Asianet News TeluguAsianet News Telugu

ప్రతిభకే పట్టం: హెచ్-1బీపై అమెరికా కొత్త పాలసీ

ఎట్టకేలకు అమెరికా 2020 సంవత్సరానికి హెచ్ -1 బీ వీసా పాలసీని ప్రకటించింది. ప్రతిభావంతులకే చోటు కల్పిస్తామని పేర్కొంది. దీనివల్ల హెచ్ -1 బీ వీసా పొందే అవకాశం మరో 16 శాతం పెరుగుతుందని అమెరికా తెలిపింది. 
 

US unveils new H-1B visa rules to attract best talent
Author
Washington, First Published Jan 31, 2019, 12:18 PM IST

అమెరికా సర్కార్ 2020 సంవత్సరానికి కొత్త హెచ్‌-1బీ విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానంలో అమెరికాలో చదువుకున్న విదేశీయులకు హెచ్‌-1బీ వీసాలు దక్కించుకొనే అవకాశం 16 శాతం పెరుగుతుంది. ఈ విధానం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవలే ట్విట్టర్‌లో ప్రకటించారు.

అమెరికాలో చదువుకున్న ప్రతిభావంతులకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్రంప్‌ చెప్పిన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం డైరెక్టర్‌ ఫ్రాన్సిస్ క్రిష్నా తెలిపారు.

ప్రస్తుతం విదేశీ ఉద్యోగులకు సాధారణ హెచ్‌-1బీ వీసాలు 65 వేలు మంజూరు చేస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్య చదువుకున్న వారి కోసం మరో 20 వేల హెచ్‌-1బీ వీసాలు అదనంగా మంజూరు చేస్తున్నారు.

ప్రస్తుత పద్ధతిలో అమెరికా ఉన్నత విద్య ఉన్న దరఖాస్తుదారులను పక్కనపెట్టి మొదట 65 వేల సాధారణ హెచ్‌-1బీ వీసాలకు లాటరీ తీస్తున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారి కోసం మరో 20 వేల హెచ్‌-1బీ వీసాలకు విడిగా లాటరీ తీస్తున్నారు. దాంతో అమెరికాలో ఉన్నత విద్య చదివిన విదేశీయులు మొదటి 65 వేల వీసాల లాటరీలో అవకాశం కోల్పోతున్నారు. 

అమెరికాలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి స్వీకరిస్తారు. ఆ దరఖాస్తుల పరిశీలనలో మొత్తం 85 వేల వీసాలకు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారు పోటీ పడతారు.

దాంతో వారికి హెచ్‌-1బీ వీసా దొరికే అవకాశం 16 శాతం పెరుగుతుంది. 5340 మంది అమెరికా ఉన్నత విద్యావంతులకు కొత్తగా అవకాశం లభిస్తుంది. పలుమార్లు వాయిదా పడుతున్న హెచ్‌ 1బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ ప్రక్రియ జనవరి 28న తిరిగి ప్రారంభమైంది.

హెచ్ 1 బీ వీసా దరఖాస్తు దారులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి కానున్నది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తులను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్వీకరించనున్నారు.

అప్పటి నుంచే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఇది దరఖాస్తుదారులకు చాలా సింపిల్ గానూ, స్మార్ట్ మార్పులతో సానుకూల లబ్దిని చేకూరుస్తుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఫ్రాంకిస్ కిస్నా పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios