Asianet News TeluguAsianet News Telugu

‘ఆటో’ను వీడని కష్టాలు: ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్ డౌన్‌ట్రెండ్

ఇంకా దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కష్టాలు వీడినట్లు కనిపించడం లేదు. వాహనాల అమ్మకాలు క్షీణించడంతో గత ఆర్థిక సంత్సరం తొలి త్రైమాసికం లాభాలు తగ్గుతాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. వాహనాలు కొనే వారు లేక షోరూమ్‌లు వెలవెలబోతుండగా, డీలర్లు విలవిల్లాడుతున్నారు.

PV retail sales dip 10 pc in March: FADA
Author
Delhi, First Published Apr 11, 2019, 12:21 PM IST

న్యూఢిల్లీ: మార్చిలోనూ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 10 శాతం తగ్గి 2,42,708 యూనిట్లకు పడిపోయాయి. 2018 మార్చిలో పీవీ రిటైల్‌ విక్రయాలు 2,69,176 యూనిట్లుగా నమోదయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. 

ద్విచక్ర వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏడు శాతం తగ్గి 13,24,823 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 12 శాతం క్షీణించి 61,896 యూనిట్లకే పరిమితమయ్యాయి. 

త్రిచక్ర వాహనాల అమ్మకాలు సైతం 6 శాతం పడిపోయి 53,229 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాల వెహికిల్స్‌ సేల్స్‌ 8 శాతం తగ్గుదలతో 16,82,656 యూనిట్లకు పడిపోయాయి.

‘ఏడాది ప్రాతిపదికన చూస్తే గత నెలలో అన్ని విభాగాల్లో విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం కాసింత మెరుగయ్యాయి. మార్కెట్లో వాహనాలకు తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవడం అభినందనీయం’ అని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే చెప్పారు.

దాంతో మార్చిలో డీలర్ల వద్ద వాహన నిల్వలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్‌లో మరింత తగ్గే అవకాశం ఉంది. నిధుల కొరత, నిర్వహణ మూలధన అవసరాల విషయంలో వాహన డీలర్లకు గడిచిన ఆరు నెలలు అత్యంత గడ్డుకాలం’అని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే అన్నారు. 

వాహన రిటైలర్లకు నిర్వహణ మూలధనం విషయంలో ప్రత్యేక విధానాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే చెప్పారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంతో ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. వాహన పరిశ్రమకు గడ్డుకాలం ముగిసినట్లే కన్పిస్తోందని, కొద్ది నెలల్లోనే విక్రయాలు మళ్లీ పుంజుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతులు 9.51 శాతం తగ్గి 6,76,193 యూనిట్లకు పరిమితం అయ్యాయని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. గత దశాబ్దకాలంలో వాహన ఎగుమతులు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది రెండో ఏడాది. 

2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ విదేశాలకు వాహనాల ఎగుమతి 1.51 శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌తో వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇండోనేషియా మన వాహనాల దిగుమతులపై ఆంక్షలు విధించింది. శ్రీలంకకు సైతం ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఆ దేశానికి కొత్త వాహనాలకు బదులు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల ఎగుమతులు పెరగటం ఇందుకు కారణమైంది. 

జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ సహా టాటా మోటార్స్‌ అంతర్జాతీయ అమ్మకాలు మార్చి నెలలో 5 శాతం మేరకు క్షీణించాయి. నెల మొత్తంలో 1,45,459 వాహనాలు మాత్రమే విక్రయించగలిగింది. ప్రయాణికుల వాహనాల విక్రయాలు ఫిబ్రవరితో పోల్చితే 9 శాతం క్షీణించి 96,757 నుంచి 88,296కి పడిపోయాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం ఒక శాతం పెరిగి 57,163గా నమోదయ్యాయి. లగ్జరీ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ కార్ల విక్రయాలు 8 శాతం తగ్గి 76,221కి క్షీణించాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఆటోమొబైల్‌ రంగం జనవరి-మార్చి త్రైమాసికం లాభాల్లో భారీ క్షీణత చవిచూసే ఆస్కారం ఉన్నదని బ్రోకరేజ్‌ సంస్థలు మోతీలాల్‌ ఓస్వాల్‌, ఆటో యూనివర్స్‌ అంచనా వేశాయి. అమ్మకాలు గణనీయంగా తగ్గడం వాటి లాభదాయకతను ప్రభావితం చేస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. 

గత ఏడాదితో పోల్చితే ఈ రంగంలోని కంపెనీల లాభాలు 28 శాతం తగ్గవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌.. లాభాల తగ్గుదల డబుల్ డిజిట్ స్థాయిలో ఉండడం ఖాయమని ఆటో యూనివర్స్‌ అంచనా వేస్తోంది. ఇంచుమించుగా ఆటోమొబైల్‌ రంగంలోని అన్ని కంపెనీలు భారీ ఇన్వెంటరీతో సతమతమవుతున్నాయని అవి పేర్కొన్నాయి. 

ఇన్వెంటరీలు విపరీతంగా పెరిగిపోవడంతో మారుతి, బజాజ్‌ ఆటో కంపెనీలు మార్చి నెల ఉత్పత్తిలో భారీ కోత విధించాయి. వాహనాల డిమాండ్కూడా ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదని మోతీలాల్‌ ఓస్వాల్‌ తన నివేదికలో వెల్లడించింది.

‘వాహన యాజమాన్య వ్యయభారం పెరుగుదలతో పాటు వ్యవసాయ రంగంలో ధరల ఒత్తిడి కూడా ఇందుకు కారణం. ప్రధానంగా ద్విచక్రవాహనాలు, ప్యాసింజర్‌ వాహనాల డిమాండు బాగా పడిపోయింది. ద్విచక్ర వాహనాల రంగంలో 60-70 రోజుల భారీ ఇన్వెంటరీ ఉంది’ అని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక విశ్లేషించింది. అలాగే వినియోగదారుల విచక్షణాత్మక వ్యయం కూడా కనిష్ఠ స్థాయిలో ఉన్నదని పేర్కొంది. 

టీవీఎస్‌ మోటార్స్నీ, టాటా మోటార్స్‌ దక్షిణాఫ్రికా మినహా సుమారుగా అన్ని ఓఈఎంలు మార్జిన్లలో భారీ క్షీణతను చవిచూడవచ్చని, మారుతి, అశోక్‌ లేలాండ్‌, బజాజ్‌ ఆటో మార్జిన్లు మాత్రం స్వల్పంగా పెరగవచ్చునని పేర్కొంది. ద్విచక్ర వాహన రంగంలో కూడా పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేదని అంతర్జాతీయ పరిశోధన సంస్థ జెఫ్రీస్‌ తెలిపింది. 

త్రైమాసిక లాభాల్లో హీరో హోండా 24 శాతం, ఐషర్‌ మోటార్స్‌ 13 శాతం, బజాజ్‌ ఆటో 11 శాతం, టీవీఎస్‌ 12 శాతం క్షీణతను చవి చూడవచ్చని జెఫ్రీస్‌ సంస్థ అంచనా వేసింది. అలాగే మహీంద్రా 16 శాతం, అశోక్‌ లేలాండ్‌ 13 శాతం, టాటా మోటార్స్‌ 7 శాతం, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ 25 శాతం క్షీణతను చవి చూసే ఆస్కారం ఉన్నట్టు పేర్కొంది.
 
కొంత కాలం ఆటోమొబైల్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేదని వివిధ బ్రోకరేజి సంస్థలు అంటున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మాత్రమే పరిస్థితి కాస్తంత మెరుగుపడవచ్చని వాటి అంచనా. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌ -6 ప్రమాణాలు అమలులోకి రానున్నందున బీఎస్‌ 4 వాహనాల ఇన్వెంటరీని తగ్గించుకునే దిశగా కంపెనీలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయనే అంశం మీద 2019-20 ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుందని బ్రోకరేజి సంస్థలంటున్నాయి. 

మరో పక్క బీఎస్‌ 6 ప్రమాణాల అమలులో ఆటోమొబైల్‌ కంపెనీలపై పడే రెగ్యులేటరీ వ్యయాల భారం సైతం కొత్త ఏడాది మార్జిన్లపై ప్రభావం చూపుతుందని అవి అంచనా వేశాయి. కార్లతో పోలిస్తే రెగ్యులేటరీ వ్యయాల ప్రభావం ద్విచక్ర, వాణిజ్య వాహన రంగాలు రెండింటి మీద అధికంగా ఉంటుందని జెఫ్రీస్‌ పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios