Asianet News TeluguAsianet News Telugu

బండారి రాజ్ కుమార్ కవిత: ఆమెకు తప్పదు

ప్రముఖ కవి బండారి రాజ్ కుమార్ ఆమెకు తప్పదు అని ఓ కవిత రాశారు. తెలుగు సాహిత్యంలో బండారి రాజ్ కుమార్ వివిధ ప్రక్రియలను చేపడుతున్నారు. బండారి రాజ్ కుమార్ కవిత చదవండి.

Telugu Literature: Bandari Raj Kumar Kavitha in Telugu
Author
Hyderabad, First Published Nov 4, 2019, 12:02 PM IST

ఒకలంటె ఒగలకు శెంటెం పడదు
ఇన్నొద్దులు ఎడమొగం పెడమొగమే
తాపతాపకు గిచ్చికయ్యం బెట్టుకోందే పూటగడువదు
అలకలు..బుదగరిచ్చుడు..బతిమాలుడు
అన్నీ షరా మామూలే


ఎప్పుడేం జరుగుతదో
ముందస్తు మతలబేదీ వుండదు కదా!
మతిలేంబడ్డదో బుద్ధి మందగించింది
సడుగు మీద బండి పయ్యలు
సర్రున జారి డొమ్మరిగడ్డలేశింది

భూమ్మీద  నూకలున్నయనో
లేశిన గడియ ఎసుంటిదనో
గాశారం మంచిగున్నదనో
ఎవలకు తోశినట్టు వాళ్లు పలకరిచ్చిన్రు

ఆయువు పట్టున తాకితే 'హరీ'మనేటోడేనని
వింటాంటెనే పానం దస్సుమన్నది
పెండ్లాం పిల్లల మొగం సూద్దునోలేదోనని
గుండె టప్పటప్ప కొట్టుకున్నది
అయ్యవ్వలు కండ్లముంగట గిర్రున తిరిగిన్రు
తోడబుట్టినోల్లు సాయితగాల్లు మతిల మెదిలిన్రు
సావుదప్పి కన్నులొట్టబోయినట్టనిపించింది
బొట్ట బొట్ట కారే నెత్తురుతో తల్కాయబట్టుకున్న
కంటెబొక్క మోకాలిచిప్ప పల్గిన సప్పుడే షెవుల్ల గింగురుమన్నది

నా పెయ్యి మీది గాయాల నెత్తురు
ఆమె కండ్లల్ల ఎప్పుడు జీరగా రూపుగట్టిందో ఏమో
సల్లజెముటలు పుట్టి బేజారుబేజారై
బెదురుసూపుల కండ్లతో ఒళ్లంతా తడిమింది
నా మనసుకు పట్టిన మకిలి
ఆమె చెంపలపై పారుతున్న ప్రేమనదీ ప్రవాహాంలో కొట్టుకుపోయింది

ఉడుకుడుకు బువ్వను గోరుముద్దలుజేసి పెడుతున్నప్పుడు
ముద్ద గొంతుదిగినప్పుడల్లా
ఒక్కో కన్నీటిబొట్టు పశ్చాత్తాపంతో  ఒరిగినట్టున్నది
చెంపలకంటిన తడిని తుడుస్తున్నప్పుడు
ధైర్నం వేలికొసలతో బుగ్గల్ని తడుముతున్నట్టున్నది

ఉన్నఫలంగ ఆమె పొత్తిళ్లలో పసికందునైతిని
ఇప్పుడామెకు ఇద్దరు కొడుకులు
ఆమె నాకు దొరికిన మరో అమ్మ

పక్కమెసిలితే
జరిగిందే పదేపదే కలుక్కుమంటాంది
ఇప్పుడెవలకు తప్పినా
ఆమెకు తప్పదు కదా!!

- బండారి రాజ్ కుమార్ 

Follow Us:
Download App:
  • android
  • ios