Asianet News TeluguAsianet News Telugu

ఆధ్యాత్మికతలో ఆదాయం: కుంభమేళాతో యూపీకి కోట్ల వర్షం

ఉత్తర్ ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కనివినీ ఎరుగని రీతిలో చేసిన ఏర్పాట్లతో ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభ్ మేళా ఆయనకు జంట లాభాలను తెచ్చి పెడుతోంది. స్వతహాగా భక్తి, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరైన యోగి ఆదిత్యనాథ్.. వీటి నిర్వహణకు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. 

Kumbh Mela 2019 to generate revenue of Rs 1.2 lakh crore: CII
Author
Prayagraj, First Published Jan 21, 2019, 10:49 AM IST

కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న కుంభమేళా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షాన్నే కురిపిస్తున్నది. అశేష భక్తజనంతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం పరిసరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు రంగాల్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈసారి ఉత్తరప్రదేశ్‌కు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం రావొచ్చని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుంభమేళా నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 15న మొదలైన ఈ మెగా కుంభమేళా మార్చి నాలుగో తేదీ దాకా జరుగనున్నది. దీంతో కుంభమేళా నిర్వహణకు ఏకంగా రూ.4,200 కోట్లను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేటాయించింది. 2013తో పోల్చితే ఇది మూడు రెట్లు అధికం. 

ఈ కుంభమేళాతో వివిధ రంగాల్లోని మొత్తం 6 లక్షలకు పైగా మందికి ఉపాధి దక్కిందన్న సీఐఐ.. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో ఒక్క ఆతిథ్య రంగంలోనే 2.50 లక్షల మందికి పని దొరికిందని పేర్కొన్నది. 

ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌ల్లో దాదాపు 1.50 లక్షల మందికి, పర్యాటక రంగంలో సుమారు 45 వేల మందికి ఉద్యోగాలు లభించాయని సీఐఐ తమ నివేదికలో సీఐఐ వివరించింది. ఎకో-టూరిజం, మెడికల్ టూరిజంలలోనూ 85,000 మందికి ఉపాధి దక్కినట్లు తెలుస్తున్నది. 

టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లతో కూడిన అసంఘటిత రంగంలో మరో 55,000 వరకు కొత్త ఉద్యోగాలు వచ్చాయంటున్నది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ వ్యాపారులకు కాసుల పంటే పండుతున్నదని సీఐఐ అభిప్రాయపడింది. 

కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ వద్ద 32 చదరపు కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కార్ ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరం నిర్మించింది. ఇందులో టాయిలెట్లు, హోటల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. 

ఈ నగరంలో 4000కుపైగా టెంట్లు, 40 వేలకుపైగా ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఇక 3,200 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన కుంభమేళా ప్రాంతంలో 250 కిలోమీటర్ల స్థాయిలో రోడ్లు, 22 బల్లకట్టు వంతెనలను ఏర్పాటు చేశారు. 9 రైల్వే స్టేషన్లను ఆధునీకరించిన ప్రభుత్వం..  అలహాబాద్‌లో కొత్త ఎయిర్ పోర్టు టర్మినల్‌నే నిర్మించడం విశేషం.

ఉత్తరప్రదేశ్ పొరుగు రాష్ర్టాలకూ పండుగ వాతావరణం వచ్చింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలకూ పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్నది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు రద్దీ పెరుగగా, వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నట్లు సీఐఐ తాజా అధ్యయనం తేటతెల్లం చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోగల త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న కుంభమేళాకు దేశం నలుమూలలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచీ భక్తజనం పోటెత్తుతున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక తదితర దేశాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. 

దీంతో ఆతిథ్య రంగం ఒక్కసారిగా ఊపందుకున్నది. కుంభమేళా పరిసర ప్రాంతాల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ రంగ సంస్థలు అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లే చేశాయి. వారి విడిది కోసం తాత్కాలికంగా లగ్జరీ సదుపాయాలను కల్పించాయి. 

విదేశీయులు, వివిధ రాష్ట్రాల పర్యాటకులకు టెంట్లు వేసి సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన గదులకు ఒక్కరోజుకు  ప్రభుత్వం కనిష్ఠంగా రూ.2,500, గరిష్ఠంగా రూ.10,000 అద్దె వసూలు చేస్తున్నది. బెడ్, బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాలను అందిస్తున్నది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలైతే ఒక్క రాత్రికి ఏకంగా రూ.32,000 వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. 

చలి తీవ్రత మధ్య ఎయిర్ కండీషనర్ రూమ్స్‌ను అందుబాటులో ఉంచాయి. 50 రోజులు ఈ కుంభమేళా జరుగనుండటంతో విదేశాల నుంచి వచ్చినవారు ఇక్కడే ఎక్కువ రోజులు ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. దీంతో హోటల్ యజమానుల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios