Asianet News TeluguAsianet News Telugu

తీస్ హజారీ ఘర్షణ: ముదురుతున్న లాయర్ vs ఖాకీ వివాదం, రంగంలోకి లెఫ్టినెంట్ గవర్నర్

దేశ రాజధాని ఢిల్లీలో తీస్ హజారీ వివాదం అంతకంతకూ ముదురుతోంది. బుధవారం పోలీసులు, లాయర్ల పోటాపోటీ ఆందోళనలతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ కేంద్ర కార్యాలయం ముందు పోలీస్ సిబ్బంది ఆందోళనకు దిగారు

Tis Hazari clash: Lawyers to continue boycotting work amid Bar Council's
Author
Delhi, First Published Nov 6, 2019, 11:14 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో తీస్ హజారీ వివాదం అంతకంతకూ ముదురుతోంది. బుధవారం పోలీసులు, లాయర్ల పోటాపోటీ ఆందోళనలతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ కేంద్ర కార్యాలయం ముందు పోలీస్ సిబ్బంది ఆందోళనకు దిగారు.... భారీగా తరలివచ్చిన ఖాకీలు..న్యాయవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు తాజా పరిస్ధితిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ భైజాల్‌కు వివరించేందుకు నగర పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్, జాయింట్ కమీషనర్ రాజేశ్ ఖురానాతో పాటు ఇతర ఉన్నతాధికారులు గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు.

మరోవైపు న్యాయవాదులు సైతం పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. మంగళవారం పోలీస్ హెడ్‌క్వార్ట్రర్స్ ముందు నిరసనకు దిగిన ఖాకీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు న్యాయవాది ఢిల్లీ పోలీస్ కమీషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చారు.

Also Read:సెగలు రేపుతున్న తీస్ హజారీ వివాదం: రోడ్డెక్కిన పోలీసులు, న్యాయం కోసం డిమాండ్

మంగళవారం ఢిల్లీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పోలీసులు రోడ్లపైకి వచ్చి .. తమకు న్యాయం చేయాల్సిందిగా నిరసనకు దిగారు. విధుల్లోకి రావాల్సిందిగా సీనియర్ అధికారులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు.

అంతేకాకుండా నగర పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ స్వయంగా తమ వద్దకు వచ్చి మాట్లాడాలంటూ పట్టుబట్టారు. తీస్ హజారీ కోర్టు ఆవరణలో జరిగిన ఘర్షణపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది.

దీనిపై ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం.. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ న్యాయ విచారణ చేస్తారని తెలిపింది. విచారణ జరిగే సమయంలో స్పెషల్ కమీషనర్ సంజయ్ సింగ్, అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్‌లను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Also read:పోలీసు వాహనాలకు నిప్పు, లాయర్లపై పోలీసుల కాల్పులు..

అదే సమయంలో న్యాయవాదులపై ఎలాంటి నిర్బందపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఓ అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశామని.. మరొకరిని బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు న్యాయస్థానానికి తెలిపాయి.

కాగా ఈ నెల 2న తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో ఘర్షణల నేపథ్యంలో దిగువ కోర్టుల లాయర్లు ఢిల్లీలో సోమవారం  నిరసనలకు దిగడం.. ఆ నిరసనల సమయంలో కొందరు లాయర్లు ఢిల్లీ పోలీస్ సిబ్బందిపై దాడి జరిపినట్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం సంచలనం కలిగించింది.

ఈ ఘటనలో పోలీసు సిబ్బంది సహా సుమారు 30 మంది గాయపడగా.. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల ఘర్షణల నేపథ్యంలో తీస్ హజారీ, కార్కర్‌డూమ్ జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios