Asianet News TeluguAsianet News Telugu

లాయర్ వర్సెస్ పోలీస్: పోలీస్ కమిషనర్ కైసా హో, కిరణ్ బేడి జైసా హో

"పోలీస్ కమిషనర్ కైసా హో, కిరణ్ బేడి జైసా హో (పోలీసు కమిషనర్ ఎలా ఉండాలి? కిరణ్ బేడీ లాగా ఉండాలి)" అని పోలీసు సిబ్బంది చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. 

we want kiran bedi demands protesting delhi police officers
Author
New Delhi, First Published Nov 7, 2019, 5:32 PM IST

  అది 1988వ సంవత్సరం . స్థలం: టిస్ హజారీ కోర్టు. చిన్న దొంగతనానికి పాల్పడిన న్యాయవాదిని అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ లాయర్లు నిరసనకు దిగారు. నిరసనలు హద్దుమీరడంతో అప్పటి ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కిరణ్ బేడి న్యాయవాదులపై లాఠీఛార్జ్ చేశారు. ఒక్కసారి కాదు రెండు సార్లు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై లాయర్లు పెద్దఎత్తున నిరసనకు దిగారు. కోర్టులను స్తంభింపచేసారు. ఆమె మాత్రం తన పట్టు విడువ లేదు. 

ముప్పై ఒక్క సంవత్సరాల తరువాత, ఐటిఓ సమీపంలోని ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల, కమిషనర్ అముల్య పట్నాయక్ సోమవారం ఆగ్రహంగా ఉన్న, న్యాయం కోసం అభ్యర్థిస్తున్న పోలీసుల సమూహం ఎదురుగా నిలబడ్డాడు.  

టిస్ హజారీ కోర్టులో పోలీసులపై దాడులకు పాల్పడ్డ లాయర్లను శిక్షించాలని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులు పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు నిరసనకు దిగారు.  

పట్నాయక్ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసి, పోలీసులను తమ విధులకు తిరిగి రమ్మని, వ్యవస్థపై నమ్మకం ఉంచాలని కోరారు. కానీ అక్కడున్న నిరసన తెలుపుతున్న పోలీసు అధికారులు పట్నాయక్ కు ఊహించని నినాదాలిచ్చి షాక్ కు గురయ్యేలా చేసారు. 

"పోలీస్ కమిషనర్ కైసా హో, కిరణ్ బేడి జైసా హో (పోలీసు కమిషనర్ ఎలా ఉండాలి? కిరణ్ బేడీ లాగా ఉండాలి)" అని పోలీసు సిబ్బంది చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. 

"మాకు కిరణ్ బేడి వంటి లీడర్ కావాలి, ఆమె భయం ఎరుగని నాయకురాలు, బాధ్యతలు స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అని నిరసన తెలిపిన పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

‘మాకు కిరణ్ బేడి కావాలి’ అని చాలా మంది ప్లకార్డులు పట్టుకొని కనిపించారు.

పోలీసు ఐకాన్

ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న బేడి అనేక విజయాలకు ప్రసిద్ది చెందారు, కాని ఆమె కష్టకాలంలో పోలీసు సిబ్బందికి బాసటగా ఎలా నిలబడిందో పోలీసు అధికారులు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. 

1988 సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తరువాత, జస్టిస్ డి.పి. వాధ్వా కమిటీ తన 65 పేజీల నివేదికలో, బేడి ఆదేశించిన లాఠీ-ఛార్జ్ విచక్షణారహితమైన, అన్యాయమైన చర్య అని పేర్కొంది. న్యాయవాదికి బేడీలు వేయడం చట్టవిరుద్ధం అని పేర్కొంది.  ఈ తీర్పు ఆమెను ఏ విధంగానూ కలవరపెట్టలేకపోయింది.  "మేము మొదటి నుంచీ ఒక తప్పుడు వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని మాకు తెలుసు ... మేము తిరిగి పోరాడబోతున్నాం" అని తీర్పు వెలువడ్డ అనంతరం కిరణ్ బేడీ అన్నారు. 

బేడీ 1972 లో ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. తదనంతరం, ఆమె పోలీసు జీవితం తరువాత, ఆమె రాజకీయాల వైపు తిరిగింది, అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలోని లోక్ పాల్ ఉద్యమంలో చేరారు, తరువాత 2015 లో బిజెపి లో చేరారు. ఆమె 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆ సమయంలో, కొంతమంది న్యాయవాదులు ఆమెకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ముందుకొచ్చినా, గత వైరాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు లాయర్లు ఆమెను బాహాటంగానే వ్యతిరేకించి దిష్టి బొమ్మలు దహనం చేశారు.
 

ఎందుకు ఈ నిరసనలు...?

టిస్ హజారి కోర్టులో న్యాయవాదులు, పోలీసుల మధ్య పార్కింగ్ విషయంలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ కోర్టులో జరిగిన గొడవ వల్ల వేరే కోర్టులలో కూడా లాయర్లు పోలీసులపై దాడులు చేసారు. పోలీసులకు లాయర్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో చాల మంది గాయపడ్డారు.  బైక్ పై ఉన్న పోలీసుపై ఒక లాయర్ దాడి చేస్తున్న ఒక వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఆ సదరు వీడియో కూడా పోలీసుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. 

న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు ప్రధాన కార్యాలయం చుట్టూ ఉన్న రోడ్లపైకి  కోర్టుల చుట్టూ ఉన్న రోడ్లపైకి పోలీసులు వచ్చారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కారు. 

Follow Us:
Download App:
  • android
  • ios