Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ ఎన్నికలు: భవిష్యత్తును నిర్ణయించే రాష్ట్రాలివే...

014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీకి స్పష్టమైన ఆదిక్యత లభించింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలు ఈ దపా జరిగే ఎన్నికల్లో  మరోసారి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతాయా, విపక్షాల వైపుకు ఓటర్లు మొగ్గు చూపుతారా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. 
 

is bjp win majority mp seats from all states in upcoming elections
Author
New Delhi, First Published Mar 5, 2019, 1:46 PM IST

న్యూఢిల్లీ: 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీకి స్పష్టమైన ఆదిక్యత లభించింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలు ఈ దపా జరిగే ఎన్నికల్లో  మరోసారి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతాయా, విపక్షాల వైపుకు ఓటర్లు మొగ్గు చూపుతారా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. 

గత ఎన్నికల్లో  బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకొన్న రాష్ట్రాల్లో విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.  బీజేపీకి వచ్చే సీట్లను తగ్గించేందుకు విపక్షాలు కూటములుగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

గత ఎన్నికల సమయంలో  బీజేపీకి మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎంపీ స్థానాలు దక్కాయి. అయితే ఈ దఫా మిత్రపక్షాల సహాయంతో  బీజేపీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని సర్వేలు చెబుతున్నాయి.


2014 ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా యూపీ రాష్ట్రం నుండి 80 ఎంపీ సీట్లలో 71 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. ఆ సమయంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకొంది. ఆ ఎన్నికల్లో  సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీఎస్పీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ రెండు స్థానాలు కూడ  సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు పోటీ చేసిన రెండు స్థానాలు మాత్రమే విజయం సాధించింది.

ఈ దఫా యూపీ రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పొత్తు పెట్టుకొన్నాయి. ఎస్పీ 37 ఎంపీ సీట్లలో, బీఎస్పీ 38 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది.ఆర్‌ఎల్డీ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది.  

యూపీ రాష్ట్రంలోని మూడు కీలకమైన ఎంపీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీకి గట్టి పట్టున్న ఈ మూడు స్థానాల్లో ఆ పార్టీ ఓటమి పాలు కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. 

మరో వైపు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. సమాజ్‌వాదీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ లేదు.  ఈ మూడు పార్టీలు కూడ కలిసి పోటీ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 22 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది.  ఆ ఎన్నికల సమయంలో బీహార్‌లోని జేడీ(యూ) బీజేపీకి దూరంగా ఉంది. బీహార్‌లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేడీ(యూ) బీజేపీతో పొత్తు పెట్టుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 ఎంపీ సీట్లలో గత ఎన్నికల్లో  బీజేపీ 27 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో ఓటమి పాలైంది. దీంతో ఈ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు పెరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో గత ఎన్నికల్లో  బీజేపీ 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో  బీజేపీ ఓటమి పాలైంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 10 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. ఈ రాష్ట్రంలో 11 ఎంపీ స్థానాలు ఉన్నాయి.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొంది. గతంలో మాదిరిగా ఈ రాష్ట్రం నుండి బీజేపీకి ఎంపీ స్థానాలు దక్కుతాయా అనే చర్చ కూడ లేకపోలేదు.

జార్ఖండ్ రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో గత ఎన్నికల సమయంలో 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. గతంలో కంటే ఎక్కువ స్థానాలు దక్కకపోవచ్చనే చర్చ కూడ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో 28 ఎంపీ స్థానాల్లో  బీజేపీ గతంలో 17 ఎంపీ సీట్లను గెలుచుకొంది. 

10 మాసాల క్రితమే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

కర్ణాటకలో ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలను చేస్తోందని కూటమి నేతలు పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో  జేడీఎస్, కాంగ్రెస్ కూటమి తమ పట్టును పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు.

మహారాష్ట్ర నుండి గత ఎన్నికల్లో  బీజేపీ 23, శివసేన 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఈ రాష్ట్రంలోని  48 ఎంపీ స్థానాల్లో బీజేపీ, సేన కూటమి 41 ఎంపీ స్థానాలను గెలుచుకొన్నాయి.  మరోసారి ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే  ఈ రాష్ట్రంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను దక్కించుకొనేందుకు గాను కాంగ్రెస్, ఎన్సీపీ ప్లాన్ చేస్తున్నాయి. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో టీఎంసీకి 34 ఎంపీ స్థానాలు దక్కాయి. బీజేపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన సీపీఎంకు కూడ రెండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే బెంగాల్ రాష్ట్రంలో ఈ దఫా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే బీజేపీని తమ రాష్ట్రంలో కట్టడి చేసేందుకు టీఎంసీ కూడ పావులు కదుపుతోంది.

కేరళ రాష్ట్రంలో ఈ దఫా ఎక్కువ సీట్లు పొందేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. శబరిమల విషయాన్ని బీజేపీ రాజకీయంగా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్రంలోని లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే.

కేరళ రాష్ట్రంలో మరోసారి ఖాతాను తెరవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల సమయంలో తెలంగాణలో ఒక్కటి, ఏపీ రాష్ట్రంలో బీజేపీకి రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ సమయంలో టీడీపీతో బీజేపీకి పొత్తు ఉంది.

వచ్చే ఎన్నికల్లో  ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ సీట్లు దక్కుతాయా అనేది సందేహాస్పదమేననే చర్చ కూడ లేకపోలేదు.

ఒడిశా రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో బీజేడీకి 20 ఎంపీ సీట్లు దక్కాయి.  బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. అయితే ఈ రాష్ట్రానికి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఒకవేళ ఈ రాష్ట్రం నుండి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కకున్నా బీజేడీ కూడ బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా ఉండే ఫ్రంట్‌లో బీజేడీ కొనసాగుతామని ప్రకటించింది.

అసోం రాష్ట్రంలో గత ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఆ సమయంలో బీజేపీతో ఏజీపీకి మధ్య ఎలాంటి పొత్తులు లేవు. 2016 అసాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, ఏజీపీతో పొత్తులున్నాయి. ఇటీవల కాలంలోనే బీజేపీతో ఏజీపీ పొత్తును తెంచుకొంది. సిటిజన్ షిప్ చట్టం, అసాం ఒప్పందం వంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios