Asianet News TeluguAsianet News Telugu

ఇక ఒకే నెంబర్: తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి ‘112’ సేవలు

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అసత్యవసర సేవల కోసం 108కి ఫోన్ చేస్తాం. ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను సంప్రదించడానికి 100కి ఫోన్ చేస్తాం. ఈ నేపథ్యంలోనే అన్ని సేవలకు కలిపి ఒకే ఒక్క నెంబర్ డయల్ చేస్తే సరిపోతుందని.. కేంద్ర ప్రభుత్వం ‘112’ అనే హెల్ప్‌లైన్ నెంబర్(పాన్ ఇండియా)ను తీసుకొచ్చింది.

AP, Telangana Join Pan India Single Emergency Helpline Number 112
Author
New Delhi, First Published Apr 22, 2019, 3:39 PM IST

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఒకే ఒక అత్యవసర సేవల నెంబర్ అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అసత్యవసర సేవల కోసం 108కి ఫోన్ చేస్తాం. ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను సంప్రదించడానికి 100కి ఫోన్ చేస్తాం. గ్రామీణ వైద్య సేవల కోసం 104కి ఫోన్ చేస్తాం. ఇలా ఒక్కోసేవ కోసం ఒక్కో నెంబర్ ఉంది. అంతేగాక, ఈ నెంబర్లు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. 

ఈ నేపథ్యంలోనే అన్ని సేవలకు కలిపి ఒకే ఒక్క నెంబర్ డయల్ చేస్తే సరిపోతుందని.. కేంద్ర ప్రభుత్వం ‘112’ అనే హెల్ప్‌లైన్ నెంబర్(పాన్ ఇండియా)ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సేవలను కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పటికీ తాజాగా మరిన్ని రాష్ట్రాకలు విస్తరించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 20 రాష్ట్రాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను అందిస్తున్నారు. ఇది 24 గంటల పాటు సేవలందిస్తుంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా క్షణాల్లో అత్యవసర సేవలను అందిస్తారు. 

112 సేవలు వినియోగం ఎలా:

ఫోన్‌ ఏదైనా (స్మార్ట్‌/ఫీచర్‌/ల్యాండ్‌)సరే ‘112’ నంబర్‌ నుంచి సేవలు పొందవచ్చు. వివిధ మార్గాల ద్వారా అత్యవసర వైద్యం, భద్రతా పరమైన సహాయం కోరవచ్చు.
సంక్లిప్త సందేశం(ఎస్‌ఎంఎస్‌), వాయిస్‌ కాల్, ఈ–మొయిల్, ఈఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సేవలందించేందుకు చర్యలు తీసుకుంటారు.
సాధారణ ఫోన్‌లో 5 లేదా 9 నంబర్లను ఎక్కువసేపు ప్రెస్‌చేసి ఉంచడం ద్వారా కూడా ‘112’ అత్యవసర సేవల విభాగం సిబ్బంది లైన్‌లోకి వస్తారు. జీపీఎస్‌ పరిజ్ఞానం ద్వారా సమస్యను గుర్తించి వివిధ ప్రభుత్వశాఖలను అప్రమత్తం చేసి సేవలందిస్తారు.

కాగా, గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ‘112’ ఇండియా మొబైల్ యాప్’ కూడా అందుబాటులో ఉంది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవల కోసం నిర్భయ నిధుల నుంచి రూ.321.69కోట్లను కేటాయించారు. ఇప్పటికే రూ.278.66 కోట్లను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ కలుపుకుని 20రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 112 సేవలు అమలవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios