Asianet News TeluguAsianet News Telugu

నాగేశ్వర రావు నియామకం కేసులో ట్విస్ట్: తప్పుకున్న మరో జడ్జి

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు, తాను ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమని ఆయన కుమార్తె వివాహానికి కూడా తాను హాజరైనట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. విచారణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 
 

SC judge recuses from hearing plea against appointment of Nageswara Rao as interim CBI Director
Author
Delhi, First Published Jan 31, 2019, 12:57 PM IST

ఢిల్లీ:  సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్‌ విచారణలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రి కేసు విచారణ నుంచి తప్పుకోగా ఇప్పుడు జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు, తాను ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమని ఆయన కుమార్తె వివాహానికి కూడా తాను హాజరైనట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. విచారణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ కేసును తగిన ధర్మాసనానికి అప్పగించాలని సీజేఐ రంజన్‌ గొగొయ్‌ను జస్టిస్‌ రమణ కోరారు. నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ కామన్‌ కాజ్‌ అనే ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తొలుత ఈ పిటిషన్‌ ను విచారించేందుకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోనే ధర్మాసనం ముందుకు రాగా ఆయన తప్పుకున్నారు. 

సీబీఐ నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి సెలక్షన్ కమిటీలో సీజేఐ సభ్యుడిగా ఉండటంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసును జస్టిస్‌ సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. 

అయితే సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తొలగించిన కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందు వల్ల తాను కూడా ఈ విచారణ చేపట్టలేనని జస్టిస్‌ సిక్రి తెలిపారు. కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో తప్పుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios