Asianet News TeluguAsianet News Telugu

డ్రైవర్ల కోసం టాటా మోటార్స్‌ ‘సమర్థ్‌’

ట్రక్కు డ్రైవర్లను ప్రోత్సహించడానికి టాటా మోటార్స్ ‘సమర్థ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో సభ్యులైన వారికి రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తుంది. మరోవైపు టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు గతేడాది 5.8 శాతం తగ్గుముఖం పట్టాయి. 

Tata Motors launches initiative for drivers
Author
Hyderabad, First Published Apr 9, 2019, 11:50 AM IST


న్యూఢిల్లీ: ట్రక్‌ల విభాగంలో డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి టాటా మోటార్స్‌ సరికొత్త కార్యక్రమం చేపట్టింది ‘సమర్థ్‌’పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో డ్రైవర్ల ఆరోగ్యం, సంక్షేమం, బీమా, ఆర్థిక ప్రణాళికపై దృష్టి సారించనుంది. ఈ కార్యక్రమం కింద ఏటా ఐదు లక్షల మంది డ్రైవర్లను చేరుకోవాలని భావిస్తోంది.

డ్రైవర్ల సాధికారత, సంక్షేమానికి క్రుషి డ్రైవర్ల సాధికారత, సంక్షేమం కోసం టాటా మోటార్స్‌ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా సమర్థ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కంపెనీ కమర్షియల్‌ వెహికిల్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ గిరీష్‌ వాఘ్‌ తెలిపారు. టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భాగస్వామ్యంతో కంపెనీ స్వస్థ్య సమర్థ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

‘సమర్థ్’ సభ్యులకు రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా
ఇందులో భాగంగా సభ్యులకు టాటా మోటార్స్ ఆరోగ్య బీమా ఉత్పత్తులు అందిస్తుంది. ఇందులో రూ.50,000 వరకు హాస్పిటలైజేషన్‌ కవరేజీ కూడా ఉంటుంది. కొత్తగా అమ్ముడయ్యే వాహనాలతో దీన్ని అనుసంధానం చేస్తారు.

5.8% తగ్గిన జేఎల్‌ఆర్‌ అమ్మకాలు
టాటా మోటార్స్‌ అనుబంధ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు 2018-19లో 5.8% తగ్గి 5,78,915 యూనిట్లకు చేరాయి. జాగ్వార్‌ అమ్మకాలు 2017-18తో పోల్చితే 3.2 శాతం పెరిగి 1,80,198 యూనిట్లకు చేరుకోగా.. లాండ్‌ రోవర్‌ విక్రయాలు 9.3 శాతం తగ్గి 3,98,717 యూనిట్లకు చేరాయని కంపెనీ తెలిపింది.

ఐదురోజులు జేఎల్‌ఆర్‌ ప్లాంట్‌ మూసివేత

టాటాల ఆధీనంలోని జాగ్వర్‌-ల్యాండ్‌రోవర్‌ ప్లాంట్‌ను ఐదురోజుల పాటు మూసి వేయనున్నారు. సోమవారం నుంచి ఈ మూసివేత మొదలైంది. బ్రెగ్జిట్‌పై స్పష్టత రాకపోవడంతో దేశంలోని సగం కార్లతయారీ సంస్థలు తమ కర్మాగారాలను మూసివేశాయి. బ్రెగ్జిట్‌ వల్ల ఎదురయ్యే ఎటువంటి ఇబ్బందులనైనా తట్టుకొనేందుకు వీలుగా దీనిని జేఎల్‌ఆర్‌ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని వాస్తవానికి కొన్ని నెలల క్రితమే తీసుకొన్నారు. 

బ్రెగ్జిట్ అమలులోకి వస్తే కార్ల సంస్థలకు తప్పని కష్టాలు

బ్రెగ్జిట్‌ అమల్లో్కి పలు కార్ల సంస్థలకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. కార్ల విడిభాగాల సరఫరా, తయారైన కార్ల రవాణ, కొత్త కస్టమ్స్‌ నిబంధనల అమలు, పూర్తైన వాహనాలపై టారీఫ్‌లు వంటివి తేలాల్సి ఉంది. మరోపక్క బీఎండబ్ల్యూ, రోల్స్‌రాయిస్‌ ప్లాంట్లను కూడా కొన్నాళ్లు మూసివేయనున్నారు. ప్యూగోట్‌ వేసవిలో మూసివేతను ఖరారు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios