Asianet News TeluguAsianet News Telugu

మనుషులు కనిపిస్తే ఖతమే.. ప్రపంచానికి దూరంగా ‘‘సెంటినలీ’’ తెగ

ఒంటి మీద బట్టలు లేకుండా... ఆకలేస్తే వేటాడటం, ప్రేమాభిమానాలు లేకుండా మనిషి ఉన్నాడని మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే నేటి ఆధునిక కాలంలోనూ రాతియుగం నాటి వారిని పోలిన మనుషులు ఉన్నారు. 

unknown things about sentinal island
Author
Delhi, First Published Nov 24, 2018, 11:56 AM IST

విహారయాత్రకు వచ్చిన అమెరికన్ పౌరుడిని అత్యంత దారుణంగా చంపడంతో అండమాన్‌ దీవుల్లోని సెంటినెలీస్ తెగ ఇప్పుడు ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒంటి మీద బట్టలు లేకుండా... ఆకలేస్తే వేటాడటం, ప్రేమాభిమానాలు లేకుండా మనిషి ఉన్నాడని మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం.

అయితే నేటి ఆధునిక కాలంలోనూ రాతియుగం నాటి వారిని పోలిన మనుషులు ఉన్నారు. ఎక్కడో కాదు మన అండమాన్ నికోబార్ దీవుల్లోనే. అండమాన్ దీవులు అనేక ఆదిమ తెగలకు నివాస స్థానం. ఇక్కడ ప్రధానంగా ఐదు తెగలు ఉన్నాయి.

వాటిలో గ్రేట్ అండమానీస్, జారవా, ఒంగెస్, సెంటినెలీస్, షోమ్‌పెన్స్ ఉన్నాయి. వీరిలో చాలా వరకు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటూ తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాయి.. సుమారు 60 వేల సంవత్సరాల క్రితం ఈ తెగలన్ని ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినట్లు చారిత్రకారుల అభిప్రాయం.

భారత ప్రభుత్వం వీరిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చి రక్షిస్తోంది. ఈ తెగలన్నింటిలోకి ఉత్తర సెంటినెల్ దీవుల్లో నివసించే సెంటినెల్ తెగ అత్యంత క్రూరమైనది. వీరు తాము నివసించే దీవి ఛాయలకు ఇతరుల్ని రానివ్వరూ.. ఎవరైనా వస్తున్నట్లు గుర్తిస్తే.. తమపై దాడి చేసేందుకు వస్తున్నట్లుగా భావించి... తెగ అంతా కలిసి సామూహిక దాడికి దిగుతారు.

సముద్రంలో చేపల వేటకు అనుగుణంగా వీరికి తీక్షణ దృష్టి అలవడింది. నీటిలో చేపల కదలికల్ని గమనిస్తూ బాణాలు వేయగల సమర్థులు వీరు. ప్రస్తుతం ఈ తెగ జనాభా 40 నుంచి 400 మంది వరకు ఉంటారని అంచనా.

1896లో సెంటినెలిస్ తెగ గురించి బాహ్య ప్రపంచానికి తెలిసిందే. బ్రిటీష్ ప్రభుత్వం అండమాన్ జైలులో నిర్బంధించిన ఓ ఖైదీ తప్పించుకోవడంతో అతన్ని వెతుక్కుంటూ పోలీసులు ఈ దీవికి చేరుకున్నారు.

అక్కడ నేలపై అడుగుపెట్టిన క్షణంలో వారిపైకి ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి శరీరాలను చిధ్రం చేశాయి. నాటి నుంచి ఆ దివి దిశగా వెళ్లడానికి ఎవ్వరూ సాహసం చేయలేదు.

1974లో ఓ సినిమా యూనిట్ షూటింగ్ నిమిత్తం ఆ దీవికి సమీపంలోకి వెళ్లడంతో.. వారిపైకి ఒక్కసారిగా బాణాలు దూసుకురావడంతో వారంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు. 2004లో తీరాన్ని ముంచెత్తిన సునామీ కారణంగా ప్రభుత్వం సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఉపయోగించింది.

ఈ క్రమంలో సెంటినల్ దీవి దిశగా వెళ్లిన ఓ ఆర్మీ హెలికాఫ్టర్‌పై కూడా ఆ తెగవారు బాణాలు వేశారు. 2006లో చేపల వేటకు వెళ్లిన ఓ బోటు సెంటినల్ ద్వీపం వద్ద బురదలో కూరుకుపోవడంతో ... సెంటినల్ తెగ బోటులోని మత్స్యకారులను హతమార్చింది.

దీంతో ప్రజల భద్రతా రీత్యా ఆ దీవిని నిషేధిత ప్రాంతాల జాబితాలోకి చేర్చింది కేంద్రప్రభుత్వం. అయితే ఇటీవల టూరిజం అభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాలను ఆ జాబితా నుంచి తొలగించింది. దానిలో సెంటినల్ దీవీ కూడా ఉంది. 2022 డిసెంబర్ 31 వరకు ప్రజలు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.

ఈ నేపథ్యంలోనే అమెరికా సాహసయాత్రికుడు జాన్ అలెన్ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీవిలో అడుగుపెట్టగానే జాన్‌పై సెంటినలీస్ ప్రజలు ఆయనపై బాణాల వర్షం కురిపించి హతమార్చారు. ఆయన మృతదేహాన్ని తీసుకురావడానికి భారత ప్రభుత్వం హెలికాఫ్టర్ల ద్వారా గాలిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios