Asianet News TeluguAsianet News Telugu

విపక్షాలపై బీజేపీ వేధింపులు ఆపాలి: మమత సత్యాగ్రహ దీక్షకు చంద్రబాబు సంఘీభావం

పశ్చిమబెంగాల్ పై కేంద్రం వేధింపులకు గురిచేస్తున్న సందర్భంలో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థులుగెలుపొందుతారని చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ విపక్షాలకు మూలస్థంభం అంటూ చంద్రబాబు కొనియాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 42 మంది ఎంపీ సీట్లను గెలిపించి ప్రధానిని ఎంపిక చేసే అధికారాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని కోరారు. 
 

chandrababu naidu participating mamata benarji satyagraha deeksha
Author
Kolkata, First Published Feb 5, 2019, 5:54 PM IST

పశ్చిమబెంగాల్: బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి మద్దతు ప్రకటించిన చంద్రబాబు పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి నిరంతర పోరాటం చేస్తున్నారని అలాంటి వ్యక్తిని బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని స్పష్టం చేశారు. 

బీజేపీ మమతా బెనర్జీని బెదిరించేందుకు ప్రయత్నించి పెద్ద తప్పు చేసిందని వారి వేధింపులే టీఎంసీ గెలుపుకు దోహదపడుతుందోన్నారు. పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 42  స్థానాల్లో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 

పశ్చిమబెంగాల్ పై కేంద్రం వేధింపులకు గురిచేస్తున్న సందర్భంలో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థులుగెలుపొందుతారని చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ విపక్షాలకు మూలస్థంభం అంటూ చంద్రబాబు కొనియాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 42 మంది ఎంపీ సీట్లను గెలిపించి ప్రధానిని ఎంపిక చేసే అధికారాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని కోరారు. 

మమతా బెనర్జీ వెనుక తనతోపాటు మరో 23 పార్టీలు మద్దతుగా ఉన్నాయని తెలిపారు. 23 పార్టీలతో కలిసి ఈవీఎంల అక్రమాలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మమతా బెనర్జీతో తనకు 1998 నుంచే మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. 

ఆమె కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇకపోతే దేశంలో అన్ని పార్టీలు అవినీతి పార్టీలేనని మోదీ, అమిత్ షా ఆరోపిస్తున్నారని వారిద్దరే నితివంతులుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 

ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లో తనకంటే చాలా జూనియర్ అని చెప్పుకొచ్చారు. తాను 1994లోనే ముఖ్యమంత్రి అయితే మోదీ 2002లో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న తనకు ఎవరు ఎటువంటి వారో తెలుసునని స్పష్టం చేశారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చాక అమిత్ షా ఆస్తులు 20 రెట్లు పెరిగిందని ఎవరు అవినీతి పరులో ఇప్పుడే అర్థమవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు సూచించారు. 

మరోవైపు చంద్రబాబు వచ్చి మద్దతు ప్రకటించినందుకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈవీఎంలపై చంద్రబాబుతోపాటు పోరాటం చేస్తానని దీదీ స్పష్టం చేశారు.   


 
 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios