Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో వేలికి పూసే ‘‘సిరా’’ గురించి తెలుసా..?

 నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పెట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది. 

Important details of election ink
Author
Delhi, First Published Oct 28, 2018, 5:00 PM IST

మనం ఓటు వేయడానికి పోలింగ్ బూతుకి వెళ్లగానే మన ఓటరు గుర్తింపు కార్డు పరిశీలించి అనంతరం అక్కడున్న సిబ్బంది మన చేతి వేలికి నేరేడు రంగులో ఉన్న సిరాను పూస్తారు గుర్తుందా..? నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పెట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది.

సిరా పూసిన వేలితో సెల్ఫీలు దిగి.. తాము కూడా ఓటు వేశామని చూపించి గర్వంగా ఫీలవుతారు భారతీయులు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పరిశీలిస్తే.. ఈ సిరాను కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేస్తోంది.

దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కంపెనీ నుంచే సిరా సరఫరా అవుతుంది. అంతేకాకుండా 29 దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు. ఈ కంపెనీని మైసూర్ మహారాజు నాల్మడి కృష్ణరాజ వడయారు స్థాపించారు..

స్వాతంత్య్రానికి పూర్వం వరకు ఇది మైసూరు రాజవంశం అధీనంలోనే ఉండేది. స్వాతంత్ర్యం తరువాత ఈ కంపెనీని కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఓటర్లు పలుమార్లు ఓటు వేయకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చెరిగిపోని గుర్తుని వేలిపై వేయాలని నిర్ణయించింది.

నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీస్ తయారు చేసిన ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. నేరేడు రంగులో ఉండే ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వెంటనే చెరిగిపోదు.

అలా దీనిని 1962 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఉపయోగించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కోసం 2 లక్షల సీసాలను దిగుమతి చేసుకుంటారని అంచనా. ఒక్కో సీసాను 500 నుంచి 700 మందికి గుర్తుగా ఉపయోగించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios