Asianet News TeluguAsianet News Telugu

వివాదంలో కర్ణాటక మంత్రి, క్రీడాకారులపై స్పోర్ట్స్ కిట్స్ విసిరిన పాండే

క్రీడాకారులు తమ ప్రతిభతో దేశగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తుంటే వారిని గౌరవించాల్సిన ఓ మంత్రి అవమానించారు. పలు క్రీడల్లో మంచి ప్రతిభ చూపి రాష్ట్రానికి కీర్తిని తీసుకొచ్చిన క్రీడాకారులను సన్మానిస్తున్న నిండు సభలోనే ఆ మంత్రి దారుణంగా అవమానించారు.

Karnataka minister insults athletes, throws sports kits at them from stage
Author
Bengaluru, First Published Nov 1, 2018, 4:19 PM IST

బెంగళూరు: క్రీడాకారులు తమ ప్రతిభతో దేశగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తుంటే వారిని గౌరవించాల్సిన ఓ మంత్రి అవమానించారు. పలు క్రీడల్లో మంచి ప్రతిభ చూపి రాష్ట్రానికి కీర్తిని తీసుకొచ్చిన క్రీడాకారులను సన్మానిస్తున్న నిండు సభలోనే ఆ మంత్రి దారుణంగా అవమానించారు. చేతికందివ్వాల్సిన కిట్ లను విసిరేశారు. మంత్రి వ్యవహరించిన తీరును చూసి మంత్రిగారూ మీకిది తగునా అంటూ అంతా నోరెళ్లబెట్టారు. 

వివరాల్లోకి వెళ్తే కర్ణాటక క్రీడాకారులు వివిధ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. వారిని గౌరవిస్తూ ప్రభుత్వం సభను ఏర్పాటు చేసింది. క్రీడాకారుల ప్రతిభను చూసిన సర్కార్ కర్ణాటకలోని హలియాల్ నియోజకర్గంలో నూతన ఇండోర్ స్టేడియంను నిర్మించింది. 

ఆ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవానికి కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ వీ దేవ్ పాండే హాజరయ్యారు. స్టేడియంను ప్రారంభించిన మంత్రి అనంతరం స్థానిక, జిల్లా, జాతీయ స్థాయి క్రీడాకారులందరికీ గౌరవార్థం స్పోర్ట్స్‌ కిట్స్‌ను అందివ్వాల్సి ఉంది. 

అయితే మంత్రిగారు మాత్రం అలా చెయ్యలేదు. క్రీడాకారుల పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పోర్ట్స్‌ కిట్‌ను క్రీడాకారుల చేతికి అందించకుండా వేదిక కింద ఉన్న వారి మీదకు ఇష్టం వచ్చినట్లు విసిరేశారు.

అధికారులు క్రీడాకారుల పేర్లను పిలుస్తూ వేదిక మీదకు రావాల్సిందిగా కోరారు. అధికారుల ఆదేశాలతో క్రీడాకారులంతా క్యూలో నిల్చున్నారు కూడా. అధికారులు పిలుస్తున్నా, క్రీడాకారులు నిలుచుని ఉన్నా మంత్రి మాత్రం అవేమి పట్టించుకోలేదు. వేదిక కిందే తనకు దగ్గరగా నిలబడమని చెప్పి తాను విసిరేసిన కిట్స్ అందుకోండంటూ హుకుం జారీ చేశారు. 

మంత్రిగారు ప్రవర్తించిన తీరు అందర్నీ నివ్వెర పరిచింది. క్రీడాకారుల పట్ల ఆర్ వీ దేశ్ పాండే వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలు ఎదుర్కోంటుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

కర్ణాటక మంత్రులు ఇలా వివాదాస్పదంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. గతంలో కర్ణాటక సీఎం కుమారస్వామి సోదరుడు పీడబ్ల్యూడీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా ఇలాగే ప్రవర్తించారు. సెప్టెంబరు నెలలో కొడగు ప్రాంతంలోని వరద సహాయక శిబిరాన్ని సందర్శించిన ఆయన అక్కడి బాధితులకు ఆహార పదార్థాలను వాళ్ల మీదకు విసిరేసి విమర్శలపాలయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios