Asianet News TeluguAsianet News Telugu

బిజెపి నాయకుడిపై ప్రత్యర్థుల దాడి...పరామర్శించిన సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా బిజెపి నాయకుడిపై ప్రత్యర్ధులు దాడి చేసిన విషయం తెలిసిందే. అతడిని తాజాగా మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు.  

ex minister somireddy chandramohan reddy visits nellore hospital
Author
Nellore, First Published Oct 12, 2019, 7:54 PM IST

అమరావతి: వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో  ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బిజెపి నాయకుడు ఈదూరు చంద్రశేఖర్ ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలబడినందుకు వైకాపా నాయకులే ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. 

చంద్రశేఖర్ పై వైకాపా నాయకులు దగ్గరుండి దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. కత్తులతో తరిమి తరిమి నరికారని అన్నారు. గత ఎన్నికల్లో తన కోసం పనిచేసిన చంద్రశేఖర్ ఇటీవల కుంచె శ్రీనివాసులు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో కలిసి బీజేపీలో చేరాడు. చేరిక సందర్భంగా తీసిన ఫొటోల్లో శ్రీనివాసులుతో పాటు చంద్రశేఖర్ తలలను రౌండ్ చేసి టార్గెట్ చేశామంటూ వైకాపా నాయకులు అప్పుడే బెదిరించారు.

ప్రాణాలకు ముప్పుపొంచివున్న విషయాన్ని గ్రహించిన వీళ్లు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు..అయినా రక్షణ లేకుండాపోయిందన్నారు. ఉపరాష్ట్రపతి సొంత మండలంలో ఒక దళితుడిని తరిమితరిమి కత్తులతో పొడవడం దుర్మార్గమన్నారు. 

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కొందరు పోలీసు అధికారులు చేతులెత్తేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఏమి చెబితే అది చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రజల ఓపికను పరీక్షించడం తగదు...ప్రజాప్రభుత్వంలో వస్తున్న జీతాలతో పనిచేస్తున్నామనే విషయాన్ని ఇలాంటి పోలీస్ అధికారులు గ్రహించాలని సూచించారు. 

ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే చూస్తూ ఉండటం సరికాదు...దాడి దశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి...వాటిని పరిశీలించి ఘటనవెనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి కోరారు. అరాచాకాలను ఆపండి...ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చర్యలు తీసుకోండని పోలీసులకు సూచించారు. 

 ఎన్నికల్లో ఓడిపోయాక ఇళ్లకే పరిమితమైన వారిపైనా దాడి చేసి మళ్లీ వారి మీదే కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. దశాబ్దాలుగా నెల్లూరు రాజకీయాలు చూస్తున్నాం..ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. ఇప్పటికైనా పోలీసు అధికారులు పరిస్థితులను చక్కదిద్ది శాంతిభద్రతలను కాపాడాలని సోమిరెడ్డి  పోలీసులను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios