Asianet News TeluguAsianet News Telugu

ఇంకా కశ్మీర్‌లోనే పుల్వామా సూత్రధారి: గాలిస్తున్న భద్రతా దళాలు

పుల్వామా ఉగ్రదాడి ఘటనకు కీలక సూత్రధారి జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీ ఇంకా కశ్మీర్ ప్రాంతంలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి

Pulwama terror attack master mind abdul rasheed ghazi still in kashmir
Author
Jammu and Kashmir, First Published Feb 17, 2019, 6:12 PM IST

పుల్వామా ఉగ్రదాడి ఘటనకు కీలక సూత్రధారి జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీ ఇంకా కశ్మీర్ ప్రాంతంలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైషే చీఫ్ మసూద్ అజహర్ మేనల్లుడు ఉస్మాన్‌ను సైన్యం హతం చేసిన తర్వాత... ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని జైషే సంస్థ అప్పట్లోనే ప్రకటన విడుదల చేసింది.

డిసెంబర్ మొదటి వారంలో ఘాజీతో పాటు మరో ఇద్దరు కమాండర్లను మసూద్ కశ్మీర్‌కు పంపించినట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది. ఆ తర్వాత మసూద్ ప్రసంగాల ద్వారా వీరు కశ్మీర్ యువతను ఉగ్రవాదంవైపు మళ్లించారు.

ఆఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్న ఘాజీ అలియాస్ రషీద్ ఆఫ్గానీ ఐఈడీలు తయారు చేయడంలో నిపుణుడు. పుల్వామా ఘటనలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్‌కు ఇతనే శిక్షణ ఇచ్చాడు.

జైషే అధినేతకు అత్యంత నమ్మకస్తుడైన రషీద్...నాటో దళాలతో పోరాటం అనంతరం 2011లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వచ్చాడు. అప్పటి నుంచి కశ్మీర్ యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నాడు.

పుల్వామా ఘటనకు కొద్దిరోజుల ముందు చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్ నుంచి అబ్ధుల్ రషీద్ తృటిలో తప్పించుకున్నాడు. సరిహద్దుల్లో సైన్యం నిఘా ఎక్కువ కావడంతో రషీద్ ఇంకా కశ్మీర్‌లోనే తలదాచుకున్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇతని కోసం సైన్యం, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios