Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ 1నుండి ఫేమ్‌ -2... రూ.10 వేల కోట్లతో

ప్రపంచ వ్యాప్తంగా భూతాప నివారణకు కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి ప్రజా రవాణా వ్యవస్థలో దేశదేశాలన్నీ సమూల మార్పులే చేస్తున్నాయి. అందులో భాగంగా మనదేశంలోని మెట్రో నగరాల పరిధిలో విద్యుత్ బస్సులను నడిపేందుకు కసరత్తు సాగుతోంది. ముందుగా ఎంపిక చేసిన నగరాల పరిధిలో విద్యుత్ బస్సుల నిర్వహణ జయప్రదమైతే దేశమంతా క్రమంగా విద్యుత్ బస్సుల వాడకం పెరుగనున్నది. దీనివల్ల ఖర్చు తగ్గి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పని చేసే ఆర్టీసీ సంస్థలకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. 

All the Cities in India With Electric Bus Service
Author
New Delhi, First Published Mar 2, 2019, 3:51 PM IST

న్యూఢిల్లీ: వాహన కాలుష్య నియంత్రణకు ఉపయోగపడే విద్యుత్ వాహనాల తయారు చేయడంతోపాటు వాటి వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్‌ -2’ పథకం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2022 మార్చి 31 వరకు అమలయ్యే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించింది. 2015-16 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు అమలవుతున్న ఫేమ్‌ -1కు కేటాయించిన రూ.895 కోట్లతో పోలిస్తే, ఈసారి 11 రెట్లు అధికం. 

ఈ మోడల్‌కు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి. అశోక్ లేలాండ్, గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్, టాటా మోటార్స్, జేబీఎం ఆటో, సొలారిస్, బీవైడీ తదితర సంస్థలు విద్యుత్ వాహనాల తయారీ, వాడకంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నాయి. తద్వారా విద్యుత్ వాహనాలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ప్రజా రవాణాకు ఉద్దేశించి 5 లక్షల త్రిచక్ర వాహనాలు, 55వేల కార్లు, ఏడు వేల బస్సులకు, వ్యక్తిగతంగా వినియోగించే 10 లక్షల ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, తగిన మౌలిక వసతులు కల్పించడం ఈ పథక ఉద్దేశం. ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు నూతన విధానం ఉపకరిస్తుందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఫేమ్‌ మొదటి దశ కింద విద్యుత్ బస్సుల ధరలో 60 శాతం గానీ, రూ. కోటి గానీ.. ఏది తక్కువైతే అంత మొత్తాన్ని రాయితీగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 రాష్ట్రాలు విద్యుత్ బస్సులు నడిపేందుకు ముందుకొచ్చాయి.

కాలుష్యమే ఉండని, శబ్దమే చేయని, విద్యుత్‌తో నడిచే ఏసీ బస్సులను హైదరాబాద్‌ (40), బెంగళూరు (80), ముంబై (40) నగరాలకు  సరఫరా చేసే కాంట్రాక్టును తెలుగు రాష్ట్రాల ‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌’ దక్కించుకుంది. 

ఇందుకోసం బీవైడీతో కలిసి హైదరాబాద్‌ పరిసరాల్లోనే ‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌’ప్లాంట్ నిర్మించి, విద్యుత్ బస్సులను తయారు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ బస్సులు నడుస్తున్నాయి. ఫేమ్‌-2లో బస్సులకు రూ.60 లక్షల వరకు రాయితీ ఇస్తారు.

వాహన కాలుష్య ఉద్గారాల తీవ్రతలో భాగ్యనగరం దేశ రాజధాని ఢిల్లీని కూడా దాటేసింది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ఢిల్లీలో రోజూ 63.74 టన్నుల మేర గాలిలో కలుస్తుంటే, హైదరాబాద్‌లో ఇది 69.51 టన్నులకు చేరింది. ఈ సమస్య మరింత పెరిగితే, ఊపిరితిత్తుల వ్యాధులు మరింత విస్తృతమయ్యే ప్రమాదముంది.

ఆ పరిస్థితి రాకూడదంటే, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం తప్పనిసరిగా పెరగాల్సిందే. నగరాలలో సిటీ బస్సులతో పాటు ఇతర ప్రాంతాలకు వేల సంఖ్యలో నడుస్తున్న ఆర్టీసీ డీజిల్‌ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశ పెడితే ఉపశమనం లభిస్తుంది.

100 డీజిల్‌ ఏసీ బస్సులు ఏడాదికి 4 కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తాయని అంచనా. లీటర్‌కు రూ.65 చొప్పున వేసుకున్నా, ఇందుకు రూ.260 కోట్లు అవసరం. ఇవి వెదజల్లే వాయువుల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ 13 కోట్ల టన్నులు ఉంటుందని పరిశోధనా సంస్థలు అంచనా వేశాయి. 15 ఏళ్ల జీవితకాలం కలిగిన పెద్దచెట్లు 6.50 లక్షలు ఉంటే కానీ, ఇంత కాలుష్యాన్ని స్వీకరించి, ఆక్సిజన్‌ను మనకు అందించలేవని ఒక అంచనా.

హైదరాబాద్‌లో 3,000, విశాఖపట్నంలో 1200, విజయవాడలో 500 వరకు సిటీ బస్సులు నిత్యం లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తున్నాయి. విజయవాడలో సీఎన్జీ ద్వారా కొన్ని సిటీబస్సులు నడుస్తున్నాయి. డీజిల్‌పై కిలోమీటర్ ప్రయాణానికి 1075 గ్రాముల కార్బన్‌ డై ఆక్సైడ్‌ వెలువడితే, సీఎన్జీపై 945 గ్రాములు వస్తుంది. విద్యుత్‌పై అయితే అసలేమీ ఉండకపోవడం గమనార్హం.

ధరల ప్రకారం చూసినా డిజిల్‌పై కిలోమీటరుకు రూ.30, సీఎన్జీపై రూ.11, విద్యుత్ వినియోగానికి రూ.6-7 మాత్రమే అవుతుంది. అందుకే విశాఖపట్నంలో బీఆర్‌టీఎస్‌ కింద విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో డిజిల్‌ వాహనాలతో కాలుష్యం పెరుగుతోంది. రోజూ 50 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు కనుక, తిరుపతి-తిరుమల మధ్య  రెండు నెలల్లో 80 విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టనున్నారు. అక్కడ యూనిట్‌ విద్యుత్ బిల్లు రూ.5 మాత్రమే కానుంది.

ఇక కొత్తగా ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో పూర్తిగా విద్యుత్ హైబ్రిడ్‌ వాహనాలనే అనుమతిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా ఏపీ సర్కార్ ఫేమ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వీలు అధికంగా ఉంది. 

డీజిల్‌ ఏసీ బస్సును రూ.1.2-1.3 కోట్లు. ఆర్టీసీ కొనుగోలు చేయాలి. ఇక లీటర్‌ డీజిల్‌తో సదరు బస్సు 2.2-2.3 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర.. రూ.65గా ఉన్నది. దీని ప్రకారం ప్రతి కిలోమీటర్‌కు డీజిల్‌ వ్యయం  రూ.30గా ఉంది. 

దీనికి అదనంగా డ్రైవర్‌ వేతనాలకు రూ.14-20, కండక్టర్‌కు రూ.8-10, బస్సుల నిర్వహణకు రూ.7-8 ఖర్చవుతోంది. అంటే బస్సు కొనుగోలు ఖర్చు కాక, కిలోమీటర్ ప్రయాణానికి రూ.69 వరకు కనీస ఖర్చవుతోంది.

విద్యుత్ ఏసీ బస్సు ధర రూ.2.50 కోట్లు.. కానీ ఆర్టీసీ కొనదు. కాంట్రాక్టు సంస్థే సమకూర్చి, 12 ఏళ్లు నిర్వహిస్తుంది. డ్రైవర్ కూడా ఆ సంస్థ వారే ఉంటారు. ఛార్జింగ్‌కు అవసరమైన వ్యవస్థలన్నీ కాంట్రాక్టు సంస్థే సమకూరుస్తుంది. కాకపోతే కనెక్షన్‌ ఇవ్వడంతోపాటు విద్యుత్ బిల్లు భారాన్ని ఆర్టీసీ వహించాల్సి వస్తుంది. 

దీనికోసం కిలోమీటర్‌కు ఆర్టీసీ ట్రాన్స్ కోకు ఇంత రుసుము చెల్లిస్తే సరిపోతుంది. వినియోగం పెరిగే కొద్దీ బస్సు ధరలు దిగి వస్తాయి. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 250-300 కిమీ ప్రయాణిస్తుంది. సగటున ఒక యూనిట్‌ ఛార్జింగ్‌తో ఒక కి.మీ ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

తెలంగాణా ఆర్టీసీతో ఒలెక్ట్రా సంస్థ ఒప్పందం ప్రకారం ప్రతి కిలో మీటర్‌కు రూ.35 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక యూనిట్ విద్యుత్ చార్జి రూ.6 కాగా, కిలోమీటర్ వ్యయం రూ.41 ఉంటుంది. అదే డీజిల్‌ ఏసీ బస్సుల్లో ప్రస్తుత వ్యయం రూ.69గా నమోదవుతోంది. 

అదే విద్యుత్  బస్సులతో కిలోమీటర్‌పై ఆర్టీసీకి రూ.28 ఆదా అవుతున్నది. కండక్టర్ నియామకంతో మరో ఎనిమిది రూపాయలు ఖర్చయినా రూ.20 మిగులుతున్నది. దీనికి తోడు బస్సు కొనుగోలుకు పెట్టుబడి ఊసే తలెత్తదు. 

కేరళలోని శబరిమలలో మకరవిళక్కు సందర్భంగా నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు తరలి వెళ్లిన అయ్యప్ప భక్తులకు, కేరళ ఆర్టీసీ 31 సీట్లు గల 10 విద్యుత్  బస్సులతో సేవలు అందించింది. కాంట్ట్రాక్టు సంస్థకు ప్రతి కిలోమీటర్‌కు ఆర్టీసీ రూ.40 రుసుము చెల్లించింది. 

ఈ బస్సుకు విద్యుత్ యూనిట్ చార్జి రూ.4 ప్రకారం కిలోమీటర్‌కు రూ.44 ఖర్చయింది. దీంతో కిలోమీటరుకు రూ.57చొప్పున లాభాలు ఆర్జించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా ట్వీట్ చేశారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో కులుమనాలి - రోహతంగ్‌ మధ్య కూడా విద్యుత్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. వీటిని ఒలెక్ట్రా సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం, తాము స్వంతంగా నిర్వహిస్తూ, మరమ్మతులు-ఇతర సేవల బాధ్యతను మాత్రం విక్రయ సంస్థకే అప్పగించింది. గోల్డ్ స్టోన్ ఈ బజ్ కే 7 బస్సులో 25 ప్లస్ ఒక సీటు ఉంటాయి. గమ్మత్తేమిటంటే 13 వేల ఎత్తుకు విజయవంగా విద్యుత్ బస్సు దూసుకెళ్లింది. 

ఒలెక్ట్రా -బీవైడీ బస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రూ.700 కోట్లతో 500 ఏసీ విద్యుత్ బస్సులు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వ్యూహాత్మంగా చైనా బీవైడీ ఆటో ఇండస్ట్రీతో ఒప్పందం కుదుర్చుకున్నది. దీని ప్రకారం ఒలెక్ట్రా - బీవైడీ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్-ముస్సోరీ మధ్య ప్రయోగాత్మకంగా విద్యుత్ బస్సును నడుపుతోంది. డెహ్రడూన్‌లో సదరు ఒలెక్ట్రా- బీవైడీ సంస్థ విద్యుత్ వాహనాలను నడిపేందుకు అవసరమైన మౌలిక వసతులకు కల్పించింది. సీసీటీవీ కెమెరా, జీపీఎస్ నేవిగేషన్, పానిక్ బటన్ తదితర ప్రయాణికుల సేఫ్టీ ఫీచర్లు ఈ బస్సుల్లో చేర్చారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఒలెక్ట్రా - బీవైడీ, జేబీఎం -సొలారిస్ సంస్థలు విద్యుత్ బస్సును మూడు నెలలు ప్రయోగాత్మకంగా నడుపనున్నాయి. ఆనంద్ విహార్ ఐఎస్బీటీ నుంచి మెహ్రౌలీ టెర్మినల్ వరకు 534 నంబర్ రూట్‌లో నడుపుతున్నాయి. ఇది ఢిల్లీ పరిస్థితులను అంచనా వేయనున్నది. దేశ రాజధానిలో విద్యుత్ బస్సులు వినియోగంలోకి వస్తే 1000 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించడమే అవుతుంది. లీథియం బ్యాటరీతో తయారు చేసిన ఈ బస్సులకు ఒకసారి చార్జింగ్ చేస్తే ట్రాఫిక్ కండీషన్లను బట్టి 10 నుంచి 15 గంటలు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో 40 విద్యుత్ బస్సుల సరఫరా కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థకు దక్కింది. అలంభాగ్ డిపోలో వీటిని టాటా మోటార్స్, టాటా మార్కోపోలో ధార్వార్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బస్సు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్లు హాయిగా ప్రయాణించవచ్చు. మరోవైపు అలంబాగ్ డిపో వద్ద ఫాస్ చార్జింగ్ స్టేషన్ నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios