవడం మొదలుపెడితే మీడియా కవరేజ్ దానంతట అదే వస్తుంది. 

తాను రాజకీయాలను వీడి ఎక్కడికి వెళ్లడం లేదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని ఇవ్వాలనుకుంటుండొచ్చు. పవన్ సినిమాల్లోకి వెళ్ళిపోతున్నాడు అనే ప్రచారం చాల బలీయంగా బయట సోషల్ మీడియాలో సాగుతుంది. ఈ నేపథ్యంలో తాను ఎక్కడికి వెళ్లడం లేదు. రాజకీయాల్లోనే కొనసాగుతాను అనే విషయం బలంగా చెప్పినట్టవుతుంది. 

మరో అంశమేంటంటే, పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదు అని పదే పదే విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. వైసీపీ మాటల్లో గనుక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అని వారు పదే పదే విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ విమర్శలకు అడ్డు కట్ట వేసి తానొక ఫుల్ టైం యాక్టీవ్ పొలిటీషియన్ అని అనిపించుకోవడానికి కూడా ఇది అవసరం. 

pavan increases his attack on andhra pradesh government...the reasons behind

తాజాగా సైరా సినిమా ఇంటర్వ్యూలో చిరంజీవి కమల్,రజనీలకు రాజకీయాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చాడు. దీన్ని అదునుగా తీసుకొని కొందరు సోషల్ మీడియాలో చిరంజీవి బయటవారికే సలహాలు ఇచ్చాడంటే,సొంత తమ్ముడైన పవన్ కి ఇచ్చి ఉండడా? చిరు సలహా ఇచ్చాడు కాబట్టే పవన్ హల్చల్ తగ్గిందని పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అలంటి విమర్శలకు చెక్ పెట్టాలంటే పవన్ ఇలాంటి ప్రజాసమస్యలపైన పోరాడాల్సిందే. 

మరో కీలక అంశం ఏదన్నా ఉందంటే అది పార్టీలో జోష్ నింపడం. ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత పార్టీని ఒక్కొక్కరిగా నేతలు వీడుతున్నారు. ఎన్నికలకు ముందు పవన్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కూడా ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. ఇలా పార్టీ నుంచి ఇంతమంది బయటకు వెళ్లిపోతుండడంతో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. కాబట్టి శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపడం అత్యవసరం. అందుకోసమని ఇప్పుడు పవన్ ఇలాంటి ప్రజా ఉద్యమాలు చేయడం అనివార్యం. 

ప్రజల సమస్యలను ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత. ఇప్పుడు అది జనసేనానికి రాజకీయ అనివార్యత కూడా. దీనిని ఏదో బాబు డైరెక్షన్లో చేస్తున్నాడు అనడం సమంజసం కాదు. ప్రజాసమస్యలపైన పోరాటం చేసేటప్పుడు విపక్షాలు ఏకమవుతాయి. దాన్ని పట్టుకొని ఇరు పార్టీలు లాలూచీ పడ్డాయి అనడం కరెక్ట్ కాదు. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్,బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి. అంతమాత్రాన బీజేపీ,కాంగ్రెస్ కలిసినట్టా చెప్పండి? 

Follow Us:
Download App:
  • android
  • ios