Asianet News TeluguAsianet News Telugu

రాయల్ 'బుల్లెట్'పై ఎందుకంత క్రేజ్!

పెద్దనోట్ల రద్దు సమయంలో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతే, ఆ ప్రభావం పడనిది  - రాయల్ ఎన్ ఫీల్డ్ ఒక్కటే

the rebirth of Royal enfield motor cycle

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చితకబాదటానికి హీరోగారు ఆఖరినిమిషంలో బయలుదేరటం సర్వసాధారణం. అలా బయలుదేరటానికి సదరు హీరోగారు వాడే వాహనాలు రెండే రెండు. గుర్రం లేదా 'బుల్లెట్' మోటార్ సైకిల్. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని తీసుకుని బయలుదేరగానే ఫ్రంట్ బెంచర్స్ ఉత్సాహానికి అంతు ఉండదు. హాలంతా ఈలలతో దద్దరిల్లిపోవాల్సిందే. అలా 'బుల్లెట్' మోటార్ సైకిల్ కు సినిమాఫీల్డ్ తో అవినాభావ సంబంధముంది.

 

అది రీల్ లైఫ్. ఇక రియల్ లైఫ్ లో చూస్తే కొన్నేళ్ళక్రితం వరకు బుల్లెట్ మోటార్ సైకిల్ ఉపయోగించేది రెండే వర్గాలు. ఒకటి - సంపన్న/మోతుబరి కుటుంబాలలోని యువకులు, రెండు - ఎస్ఐ/సీఐ పదవుల్లోని పోలీస్ ఆఫీసర్లు.

 

అయితే ఆ ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆ రెండు వర్గాలకూ చెందని పలువురు యువకులు కూడా ఈ బైకులపట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అప్పట్లో ఆజానుబాహులు, ఒడ్డు-పొడుగు ఉన్నవారు మాత్రమే ఈ బైకులు నడపటానికి అర్హులన్న భావన ఉండేది. కానీ, తయారీదారులు బండి వెయిట్ ను తగ్గించి, స్టాండ్ వేయటాన్ని సులభతరం చేయటంతో ఇప్పుడు అందరూ సునాయాసంగా తోలేస్తున్నారు. ఈ మధ్య నగరాలలోని కొందరు అల్ట్రా మోడర్న్ మహిళలుకూడా బుల్లెట్ లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఇటీవల నగరాలలో, పట్టణాలలో రోడ్లపైన ఎటువైపు దృష్టి సారించినా ఒకటో, రెండో బుల్లెట్ మోటార్ సైకిల్ లు కనబడకుండా ఉండటంలేదు. అంతలా ఉంది దానికి క్రేజ్. కాబట్టే బుల్లెట్ సేల్స్ ఆకాశాన్నంటుతున్నాయి. సంవత్సరానికి ఆరులక్షల బైకులకు పైగా అమ్ముడుపోతున్నాయి. ఇవాళ బుల్లెట్ మోటార్ సైకిల్ కొనాలని రెడీ అయిపోయి, ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుని షోరూమ్ కు వెళ్ళినా ఆరునెలలు ఆగాల్సిందే అని సేల్స్ మెన్ చెబుతారు. డిమాండ్ ఆ స్థాయిలో ఉంది. దీనికి పరాకాష్ఠ ఏమిటంటే, పెద్దనోట్ల రద్దు సమయంలో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతే, ఆ ప్రభావం పడని ఏకైక కంపెనీ - రాయల్ ఎన్ ఫీల్డ్ ఒక్కటే.

 

the rebirth of Royal enfield motor cycle'బుల్లెట్' పేరు వెనక కథ

 

ఈ 'బుల్లెట్' బైక్ తయారు చేసే కంపెనీ పేరు 'రాయల్ ఎన్ ఫీల్డ్' అన్న సంగతి తెలిసిందే. ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ వాస్తవానికి బ్రిటన్ కు చెందినది. లండన్ శివార్లలోని 'ఎన్ ఫీల్డ్' అనే పట్టణం - బ్రిటన్ సైన్యానికి ఆయుధాలు, సంబంధిత సామాగ్రి తయారుచేయటానికి పేరుగాంచినది. 1882 నుంచి అక్కడ 'రాయల్ ఎన్ ఫీల్డ్' అనే బ్రాండ్ నేమ్ తో మామూలు సైకిళ్ళు తయారు చేసే 'ది ఎన్ ఫీల్డ్ మేన్యుఫేక్చరింగ్ కంపెనీ లిమిటెడ్' అనే కంపెనీ ఉండేది. ఆ కంపెనీ 1901లో మోటార్ సైకిళ్ళు తయారు చేయటం ప్రారంభించింది. మోటార్ సైకిల్స్ కు 'రాయల్ ఎన్ ఫీల్డ్' అనే బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారు. లోగోలో ఫిరంగి బొమ్మ, 'మేడ్ లైక్ ఎ గన్' అనే కేప్షన్ ఉంటుంది. అప్పటినుంచి క్రమక్రమంగా టెక్నాలజీని మెరుగుపరుచుకుంటూ వివిధ మోడల్స్ లో, వివిధ సామర్థ్యాలతో ఆ కంపెనీ మోటార్ బైకులను ఉత్పత్తి చేస్తూ ఉండేది. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో తమ సైన్యానికి మోటార్ సైకిళ్ళు తయారుచేసి ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం, నాటి రష్యా ప్రభుత్వం ఎన్ ఫీల్డ్ కంపెనీకి ఆర్డర్ లు ఇచ్చాయి. దానితో కంపెనీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది.

 

'బుల్లెట్' పేరు 1931లో తయారైన ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ మోడల్ తో ప్రారంభమయింది. స్వతహాగా ఆయుధాలు తయారుచేసే ప్రాంతంలో తయారీ అవుతుండటంతో సంబంధింత పేర్లపై మక్కువ ఉంటుంది. బుల్లెట్ లా దూసుకుపోతుందనే భావన స్ఫురించేలా 'బుల్లెట్' అని పేరు పెట్టారు. ఫ్యూరీ, మెటియోర్ మైనర్, సూపర్ మెటియోర్, కాన్ స్టలేషన్, ఇంటర్ సెప్టర్, ఎన్ సైన్, షేర్పా, మాచిస్మో అనే మోడల్స్ ను కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తయారు చేసినప్పటికీ 'బుల్లెట్' మోడల్ మాత్రమే అత్యంత ప్రజాదరణ పొందింది

 

the rebirth of Royal enfield motor cycleఇండియా ఎంట్రీ

1949లో బుల్లెట్ భారత్ లో ప్రవేశించింది. అప్పట్లో దిగుమతి చేసిన బుల్లెట్ మోటార్ సైకిల్స్ అమ్మేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మిలిటరీ మోటార్ సైకిళ్ళు రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ మోటార్ సైకిల్స్ సరఫరా చేసిన విషయం తెలుసుకున్న భారత సర్కారు, మన సరిహద్దుల్లో పహారాకాసే సైనికులు, పోలీస్ సిబ్బంది కోసం 800 బుల్లెట్ బైకులకు ఆర్డర్ పెట్టింది. అంత పెద్ద ఆర్డర్ కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ భారత దేశానికి చెందిన 'మద్రాస్ మోటార్స్' అనే సంస్థతో కలిసి మద్రాస్(నేటి చెన్నై) నగరంలో 1955లో ఎన్ ఫీల్డ్ ఇండియా అనే కంపెనీని ప్రారంభించింది. దీనిలో మద్రాస్ మోటార్స్ 50% వాటా కలిగిఉంది. మొదట కిట్ లను బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకుని మద్రాస్ లో అసెంబుల్ చేసేవారు. 1962లో లైసెన్స్ లభించటంతో స్థానికంగానే మద్రాస్ శివార్లలోని తిరువొట్టియూర్ లో ఉత్పత్తి ప్రారంభించారు. సంవత్సరానికి 20,000 బైకులను తయారు చేసేవారు. భారత్ లో అమ్మకాలు జోరుగా సాగుతుండగా, అక్కడ బ్రిటన్ లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. జపాన్ మోటార్ సైకిల్ కంపెనీల ధాటికి బ్రిటిష్ రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ కుదేలైపోయింది. 1962లో సంస్థ అమ్ముడుపోయింది. 1967లో అక్కడ బుల్లెట్ ఉత్పత్తి నిలిపేశారు. 1970లో ఫ్యాక్టరీనే మూసేశారు. దీనికి కొసమెరుపేమిటంటే ఇండియాలో తయారైన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్స్ ను 1977నుంచి బ్రిటన్ కు ఎగుమతి చేయటం.

 

ఎందుకంత అట్రాక్షన్? 

 

అసలు ఆ బండి లుక్ లోనే రాజసం తొణికిసలాడుతుంటుంది. పురుషత్వం కొట్టొచ్చినట్లు కనబడుతుంటుంది. ఠీవి, దర్పం, హుందాతో కళకళలాడుతుంటుంది. వీటన్నింటికి తోడు నాస్టాల్జియా ఉండనే ఉంది. అందుకే దీనిని బైకుగా కాక 'స్టేటస్ సింబల్'గా పరిగణిస్తారు. ఈ కారణాలన్నింటివల్లనే బుల్లెట్ బైకుకు అంత అట్రాక్షన్ ఏర్పడుతుంది. ఒక రాయల్ బెంగాల్ టైగర్ ను, ఒంగోలు జాతి ఎద్దును, మేలుజాతి జవనాశ్వాన్ని చూస్తే ఎలా ముచ్చటగా ఉంటుందో బుల్లెట్ బైకును చూసినా అలాగా ఉంటుంది. అది రోడ్డుమీద వెళుతుంటే అందరి కళ్ళూ దానిమీదే ఉంటాయి. మిగిలిన వాహనాల యజమానులు పక్కకు తొలగి బుల్లెట్ కు దారి ఇవ్వటంకూడా కద్దు. అసలు పెర్మార్మెన్స్ కన్నా లుక్ కే బుల్లెట్ కు ఎక్కువ మార్కులు లభిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ బైకులో టెక్నాలజీని, ఇతర ఫీచర్స్ ను ఎన్ని మార్చినా బేసిక్ డిజైన్ ను మాత్రం అలాగే ఉంచారు.

 

 

 

లాకౌట్ పరిస్థితి

 

1990లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఇండియా కంపెనీలో 26% షేర్లను ఐషర్ మోటార్స్ అనే స్వదేశీ కంపెనీ తీసుకుంది. 1993లో అదే కంపనీ రాయల్ ఎన్ ఫీల్డ్ లోని మెజారిటీ స్టేక్(60%)ను తీసుకుని టేకోవర్ చేసేసింది. బ్రిటన్ లోని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ బుల్లెట్ లో ఎన్నో మార్పులు చేసినప్పటికీ, ఇండియాలో మాత్రం బుల్లెట్ లో మార్పులేమీ చేయలేదు. రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ పై దృష్టి పెట్టలేదు. పైగా ఉన్న మోడల్స్ లోని లోపాలనూ సరిదిద్దలేదు. అప్పట్లో బుల్లెట్ బైకుకు మెయింటెనెన్స్ చాలా ఎక్కువయ్యేది. మైలేజి చాలా తక్కువ ఉండేది. దీనికిగానూ కంపెనీ పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సివచ్చింది. 90వ దశకంలో భారత్ లో ఆర్థిక సంస్కరణల ఫలితంగా గేట్లు ఎత్తేయటంతో జపాన్ ఆటోమొబైల్ కంపెనీలు దేశంలో పెద్ద ఎత్తున ప్రవేశించాయి. హోండా, సుజుకి, యమహా, కవసాకి కంపెనీలు అత్యధిక మైలేజి ఇచ్చే అనేక ఆకర్షణీయమైన మోడల్స్ ను తక్కువరేట్లకే అందిస్తుండటంతో బుల్లెట్ సేల్స్ మందగించటం ప్రారంభించాయి. వార్షిక తయారీ సామర్థ్యం 70వేల బైకులు కాగా 2000 సంవత్సరం నాటికి ఒక వేయి బైకులు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. 2002 నాటికి జైపూర్ లో ఉన్న రెండో ఫ్యాక్టరీని మూసేయాల్సి వచ్చింది.

 

టర్న్ ఎరౌండ్ చేసిన సిద్దార్థ లాల్

 

జర్మనీకి చెందిన ఐషర్ అనే బ్రాండ్ ట్రాక్టర్ లను దిగుమతి చేసుకోవటానికి ఏర్పాటైన ఐషర్ మోటార్స్ అనే భారతీయ సంస్థకు ట్రాక్టర్స్ తోపాటు, ట్రక్ లు, ఫుట్ వేర్, గార్మెంట్స్, పబ్లికేషన్స్ తదితర వ్యాపారాలు ఉండేవి. 2000 సంవత్సరం ప్రాంతంలో రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీని అమ్మసేయాలా అని ఐషర్ మోటార్స్ యాజమాన్యం యోచిస్తోంది. ఆ యాజమాన్య కుటుంబంలోని మూడోతరానికి చెందిన 26 ఏళ్ళ యువకుడు సిద్ధార్థ లాల్ మాత్రం తనవారితో విబేధించారు. దాన్ని గాడిలో పెట్టటానికి తనకో అవకాశం ఇవ్వాలని తండ్రిని అడిగి 2000సంవత్సరంలో ఎన్ ఫీల్డ్ కంపెనీకి సీఈఓ అయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన సిద్దార్థ, కంపెనీ పరిస్థితిని, బుల్లెట్ బైకును విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిల్స్ తయారీలో ట్రెండ్స్ పరిశీలించారు. తర్వాత బుల్లెట్ సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. మైలేజీని పెంచి, బరువును తగ్గించే అనేక మార్పులు చేశారు. పోత ఇనుము ఇంజన్ ను అల్యూమినియం ఇంజన్ గా మార్చారు. అయితే ఇలా మార్చటంవలన బైక్ కు ట్రేడ్ మార్క్ లాంటిదయిన థంపింగ్(ధడ్ ధడ్) సౌండ్ మారిపోయింది. ఆ సౌండ్ ను యథాతధంగా ఉంచటంకోసం సిద్దార్థ ఆస్ట్రియాకు చెందిన నిపుణులను పిలిపించారు. ఆ ప్రయత్నం విజయవంతమయింది. యువతను ఆకట్టుకోవటంకోసం అనేక ఇతర ఫీచర్స్ ను చేర్చారు.వీటన్నింటితో బుల్లెట్ కు పోయిన క్రేజ్ మళ్ళీ రావటం ప్రారంభమైంది.

 

రోజురోజుకూ పెరుగుతున్న క్రేజ్

 

2004లో మొత్తం ఐషర్ గ్రూప్ కు సీఈఓగా మారిన సిద్దార్థ లాల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. బుల్లెట్ బైకులు, ఐషర్ ట్రక్స్ కాకుండా తమ గ్రూపుకు ఉన్న 15 ఇతర వ్యాపారాలన్నింటినీ అమ్మేశారు. అన్నిటిలో వేలుపెట్టి ఏదో ఒక స్థానంలో ఉండటంకన్నా ఎంచుకున్న కొద్దివ్యాపారాలలో మొదటి స్థానంలో ఉండటమే మేలని ఆయన నిర్ణయించారు. తనవరకు తాను ఎన్ ఫీల్డ్ పైనే దృష్టి పెట్టారు. దాని తయారీ, ఫీచర్స్, మార్కెటింగ్ అంశాలను మెరుగుపరుచుకుంటూ వెళుతున్నారు. ఫలితంగా బుల్లెట్, ఇతర మోడల్స్ లోని సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ మెరుగవుతోంది. అందుకే క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుతం సంవత్సరానికి ఆరులక్షలకు పైగా బైకులు అమ్ముతున్నారు. డిమాండ్ పెరిగిపోవటంతో 2013లో తమిళనాడులోనే రెండో ప్లాంట్ ప్రారంభించారు. ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ దేశంలో నాలుగవ అతి పెద్ద మోటార్ సైకిల్ తయారీ సంస్థగా అవతరించింది. ఒక ప్రీమియం రేంజ్ బైక్ ఈ స్థానానికి చేరటం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రీమియం రేంజ్ బైక్ ల సేల్స్ లో కూడా ఎన్ ఫీల్డ్ సంస్థ ఇటీవల రికార్డ్ సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత క్రూజర్ బైక్ 'హ్యార్లీ డేవిడ్ సన్' సేల్స్ ను అధిగమించింది. ప్రస్తుతం యూరప్, అమెరికా, జపాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో సహా 45 దేశాలకు బుల్లెట్ తదితర బైకులను ఎగుమతి చేస్తున్నారు.

 

 

టెక్నాలజీ

1931లో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ తో బుల్లెట్ తయారీ ప్రారంభమైంది. అక్కడనుంచి ఇంజన్, క్యూబిక్ కెపాసిటీ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. మొదట కేస్ట్ ఐరన్ తో తయారైన ఇంజన్ ఇప్పుడు పూర్తి అల్యూమినియం ఇంజన్ గా మారింది. దీనివలన బండి బరువు గణనీయంగా తగ్గింది. మొదట ఇంజన్, గేర్ బాక్స్ వేర్వేరుగా ఉండగా, ఇప్పుడు ఆ రెండూ ఒకే కేసింగ్ లో ఉండే యూనిట్ కనస్ట్రక్షన్ ఇంజన్(యూసీఈ)గా అది రూపాంతరం చెందింది. ఇప్పుడు 5 గేర్లు ఉండగా, మొదట్లో నాలుగు గేర్లు, ఒక న్యూట్రల్ లీవర్ ఉండేవి. ఈ న్యూట్రల్ లీవర్ సాయంతో ఏ గేరులోనుంచైనా న్యూట్రల్ కు వచ్చే సౌలభ్యం ఉండటం ఒక విశేషం. ఇప్పుడు గేర్ లీవర్ ను ఎడమవైపుకు మార్చారు. కొన్ని మోడల్స్ లో కార్బొరేటర్ స్థానంలో ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థను అమర్చారు. దీనివలన మైలేజీలో మెరుగుదల లభించింది. ట్విన్ స్పార్క్(రెండు స్పార్క్ ప్లగ్ లు) టెక్నాలజీని కూడా చేర్చారు. కిక్ స్టార్ట్ కు తోడుగా ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా వచ్చింది. గ్యాస్ షాక్ అబ్జార్బర్ లు వచ్చాయి. ఇప్పుడు 350, 500 సీసీ సామర్థ్యాలతో క్లాసిక్, ఎలక్ట్రా, కాంటినెంటల్ జీటీ, థండర్ బర్డ్, హిమాలయన్ అనే మోడల్స్ ను తయారు చేస్తున్నారు. త్వరలో 750 సీసీ మోడల్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు.

 

the rebirth of Royal enfield motor cycle

మరిన్ని విశేషాలు

 

  • ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ కాలంగా తయారవుతున్న మోటార్ సైకిల్ బ్రాండ్ బుల్లెట్ మాత్రమే.
  • బుల్లెట్ ఆయిల్ ట్యాంక్ పై ఉన్న లోగో చుట్టూ ఉండే బంగారపు రంగు అంచును ఇప్పటికీ కేవలం చేతితోనే వేస్తారు.

 

  • 1990లో రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ టారస్ పేరుతో డీజెల్ బుల్లెట్ ను తయారు చేసింది. అయితే అది ప్రజాదరణ పొందకపోవటంతో ఉత్పత్తిని నిలిపేసింది.
  • 2004లో ఐషర్ కంపెనీ టేకోవర్ చేసే ముందు రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ మినీ బుల్లెట్ అనే బైక్, సిల్వర్ ప్లస్ అనే మోపెడ్, మోఫా అనే మరో బుల్లి మోపెడ్ ను తయారు చేసేది. అయితే అవి కూడా ప్రజాదరణ పొందలేకపోయాయి.

 

  • 1990వ దశకంలో బుల్లెట్ కు పోటీగా జావా/యెజ్డీ, యమహా 350 మోటార్ సైకిల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే అవి ఎక్కువకాలం మార్కెట్ లో నిలబడలేకపోయాయి. జావా/యెజ్డీ బైకులు వాస్తవానికి చెకోస్లావేకియా దేశానికి చెందినవి. భారత్ లో మైసూరులో వీటిని తయారు చేసే ఫ్యాక్టరీ ఉండేది.

 

  • కార్ డెకార్స్ లాగా బుల్లెట్ బైకుకు షోకులు చేసే దుకాణాలు కొన్ని చోట్ల ఉన్నాయి. కొంతమంది ఔత్సాహికులు ఈ బైకును కొన్న తర్వాత దానికి షోకు చేయటానికి కూడా వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు.

 

  • కొందరు అభిమానులు రెండు మూడు బుల్లెట్ లను మెయింటెయిన్ చేస్తుంటారు.
  • విజయవాడలో బుల్లెట్ బైకులను మాత్రమే రిపేర్ చేసే ఒక మెకానిక్ కేవలం ఆ వృత్తిమీదే పైకి ఎదిగి 40 ఎకరాల మామిడితోటకి యజమానిగా మారాడు.

 

  • ఎన్ ఫీల్డ్ కంపెనీ యజమాని సిద్దార్థ లాల్ తన పెళ్ళి బారాత్ లో గుర్రానికి బదులుగా బుల్లెట్ మోటార్ సైకిల్ పై ఊరేగాడు.
Follow Us:
Download App:
  • android
  • ios