Asianet News TeluguAsianet News Telugu

హెచ్ 1బీ రూల్స్ సడలించండి: ట్రంప్‌కు 60 వర్సిటీల లేఖ.. నిపుణుల కొరత వస్తుందని ఆందోళన

హెచ్1 బీ వీసా నిబంధనలను సరళతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్లు, డీన్లు లేఖ రాశారు. లేదంటే నిపుణుల కొరత తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

UI business school dean among 50 who signed letter to Trump, Congress on visa policy
Author
Hyderabad, First Published Oct 17, 2019, 1:30 PM IST

వాషింగ్టన్: ‘అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు తేవాలి. హెచ్ 1బీ వీసాల విషయంలో విధించిన కఠిన నిబంధనలు తొలగించాలి’ అంటూ సుమారు 60 యూనివర్సిటీల డీన్‌లు, సీఈవోలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగలేఖ రాశారు.

అమెరికాలో సుమారు 30 లక్షల సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్-ఎస్‌టీఈఎం) ఉద్యోగాలు ఉన్నాయని, కానీ వీటికి సరిపడా నిపుణులు లేకపోవడంతో దేశం సంక్షోభంలో పడే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కఠినతరమైన ఇమిగ్రేషన్ విధానాలు కూడా కారణమని, వీటివల్ల ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చే నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలియజేశారు.

ఈ విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ 1బీ వీసాలను తగ్గించడం కూడా మంచి నిర్ణయం కాదని యూనివర్సిటీల డీన్లు, వైస్ చాన్స్ లర్లు, సీఈఓలు పేర్కొన్నారు. గతంలో ఏడాదికి 1.95లక్షల హెచ్ 1బీ వీసాలు అందించిన అమెరికా.. ప్రస్తుతం కేవలం 85 వేల హెచ్1 వీసాలు జారీ చేయడం వల్ల చాలా నష్టపోతోందని చెప్పారు.

దానికితోడు కఠిన తర ఇమిగ్రేషన్ నిబంధనలతో చాలామంది విదేశీ నిపుణులు అమెరికా వచ్చేందుకు సందేహిస్తున్నారని తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో నిర్ణయాత్మక మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్ కౌన్సిల్ (జీఎంఏసీ) నేతృత్వంలో రాసిన ఈ లేఖపై అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, యేల్, కొలంబియా, డ్యూక్ వంటి ప్రముఖ వర్సిటీల డీన్‌లు, బేరింగ్స్, ఇంగ్రెసోల్ రాండ్ వంటి కంపెనీల సీఈవోలు సంతకాలు చేశారు. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఇతర కీలక నేతలకు పంపారు. ఈ లేఖ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios