Asianet News TeluguAsianet News Telugu

కుమారస్వామికి పదవీగండం: మధ్యంతరం వైపు బిజెపి చూపు

మెుత్తానికి కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడ్డ అతుకులబొంద ప్రభుత్వం పరిస్థితి దినదినగండంగా మారుతోంది. ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందోనన్న భయంతో సీఎం కుమారస్వామి ఆందోళనలో ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య సైతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు.

Cong-JD(S) coalition struggles in K'taka, BJP battles for mid-term polls
Author
Karnataka, First Published May 28, 2019, 4:00 PM IST

కర్ణాటక: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో కర్ణాటక ప్రభుత్వానికి మళ్లీ టెన్షన్ మెుదలైంది. ఇప్పటికే తుమ్మితే ఊడిపోయే పరిస్థితి కుమార స్వామి ప్రభుత్వానిది. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు కుమార స్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కుమార స్వామికి మింగుడుపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై కుమార స్వామి పలు సందర్భాల్లో ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. 

మిత్రపక్షం పెడుతున్న టెన్షన్ భరించలేకపోతున్న తరుణంలో కర్ణాటకలో బీజేపీ పాగా వేయడం కుమార స్వామి ప్రభుత్వానికి గండంగా మారింది. ఇప్పటికే దినదినగండంగా నెట్టుకొస్తున్న కుమార స్వామి ప్రభుత్వానికి బీజేపీ అఖండ విజయంతో పెద్ద షాక్ తగిలింది. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 28 పార్లమెంట్ స్థానాలకు గానూ 25 స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కుమారస్వామి కుటుంబం ఘోరంగా ఓటమిచెందింది. 

సీఎం కుమార స్వామి తండ్రి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారుడు నిఖిల్ లు ఘోరంగా పరాజయం పాలయ్యారు. దీంతో కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అఖండ విజయం సాధించడంతో కమళదళం మంచి ఊపుమీద ఉంది. 

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయ్యాలని వ్యూహరచన చేస్తోంది. ఏడాది కాలంగా ఆ అవకాశం కోసం బీజేపీ ఎదురుచూస్తూ వస్తోంది. అయితే కర్ణాటకలో బీజేపీ 25 పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. 

సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వారంతా బీజేపీతో టచ్ లో ఉన్నారని కాషాయి నేతలు చెప్తున్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత కర్ణాటకపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 

ఇకపోతే 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 79 స్థానాలు, జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. 

105 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచకుండా చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ తో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పొత్తుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటికి కాంగ్రెస్ పార్టీ అంత సఖ్యతగా వ్యవహరించడం లేదు. 

మంత్రి పదవులపై కాంగ్రెస్ పార్టీ గుస్సగా ఉంది. పొత్తులో భాగంగా సీఎం కుర్చీ వదులుకున్నప్పటికీ మంత్రి పదవులలో కూడా నిరాశ దక్కడంతో 20 మంది ఎమ్మెల్యే అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరిన్ని మంత్రి పదవులు కావాలంటూ కాంగ్రెస్ పార్టీ రచ్చరచ్చ చేస్తోంది.  

మంత్రి పదవులపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిని గ్రహించిన జేడీఎస్ కీలక నేతల్లో ఇద్దరు తమ మంత్రి పదవులను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. మాండ్య ప్రాంతానికి చెందిన మంత్రులు డీసీ తమ్మన్నా సీఎస్ పుట్టరాజులు మంత్రి పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 

అంతేకాదు ఇటీవలే మరణించిన మరో మంత్రి సీఎస్ శివాళి స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని డిమాండ్ చేస్తోంది. మెుత్తానికి మూడు మంత్రి పదవులపై కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఈ వ్యవహారాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మాత్రం కొట్టిపారేశారు.

 జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల పొత్తుతో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యలను కొట్టిపారేశారు. 

కర్ణాటక ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మరో నాలుగేళ్లు కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంటుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు కర్ణాటక హోంశాఖ మంత్రి ఎంబీ పాటిల్. ఇదిలా ఉంటే బీజేపీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సహనంతో ఉండాలని పార్టీ నేతలకు కుమారస్వామి చెప్తున్నారు.  

మెుత్తానికి కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడ్డ అతుకులబొంద ప్రభుత్వం పరిస్థితి దినదినగండంగా మారుతోంది. ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందోనన్న భయంతో సీఎం కుమారస్వామి ఆందోళనలో ఉన్నారు. 

అటు కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య సైతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. ఎవరూ పార్టీ వీడకుండా చేసే పనిలో పడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఆపరేష్ ఆకర్ష్ కు లోనవ్వకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios