Asianet News TeluguAsianet News Telugu

నో డౌట్..ఆశలు గల్లంతే.. సెప్టెంబర్‌లోనూ డబుల్ డిజిట్స్ డౌన్

పండుగల ముంగిట వాహనాల విక్రయాలు భారీగానే సాగుతాయని ఆటోమొబైల్ సంస్థలు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ విక్రయాలు భారీగా పతనం కాగా.. మొత్తంగా వెకల్స్ సేల్స్ రెండంకెల స్థాయిలో పతనం కావడంతో ఆటోమొబైల్ సంస్థలు బేజారయ్యాయి.

Festive season fails to lift passenger vehicle sales, major cos report decline in Sep offtake
Author
Hyderabad, First Published Oct 2, 2019, 3:37 PM IST

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌పై గంపెడు ఆశ పెట్టుకున్న ఆటోమొబైల్ సంస్థలకు నిరాశే మిగిలింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, టయోటా అమ్మకాలు సెప్టెంబర్ నెలలో రెండంకెల స్థాయిలో పడి పోయాయి.

ఆర్థిక మాంద్యంతో సతమతం అవుతున్న ఆటోమొబైల్ సంస్థలకు పండుగ సీజన్‌లో రాయితీలు ప్రకటించినా ఏ మాత్రం ఊరటనివ్వలేదు. దీంతో పండుగ సీజన్‌లో నేపథ్యంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో విక్రయాలు పెరుగుతాయనే ఆటో కంపెనీల ఆశలపై తాజా లెక్కలు నీళ్లు చల్లాయి.

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) అమ్మకాల్లో సెప్టెంబర్ నెలలో కూడా కుదేలైంది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి దేశీయంగా 1,12,500 యూనిట్లను మాత్రమే విక్రయించింది. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మిన 1,53,550 యూనిట్లతో పోలిస్తే 26.7 శాతం పడిపోయాయి.

గత నెలలో దేశీయ అమ్మకాలు 26.7 శాతం క్షీణించి 1,12,500 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది (2018, సెప్టెంబర్‌లో) 1,53,550 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఆల్టో, వాగన్ఆర్ మోడల్‌తో కూడిన మినీ కార్ల అమ్మకాలు 20,085 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 34,971 యూనిట్లు, 42.6 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడల్స్ 22.7 శాతం క్షీణించి 57,179 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 74,011 కార్లు ఉన్నాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అంతకుముందు 6,246 యూనిట్లతో పోలిస్తే 1,715 యూనిట్లను విక్రయించింది.

విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 21,526 యూనిట్ల వద్ద స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇవి 21,639 గా ఉంది. సెప్టెంబరులో ఎగుమతులు 17.8 శాతం తగ్గి 7,188 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 8,740 యూనిట్లు నమోదయ్యాయి.

హ్యుండాయ్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 14.8 శాతం తగ్గి 40,705 లకు పడిపోగా, మహీంద్రా అమ్మకాలు కూడా 33 శాతం క్షీణించి 14,333కి జారుకున్నాయి

ప్రస్తుత పండుగ సీజన్‌పై ఆశావాద దృక్ఫతంతో ఉన్నట్లు, నవరాత్రి నుంచి ఆటోమొబైల్ రంగం తిరిగి కొలుకునే అవకాశాలున్నాయని మహీంద్రా చీఫ్ సేల్ అండ్ మార్కెటింగ్ విజయ్ రామ్ నక్రా తెలిపారు. వర్షాలు అధికంగా కురియడం, ఇటీవల కేంద్రం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే అవకాశాలున్నాయన్నారు.

వినియోగదారుల్లో సెంటిమెంట్ ఇంకా నిరాశావాదంగా ఉండటంతో గత నెలల్లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పడిపోయాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ ఎండీ ఎన్ రాజా తెలిపారు. టాటా మోటార్స్ సేల్స్ 48 శాతం తగ్గి 69,991 యూనిట్ల నుంచి 36,376 యూనిట్లకు పరిమితమయ్యాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 21 శాతం తగ్గుముఖం పట్టాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో 55,022 వాహనాలను విక్రయించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఈ ఏడాది 43,343 యూనిట్లకు పరిమితమైంది. అశోక్ లేలాండ్ వాహనాలు 19,374 యూనిట్ల నుంచి 55 శాతం తగ్గి 8,780 యూనిట్లు పడిపోయాయి.

ఇక ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటో కార్ప్స్ విక్రయాలు 20 శాతం తగ్గిపోయాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో 7,69,138 యూనిట్లు విక్రయించిన హీరో మోటో కార్ప్.. ఈ ఏడాది 6,12,204 యూనిట్లతో సరి పెట్టుకున్నది.

బజాజ్ ఆటో 5,02,009 యూనిట్ల నుంచి 4,02, 035 బైక్‌లు, స్కూటర్లకు పరిమితమైంది. టీవీఎస్ మోటార్స్ సేల్స్ 25 శాతం తగ్గి 3.15 లక్షల యూనిట్లకు తగ్గిపోయాయి. హోండా బైక్స్ అండ్ స్కూటర్లు 13 శాతం విక్రయాలు తగ్గి 4.85 లక్షలకు పరిమితం అయ్యాయి

Follow Us:
Download App:
  • android
  • ios