Asianet News TeluguAsianet News Telugu

"మహా గరం": ఆర్ఎస్ఎస్ రాజీ ఫార్ములా, ఫడ్నవీస్ వెనక్కి, తెరపైకి గడ్కరీ

మహారాష్ట్ర రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఎంట్రీతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రాక నుంచి తప్పించారని బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన కొత్త పేరు ఎవరిది ఏమిటో చూద్దాం. 

maharashtra chief ministership: rss mediation...nitin gadkari the new dark horse
Author
Mumbai, First Published Nov 7, 2019, 12:43 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీ సీట్లు తగ్గడంతో 50-50 ఫార్ములాను ముందుకు తెచ్చిన శివసేన ఎంతమాత్రమూ వెనక్కు తగ్గడం లేదు. తొలుత ఎన్సీపీ తో కూడా కలవడానికి శివసేన సిద్ధపడింది. కాకపోతే ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి మాత్రం ప్రతిపక్షం లోనే కూర్చుంటామని చెప్పిన నేపథ్యంలో మరోసారి సందిగ్ధత ఏర్పడింది. 

ఇటు శివసేన కానీ, బీజేపీ కానీ ఎవరూ పట్టు వీడని నేపథ్యంలో రంగంలోకి ఆరెస్సెస్ దిగింది.  ఇందాక కొద్దిసేపటికింద సామ్నా పత్రిక ఎడిటర్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీకి వార్నింగ్ ఇచ్చాడు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని చెప్పారు. 

బీజేపీ  నుంచి ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి రిసార్టుకు మీ ఎమ్మెల్యేలను తరలించారు అని మీడియా అడిగిన ప్రశ్నకు అలంటి చర్యలు తీసుకోపవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, అయినా దమ్ముంటే ఎవరైనా ప్రయత్నించి చూడండంటూ సవాల్ విసిరాడు. 

మహారాష్ట్ర మైఖ్యమంత్రి పీఠంపై ఆరెస్సెస్ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోబోమని సంజయ్ రౌత్ అన్నారు. నేటి మధ్యాహ్నం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ కానున్నారు. 

Also read: "మహా" ప్రతిష్టంభన: రంగంలోకి భగవత్, హుటాహుటిన నాగ్ పూర్ కు గడ్కరీ

నాగపూర్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ల మధ్య మంగళవారం రాత్రి జరిగిన సమావేశం ప్రభుత్వ ఏర్పాటు  పై తాజా అవకాశాలను పరిశీలించారు. గడ్కరీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు భగవత్ అనుకూలంగా ఉన్నారని తెలియవస్తుంది.

నేటి మధ్యాహ్నం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కూడా మోహన్ భగవత్ ను కలవనున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీని మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేయనున్నార అనే సందేహాలు కలుగక మానవు. 

బిజెపి తోని గిల్లికజ్జాలాడుతున్న శివసేన కూడా గడ్కరీకి ఓకే చెప్పే ఆస్కారం ఉంది. ఒకరకంగా వారు దీన్ని విజయంగా కూడా భావిస్తారు. 

దివంగత శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే కు అత్యంత సన్నిహితుడు గడ్కరీ.  ముంబైలోని ఠాక్రేల నివాసమైన మాతోశ్రీకి రెగ్యులర్ గా వచ్చి వెళ్ళేవాడు.  శివసేనకు బీజేపీకి మధ్య వివాదాలు తెరమీదకు వచ్చినప్పుడల్లా నితిన్ గడ్కరీయే బీజేపీ దూతగా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దేవారు. 

1995 మరియు 1999 మధ్య శివసేన-బిజెపి ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ మంత్రిగా, గడ్కరీ పనిచేసారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు.  దివంగత శివసేన చీఫ్‌కు ఈ ప్రాజెక్ట్ మానస పుత్రిక.

Also read: మహా మలుపుల మహా రాజకీయం:శివసేన సంచలన ప్రకటన

పాత ముంబై-పూణే రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని నరక యాతన అనుభవిస్తున్న ప్రజలకు థాకరే, తాము అధికారంలోకి వస్తే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని మాట ఇచ్చారు..

గడ్కరీ దాదాపు రెండు దశాబ్దాలుగా ఠాక్రేలతో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుత శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కూడా మహారాష్ట్రలో గడ్కరీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వానికి విముఖత చూపెట్టకపోవచ్చు. 

105 సీట్లతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైన బిజెపి, శివసేన దానంతట అదే దారిలో పడుతుందని ఆశ పెట్టుకుంది. కాకపోతే శివసేన ససేమిరా అంటుంది. ఎంతమాత్రమూ తాను ఎక్కినా అలక పాన్పు దిగనంటోంది. దీనితో ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. 

గడ్కరీకి ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని ఆరెస్సెస్ భావిస్తున్న గడ్కరీకి మాత్రం మహారాష్ట్ర రాష్ట్ర రాజీకయలకు తిరిగిరావడం ఎంతమాత్రం ఇష్టంలేనట్టు తెలుస్తుంది. కాకపోతే మోహన్ భగవత్ కు గడ్కరీకి ఉన్న సాన్నిహిత్యం వల్ల గడ్కరీ ఒప్పుకునే ఆస్కారం ఉంది.

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ పారిక్కర్ ను  తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కాబట్టి గడ్కరీ కూడా వెనక్కి వచ్చే ఆస్కారం లేకపోలేదు. 

శివసేనను ఒప్పించడం ఒకింత కష్టమయినా భగవత్ ఆ పనిని చేయగలరు. ముఖ్యమంత్రి పీఠంపైన నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇరు పార్టీలు కూడా సిద్ధంగా లేవు. శివసేన అధికారిక పత్రిక సామ్నా లో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ వైఖరిని తూర్పారపడుతున్నారు. 

Also read: శివసేనకు కాంగ్రెస్ ఆఫర్: "పులి గడ్డి తింటుందా?"అంటూ బీజేపీ ఫైర్

సతీ సావిత్రికి యముడు వరమిస్తూ ఏమన్నా కోరుకో నీ పతి ప్రాణములు తప్ప అన్నట్టుగా ఇటు బీజేపీ కూడా శివసేనతోని చర్చిలకు సిద్ధం ఒక్క సీఎం కుర్చీపై తప్ప అన్న రీతిలో వ్యవహరిస్తోంది. 

నవంబర్ 8వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం బీజేపీ నేతలు గవర్నర్ ని కలవనున్నారు. విచిత్రమేమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఈ గవర్నర్ ని కలవనున్న బీజేపీ బృందంలో ఉండనుండకపోవడంతో ఫడ్నవీస్ ను కొనసాగించే విషయంపై బీజేపీ వెనక్కి తగ్గినట్టు, అందుకే గడ్కరీ మహారాష్ట్రకు వచ్చినట్టు అర్థమవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios