Asianet News TeluguAsianet News Telugu

వనపర్తి పద్మావతి తెలుగు కథ: స్మృతి వనం

కో-డైరెక్టర్‌ బిక్షు, కెమెరామెన్‌ అందరు ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు.  కెమెరామెన్‌ తన కెమెరాలోని దృశ్యాలను మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు.   'ప్యాక్‌ అప్‌' అన్న మాటలతో అన్ని సర్దుకుని బయలుదేరుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆయాస పడుతూ వీరి దగ్గరకు వచ్చాడు.

Literary corner: Telugu short story by Vanaparthi Padmavati
Author
Hyderabad, First Published Sep 27, 2019, 11:40 AM IST

సతత హరిత అడవులు పచ్చని చెట్ల పూలతీగల మధ్య వన్యప్రాణుల సందడి ఆహ్లాదంగా వుంది. పెద్ద వృక్షానికి ఒక పెద్ద తొర్ర ఓ గుహలాగా వుంది.  దానిపైన పచ్చని ఆకులతో కూడిన తీగలు మద్య మద్య చిన్నపూలతో ఆల్లుకుని ఉన్నాయి.  ఒక ఏనుగు తనతొండంతో నీటిని తెచ్చి గుహలో చిమ్ముతుంది.  ఆ వెంటనే పక్షులు అన్ని తమ రెక్కలతో ఆ గుహను కప్పేసాయి.  చూస్తుండగానే ఆగుహ నుండి చందమామలో మనకు కన్పించే బామ్మలా పసిపాప లాంటి బోసినవ్వుతో అరవిచ్చిన మొహంతో ఓ బామ్మ బయటికి వచ్చింది.  అలా బామ్మ బయటికి వచ్చిందే తడువుగా కోతిబావ పూలకొమ్మపై చేరి పూల వర్షం కురిపించాడు.  కుందేళ్లు రెండు బామ్మ చీరకుచ్చిళ్ళు సరిచేస్తున్నట్లుగా పాదాల దగ్గర చేరాయి.  రామచిలుక నోటిలో జామపండును తెచ్చి బామ్మకు ఇచ్చింది.  కోతిమామ మరికొన్ని పండ్లను తెచ్చి అమె ముందర పెట్టాడు.  ఓకోకిల గానం మొదలవ్వగానే మరోకోకిల కోరస్‌ ఇస్తున్నట్లుగా పక్షుల కిలకిల రాగాలతో ఉదయిస్తున్న సూర్యుడు కూడ సంబరపడి పోయేలా వుంది ఆప్రాంతమంత పులిరాజు నేనున్నాను అన్నట్లు గర్జిస్తూ బామ్మ చుట్టు తిరుగుతున్నాడు.  జింకలు,  లేళ్ళు ఇంక ఎన్నో వన్యప్రాణుల నడుమ అభినవ శకుంతలలా బామ్మ హాయిగా నవ్వుతూ వుంది.  మైమరచిపోయే దృశ్యాన్నిను కెమెరాలో బంధిస్తున్న డైరెక్టర్‌ అశోక్‌ గారు 'సూపర్‌ సీన్‌. ఓ.కె. కట్‌' అన్నాడు.  

కో-డైరెక్టర్‌ బిక్షు, కెమెరామెన్‌ అందరు ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు.  కెమెరామెన్‌ తన కెమెరాలోని దృశ్యాలను మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు.   'ప్యాక్‌ అప్‌' అన్న మాటలతో అన్ని సర్దుకుని బయలుదేరుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆయాస పడుతూ వీరి దగ్గరకు వచ్చాడు.  ''సారీ సర్‌! మీరు చెప్పినట్లు సీన్‌ నేను ఆరెంజ్‌ చేయలేకపోయానని కోపంతో వెళ్ళిపోతున్నారా సార్‌? కాస్తా సమయం ఇవ్వండి! మావాళ్ళు అరెంజ్‌ చేస్తున్నారు'' అని ఏమెమో చెప్తున్నాడు.  

వాళ్లు చూసిన అద్భుత దృశ్యం కళ్ళముందె వుంది.  ఇదెలా సాద్యం అంటు ఆశ్చర్యపోవడం డైరెక్టర్‌ గారి వంతయింది.  ''నువ్వేమి  బాధపడకు మేము వచ్చిన పని చాలా సక్సెస్‌ అయింది.  ఇంక మేము వెళ్తాం'' అంటు అడుగు ముందుకువేసి వెనుకకు చూశాడు అశోక్‌.  బామ్మ నిర్మలమైన మోముతో రమ్మని పిలుస్తున్నట్లుగా తోచింది. నెమ్మదిగా ఆగుహ వద్దకు వెళ్ళాడు  అక్కడ వన్యప్రాణులు ఏమి అనలేదు.  బామ్మ దగ్గర ఓ చెట్టు కొమ్మపై అశోక్‌ కూర్చున్నాడు.  ''నాయనా! ఎక్కడి నుండి వచ్చావు? ఏమి చేస్తావు?'' అని బామ్మ అడిగింది.  ''సినిమా తీస్తాను, అందుకే హైదరాబాదు నుండి వచ్చాను.'' చెప్పాడు అశోక్‌.  ''ఇప్పటి వరకు మీరు కెమెరాతో తీసింది నాకు చూపండి'' అని అడిగింది.  చూపించారు.  ''దీనిని అందరు చూస్తారా టి.వి.లో?'' అడిగింది.  ''కాదు బామ్మా! ముందు సినిమా థియెటర్‌లో వేస్తారు.  తర్వాత టి.విలో వేస్తారు'' అన్నారు సమాధానంగా. బామ్మ ఎందుకో మౌనంగా దిగాలుగా కూర్చుండి పోయింది.  గమనించిన డైరెక్టర్‌.  కో-డైరెక్టర్‌ను పిల్చి పెన్ను పేపరు తీసుకరమ్మన్నాడు.  బామ్మకు దగ్గరగా జరిగి ''బామ్మా! నీ పేరేంటి? ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఎన్నాళ్ల నుండి వుంటున్నావు పులి లాంటి ప్రాణులు వున్నాయి భయం వేయడం లేదా?'' అంటు ప్రశ్నల వర్షం కురిపించాడు.  బామ్మ నవ్వింది. ఆ నవ్వులో ఆనందము లేదు.

''బామ్మా! బాధపడకు నాచేతనైన సాయం చేస్తాను. మాతో పాటు వస్తావా? హైదరాబాద్‌కు తీసుకపోతాను'' అన్నాడు.  ''రాలేను నాయనా! ఇక్కడి ఈ వన్యప్రాణులు నన్ను కంటికి రెప్పలా చూస్తున్నాయి''  అని నిశ్చింతంగా సమాధానం ఇచ్చింది. ''మరేం కావాలో చెప్పు'' అని అడిగాడు.  ''నువ్వు తీసిన సినిమా టి.విలో చూపించు'' అంది.  ''చాలా రోజుల టైం పడ్తుంది'' అన్నాడు అశోక్‌. పర్వాలేదంది బామ్మ.

''అన్ని సౌకార్యాలూ ఉన్న ఇళ్ళల్లో ఉండటానికి కష్టంగా వుంటుంది. అలాంటిది బామ్మ ఈ అడవిలో ఈ వన్యప్రాణుల మధ్య దట్టమైన అడవిలో ఉండవలసిన అవసరం ఏమిటి?'' అనే చాలా ప్రశ్నలకు జవాబులుగా బామ్మ గతం తెలుసుకోవాలని దాన్నే సినిమాగా తీయలనే ఆలోచన ఏర్పడింది అశోక్‌కి. వెంటనే బామ్మను తన గతం గూర్చి చెప్పమని అడిగారు.  ''నా పేరు సావిత్రి'' అంటూ గత జ్ఞాపకాలలోకి వెళ్ళింది బామ్మ.  

కన్న తల్లిదండ్రులకు లక్ష్మీకటాక్షం కల్పించిన ముద్దుల కూతురు సావిత్రి. అల్లారు ముద్దుగా పెరిగింది.  యుక్తవయస్సు రాగానే సాయన్న అనే ఓ వ్యాపారికి ఇచ్చి వివాహం జరిపించారు.  వారిద్దరూ అన్యోన్యంగా వుండేవారు.  సావిత్రి, సాయన్నల అనురాగానికి గుర్తుగా ఓ అమ్మాయి ఓ అబ్బాయి జన్మించారు.  వారిని వాళ్ల వూరిలోనే అతి గొప్పగా చెప్పుకునేలా పెంచి పెద్ద వారిని చేశారు.  వారుకూడా చదువులోను, ఆటపాటల్లోను చక్కని ప్రతిభను కనపర్చేవారు.  పిల్లలు పెద్దవారయ్యేసరికి ఆస్తి కాస్త తరుగుతూ పోయింది.  ఉన్నంతలో అమ్మాయికి ఘనంగా పెళ్లి చేశారు.  అబ్బాయికి ఉద్యోగాల వేటలో చాలనే ఖర్చు చేశారు.  చివరికి దేవాదాయశాఖలో చిన్న ఉద్యోగం సంపాదించగలిగారు. ఆనోట, ఈనోట ఉద్యోగం వచ్చిన సంగతి ఊర్లో అందరికి తెల్సింది. పిల్లను ఇస్తామంటూ రాయబారాలు మొదలయ్యాయి.  ఓ శుభముహూర్తాన రమణి అనే అమ్మాయితో కుమారుడు రామారావుకు వివాహము జరిపించారు.  

రమణీ పుట్టింటివాళ్లు కాస్త ధనవంతులనే చెప్పుకోవాలి.  లాంఛనాలు, బంగారం అంటూ వాళ్ల అమ్మాయికి బాగానే పెట్టుకున్నారు.  సర్లే ఏది పెట్టినా తన కోడలికే వుంటుంది కదా అని సరిపెట్టుకుంది సావిత్రమ్మ. రామారావుకు ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చింది.  జీతం పెరిగింది.  అంతా రమణి అదృష్టం అనుకున్నారు.  రోజులు నల్లేరు మీది బండిలా సాగుతున్నాయి.  ఉన్నట్లుండి సాయన్నకు అనారోగ్యం చేసింది.  పట్నం తీసుకపోయి వైద్యం చేయించారు.  కానీ లాభం లేకపోయింది.  సావిత్రమ్మ రెక్కలు తెగిన పక్షి అయింది.  

రామారావుకు మొదటి సంతానంగా మగపిల్లవాడు జన్మించాడు.  సామిత్రమ్మ మనస్సుకుదట పడింది.  సాయన్ననే మళ్ళీ తన ఒడిలోకి వచ్చాడని వాడి ఆలనాపాలనా అంత తానై చూసుకోసాగింది.  ఇలా రెండు మూడేళ్లలో మరో పిల్లాడు, ఒక అమ్మాయి పుట్టారు.  క్రమంగా సావిత్రమ్మ స్థానం పిల్లలను చూసుకునే పనిమనిషి స్థాయికి వచ్చింది. ఉదయం ఐదు గంటలకు లేచేది.  ఇంటిపని, వంటపని, పిల్లల బాక్సులు, సాయంత్రం చిరుతిండ్లు, రాత్రి భోజనాలు అన్నీ అయ్యే సరికి రాత్రి ఏ పదకొండు, పన్నెండు గంటలకో నిద్రపోయేది.  

ఓ రోజు నిద్రపట్టక అటూ ఇటూ తిరుగుతూ నీళ్ళు తాగటానికి వంటింటివైపు వెళ్తున్న సావిత్రమ్మకు కొడుకు, కోడలు మాట్లాడుకుంటున్న మాటలు విన్పించాయి.  ''మీ అమ్మ వల్ల నాకు చాల పని లేకుండా పోయింది. చక్కగా వంట చేస్తుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నారు. నాకు విశ్రాంతిగా ఉంది'' అన్న మాటలకు పని మనిషిగా మారిపోయిన తనకు ఒకింత బాధ అన్పించినా, తన వాళ్ళకే కదా చేస్తుందని మనస్సులో సరి పెట్టుకుంది.  

కాలచక్రం గిర్రున తిరుగుతునే వుంది. వయస్సు మీరటం వల్ల కళ్ళు మసకగా అయ్యాయి సావిత్రమ్మకు.  ఒంట్లో సత్తువపోతుంది.  అయిని ఆమెకు విశ్రాంతి లేదు.  మనుమలు, మనుమరాళ్లు పెద్దవాళ్లయ్యారు.   బామ్మ అంటూ వాళ్ళు పిలుస్తుంటే ఆ పిలుపులోనే సేదతీరేది సావిత్రమ్మ.  రామారావుకు తిరుపతికి బదిలీ అయింది.  ఆలయ అధికారిగా కొడుకు ఎదిగాడని, దాంతోనైనా తనకు పని నుండి విముక్తి కల్గుతుందని ఆశపడిన సావిత్రమ్మకు అడియాసే మిగిలింది.  పిల్లల చదువులు హైదరాబాద్‌లోనే సజావుగా సాగుతాయని సావిత్రమ్మను పిల్లలతో పాటు హైదరాబాదులో వదిలి రమణి, రామారావు మాత్రమే తిరుపతికి వెళ్ళారు.  సావిత్రమ్మకు వయోభారంతో పాటు, బాధ్యతలు పెరిగాయి.  ఒకడు ఉదయాన్నే లేస్తూ 'కాఫీ బామ్మా!' అంటాడు రెండవవాడు రోజుకో కొత్త రకం టిఫిన్స్‌ కావాలంటాడు. ఇక అమ్మాయి గూర్చి చెప్పనవసరమే లేదు.  పొద్దుపోయే వరకు లేవదు.  లేచిందంటే చిందులు వేస్తూ తయారై కాలేజీకి వెళ్తుంది.  అందులోనూ ఆనందాన్నే వెతుక్కుంది సావిత్రమ్మ.  సహనంతో లేని ఓపికను తెచ్చుకొని పిల్లల రుచులకు తగినట్టుగా వండి వడ్డించేది.  స్నేహితులంటూ, పార్టీలంటూ స్నేహితులను ఇంటికి తెచ్చుకునేవారు. వాళ్లు చెప్పిన రకరకాల వంటలను రుచిగా చేసి శుచిగా వడ్డించేది.  పిల్లల స్నేహితులు బామ్మ వంట చాలా రుచిగా వుందంటూ తినేవారు.  

రమణి రామారావులు ఇంటికి వచ్చినపుడు పిల్లల బాధ్యత తనకు కష్టంగావుందని, వారికి పెళ్ళిళ్ల  వయస్సు కూడా వచ్చింది కాబట్టి తిరుపతికి తీసుకెళ్ళమని అడిగింది.  దర్జాగా, విలాసవంతంగా జీవిస్తున్న ఆ దంపతులు పిల్లల బాధ్యత బరువుగానూ వారి ప్రైవసీకి ఆటంకంగానూ భావించారు.  ''చూద్దాంలే!'' అంటూ మాట మార్చేశారు.  సావిత్రమ్మ తనకు తప్పని బాధ్యత అనుకుంది.  ఊళ్ళో పేరు పలుకుబడి వున్న కుటుంబం కాబట్టి  మనవరాలికి ఓ మంచి సంబంధం తీసుకరాగలిగింది.  అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చూసుకుంది.  కొడుకు, కోడలు అతిథులుగా వచ్చి పీటలమీద కూర్చుని కన్యాదానం చేశారు.  పెళ్ళికి వచ్చిన వాళ్లందరూ ''తల్లీకూతుళ్ళు ఇద్దరూ అక్కచెల్లెళ్ళుగా వున్నారు'' అంటూ పొగిడారు.  రమణికి గర్వంగా అన్పించింది.  తన అందం పై మక్కువ పెరిగింది.  రామారావు చాల రీలిఫ్‌గా ఫీల్‌ అయ్యాడు.  అమ్మ వుండగా తనకు దిగులు లేదని అనుకున్నాడు.  

కాల చక్రంలో మరో ఐదేళ్ళు గడిచిపోయాయి.  మగపిల్లలకు పెళ్ళిళ్లు చేయాలి అనే ఆలోచన రామారావు ముందు పెట్టింది.  ''నువ్వే చూడమ్మా! ఆలయాభివృద్ధి, భక్తుల రద్దీవల్ల క్షణం తీరిక లేకుండా వుంటున్నాం''  అంటూ భోజనం చేసి పడుకున్నాడు.  ఆరోజు రాత్రి కొడుకు, కోడలు గదిలో నుండి ఏవో మాటలు వినపడ్తున్నాయి.  కాని వినికిడి లోపం వల్ల పూర్తిగా అర్థం కాలేదు సావిత్రమ్మకు.  

సావిత్రమ్మ మనుమలిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి.  ఒకరికి బెంగుళూరులో, మరొకరికి మద్రాసులో.  బామ్మ ఆనందానికి అవధుల్లేవు.  ఇన్నాళ్ళకు తన కొడుకు దగ్గరకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాననుకుంది సంబరంగా. సావిత్రమ్మ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇద్దరు మనుమలకు ఘనంగా రామారావు ¬దాకు తగ్గట్టుగా ధూంధాంగా వివాహం జరిపించారు.  దాదాపు వారం రోజులపాటు ఇళ్ళంతా బంధువుల సందడితో కళకళలాడింది.  పెళ్లి పనులన్నీ తానే స్వయంగా చేసింది బామ్మ.  వివాహ వేడుకలు అంబరాన్నంటినట్లు సాగాయి.  మనుమలిద్దరూ వారివారి అర్ధాంగులతో ఉద్యోగం చేస్తున్న ప్రాంతాలకు తరలి వెళ్ళారు.  ఇల్లంతా శున్యంగా తోచింది.  రమణి రామరావులు సిటీలోనే వున్నారు.  ''పిల్లల పెళ్ళిళ్లయ్యాయి.  కాబట్టి ఇక్కడ మనకు ఇల్లు అవసరం లేదు. పొలం, ఇల్లు అమ్మివేద్దాం. అమ్మను మనతోపాటు తిరుపతి తీసుకవెళ్దాం'' అనే ఆలోచన భార్యతో పంచుకున్నాడు రామారావు.  రమణి కూడా తనకు పని చేసే బాధవుండదని, ఆవిడే అన్ని చేస్తుందనే ఆలోచనతో ఒప్పుకుంది.  ఓ వారం రోజులు తర్వాత ఇల్లు, పొలం అన్ని అమ్మేసి  డబ్బును బ్యాంకులో జమచేసుకుని బామ్మతో పాటు తిరుపతి బయలుదేరారు.  

ప్రయాణం చేస్తున్నంత సేపు సావిత్రమ్మ ఒకటే కలలు కనటం మొదలుపెట్టింది.  కొడుకు ఆనందంగా వున్నట్టు కోడలు తనని అమ్మలా చూసుకుంటున్నట్టు, టైముకు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నట్టు.  అవే ఊహలతో కొడుకు ఇంట్లో కాలు మోపింది ఆ పిచ్చి తల్లి.  ఇంటికి చేరుకునేసరికి బాగా రాత్రి కావడంతో ఊరినుండి తెచ్చిన భోజనాన్నే అందరు తిని పడుకున్నారు.  

తెల్లవారింది. 'తనకో కొత్త ఉదయం' అనుకుంటూ లేచింది సావిత్రమ్మ.  కాఫీ కప్పుతో ఎదురుగా కొడుకు వుంటాడు అనుకుంది.  కాని పనిమనిషి కాఫీ తెచ్చిఇచ్చింది.  స్నానం చేసి టిఫిన్‌ తిని వరండాలో నిలబడి బయటికి చూస్తూ చల్లని గాలి వీస్తుండగా మనస్సుకు హాయిగా వుంది. ఇన్నాళ్ల తన శ్రమ అంతా పోయి ఎదో కొత్తశక్తి వచ్చినట్లుగా మనస్సు, శరీరం తేలికగా వుంది. ఊహించినంత సేపుకూడ ఆమెకు ఆ ఆనందం నిల్వలేదు.  'అత్తయ్యా' అంటు రమణీ పిలుపు 'ఏమిటి?' అన్నట్టుగా చూసింది.  ''మీ అబ్బాయికి మీ చేతివంట అంటే ఇష్టం కదా. వంట పని చూడండి'' అని పని పూరమాయించింది.  అవును రామారావుకు తల్లిచేసిన పులి¬ర, పాయసం అంటే చాలా ఇష్టం అనుకుంటు వంటిఇంట్లోకి వెళ్ళి పాయసం, పులి¬రతో పాటు ముద్దపప్పు, గుత్తివంకాయ కూరలు చేసింది.  ఇలా ప్రతిరోజు చేస్తూ వంటమనిషి అయింది.  సావిత్రమ్మకు  కొన్నాళ్ళకు పనిమనిషి కనపడ లేదు.  ఆపనులు కూడా బామ్మపైనే పడ్డాయి.  రమణి మాత్రం భర్త ¬దాకు తగ్గట్టు చక్కగా మేకప్‌ వేసుకుని లేడిస్‌ క్లబ్‌కు పోవడం, మిగతా ఆడవాళ్ళు ఇంటికి రావడం పరిపాటి అయ్యింది.  

ఓ రోజు లేడిస్‌క్లబ్‌ వాళ్లకు భోజనాలు ఏర్పాటుచేసింది రమణి. వంటలన్నీ సావిత్రమ్మ చేసింది.  వయస్సు ప్రభావం వల్ల దగ్గుమొదలైంది.  అయినప్పటికి తమాయించుకొని అన్ని పదార్థాలను వచ్చిన వారికి దగ్గరుండి వడ్డించింది. అందరు తృప్తిగా 'చాలా బాగున్నాయి' అంటూ కడుపునిండా తిన్నారు.  చేతులు కడుక్కుని హాల్లో కూర్చున్నారు.  వాళ్లకు పండ్ల ముక్కలు చేసి చిన్న గిన్నెల్లోపెట్టి ట్రేలో తీసుకపోయి అందరికి అందించి వస్తున్న టైంలో వంటగదిలో కళ్లు తిరిగి పడిపోయింది.  పని వత్తిడితో పాటు భోజనం కూడ సరిగ్గా చేయలేకపోవడం, వయస్సుతో వచ్చిన నీరసం కారణాలయ్యాయి.  కిందపడ్డ శబ్దం విన్న స్నేహితులు లేవబోయారు ''ఎవో గిన్నెలు పడిపోయాయి'' అంటూ రమణి వారిని వారించింది.  

సావిత్రమ్మ సాయంత్రము వరకు అలాగే వంటగదిలో పడిపోయి ఉంది.  చూసిన వాళ్లు కాని పలకరించినవాళ్లు కాని లేరు.  రాత్రి సమయంలో మెలకువ వచ్చి గ్లాసునీళ్ళు తాగి అక్కడే పడుకుంది.  ఒళ్ళంతా వణుకు. జ్వరంతో కాలిపోతుంది.  హాల్లో నుండి రామారావు ''అమ్మా కాఫీ'' అంటూ కేకలేస్తున్నాడు.    లేచే ఓపిక లేదు.  బదులు పలకటానికి గొంతు సహకరించటం లేదు.  మౌనంగా రోదించసాగింది. సమాధానం రాకపోయే సరికి రామారావు వంటగదివైపు నాల్గు అడుగులు వేశాడు.  అచేతనంగా పడివున్న తల్లిని చూసి అమాంతంగా లేపి తీసుకవెళ్ళి మంచంపై పడుకోబెట్టి డాక్టరుకు ఫోన్‌ చేశాడు.  

డాక్టర్‌ వచ్చి సావిత్రమ్మను పరీక్ష చేశాడు.  ''ఈమె గుండె చాలా వీక్‌గా వుంది.  ఏలాంటి ఆందోళన, వత్తిడి లేకుండా మంచి ఆహారం ఇవ్వండి'' అంటూ కొన్ని మందులు రాసిచ్చి వెళ్ళాడు.  రామారావు మందులు తెచ్చి, తల్లికి ఇచ్చాడు.  రమణీ పండ్లరసాలు ఇచ్చి రెండు రోజుల సేవలు చేసింది. అప్పటికే ఇంటి పనితో పాటు సావిత్రమ్మను చూసుకునే సరికి ఓపిక పోయినట్లుయింది.  మేకప్‌ సరిగ్గాచేసుకో లేకపోతున్నాననే  భావం మొదలైంది.  రాత్రి రామారావు ఇంటికి వచ్చేసరికి ముభావంగా వుంది. విషయం తెలుసుకున్న రామారావు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.  కాని రమణి భర్త మాటవినలేదు.  ''నాకు నా ఆరోగ్యం ముఖ్యం కానీ మీ తల్లిగారి ఆరోగ్యం ముఖ్యం కాదు''.  అని నిక్కచ్చిగా చెప్పింది.  ''ఆమెకు వయస్సు అయిపోయింది'' అనే ధోరణిలో వాదన మొదలైంది.  

ఓ రోజు ఉదయాన్నే లేచి రామారావు తల్లిదగ్గరికి వచ్చి ''అమ్మా! నీ ఆరోగ్యం బాగుండాలని దేవున్ని మొక్కుకుందువు. గుడికి వెళ్దాం! రెడీగా వుండు'' అంటూ పట్టుచీర తెచ్చిచ్చాడు.  కొడుకు అభిమానానికి పొంగిపోయిన ఆ తల్లి అంత అనారోగ్యంలోనూ లేచి తయారైంది.  పవిటభుజాలచుట్టు నిండుగా కప్పుకొని నుదట అంజనేయస్వామి తిలకం సన్నగా పొడవుగా ధరించింది.  అనుకున్నట్టుగానే అందరు రెడీ అయి ఏ.సి. కారులో వెళ్లారు.  స్వామి దర్శనం చేసుకున్నారు.  మిగిలిన ఆకాశగంగ, పాపనాశనం, ఇంకా దేవాలయ పూలతోటలు, పల్లకిసేవ ఏర్పాటు అన్ని చూపించాడు రామారావు.  తిరిగికారులో ప్రయాణం చేస్తూ అరణ్య ప్రాంతానికి వచ్చారు.  కారును దూరంగా నిలిపేశారు.  ''మనం అందరం ఈ రాత్రకి ఇక్కడే నిద్రచేయాలి.  ఎందుకంటే ఈ అడవిలో చాల రకాల మూలికావైద్యానికి సంబంధించిన చెట్లు, పూలతీగలు ఉన్నాయి.''  అంటూ ఆకులు దట్టంగా పడివున్న ప్రదేశంలో దుప్పట్లుపర్చుకొని అందరూ పడుకున్నారు.  కొడుకు, కోడలు చూపిస్తున్న శ్రద్ధకు చాలా సంతోషంగా సావిత్రమ్మ ప్రశాంతమైన వాతవరణంలో చల్లని గాలికి హాయిగా నిద్రపోయింది.  

భళ్ళునతెల్లవారింది.  చుట్టూ చెట్లు తలలూపుతూ వాటిలో అవే గుసగుసలాడుతున్నట్లుగా ముందుకు వెనుకకు ఊగుతున్నాయి.  అంతా నిర్మానుష్యంగా వుంది.  మనుషుల జాడలేదు. ఎండిన ఆకుల గలగల చప్పుడు విన్పిస్తుంది.  బిక్కుబిక్కు మంటు దిక్కులు చూడసాగింది.  తనవాళ్లు ఎవరైన వస్తారేమో అని.  కాని వాళ్లు రాత్రే సావిత్రమ్మను వదిలివెళ్ళి పోయారని తెలుసుకోవటానికి, ఆవిషయం జీర్ణం చేసుకోవడానికి కొన్ని రోజులే పట్టింది.  సావిత్రమ్మ చెట్లమధ్యకు వెళ్ళి రాలిన పండ్లను తింటూ, చిన్నకొలను లాంటి దాంట్లో నీళ్ళు ఉండగా వాటిని తాగుతూ కాలం గడపసాగింది.  

క్రమం క్రమంగా అడవి వాతావారణానికి ఆలవాటుపడ్తున్న తరుణంలో కుందేళ్ళు రావటం,   నెమళ్లు, రామచిలుకలు, కోతులు, కోకిలల గానంతో నేస్తం చేయసాగింది.  వాటికి తనచేత్తో ఆహారం తినిపించేది.  ఓ రోజు పులిరాజుకి గాయం అయి రక్తం కారుతుండగా తన చీరచింగుతో ఆకుల పసరు కలిపి కట్టు వేసింది.  దాంతో పులిరాజు కూడా మంచి నేస్తం అయి తన గుహముందు పడుకునేది, ఏనుగుతో సహా అన్ని వన జీవులు నేస్తాలుగా మారిపోయాయి సావిత్రమ్మకు. మంచికుటుంబమే దొరికింది.  జనాల మధ్యలేని భద్రత అడవిలో వన్యప్రాణుల మధ్య లభించింది.  తన అదృష్టానికి తానే సంబరపడిపోయింది.  

ఈ కథ వింటున్న డైరెక్టర్‌, కో-డైరెక్టర్‌, కెమెరామెన్‌ మిగిలిన సిబ్బంది కళ్ల వెంట నీళ్లు కారుతూనే వున్నాయి.  నోరున్న మనుష్యులకు మనస్సు లేకుండ పోయింది.  నోరులేని మూగజీవాలకు విశాలమైన మనస్సు ఉంది.  ''ఒక నిముషం బాబూ!'' అంటూ బామ్మ తనగుహలోకి వెళ్ళి తనకొడుకు ఫోటో తీసుకవచ్చింది. ''మీ సినిమాలో ఈఫోటో చూపండి'' అంటూ ఇచ్చింది.  బామ్మ దగ్గర సెలవు తీసుకొని సిటీబాట పట్టారు అందరు.  

'స్మృతివనం'  అనే టైటిల్‌తో సినిమా రీలిజ్‌ అయింది.  హాల్లో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు.  టికెట్స్‌ వారంరోజుల ముందే బుక్‌ అవుతున్నాయి.  అదే సమయంలో అడవిలో నక్సలైట్లు తలదాచుకున్నారనే అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు.  బామ్మ వున్న అడవిలో కాల్పులు మొదలయ్యాయి.  వన్యప్రాణులన్నీ చెల్లాచెదురుగా పరుగెడుతున్నాయి.  చిన్న ప్రాణులు భయంతో ఎక్కడివి అక్కడే పొదల మాటున చేరిపోయాయి.  పక్షులు రెక్కలను కప్పుకొని కొమ్మల మధ్య నక్కి చూస్తున్నాయి.  ఇంతలో ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ అటూ, ఇటూ పరుగెడుతోంది. బామ్మ గబగబ వెళ్ళి ఏనుగును కాపాడేందుకు అడ్డంపోయింది.  పోలీసులు నిర్దాక్షిణ్యంగా వదిలిన బుల్లెట్‌ బామ్మ గుండెలో దూసుకుపోయి అక్కడిక్కడే ప్రాణాలను వదిలింది.  వన్యప్రాణులన్నీ ఒక్కటిగా చేరి ఆకులు, పూలను బామ్మమృతదేహంపై కప్పి, చుట్టుతిరుగుతూ మౌనం పాటిస్తున్నాయి.  

బామ్మ కోరిక మేరకు ఆ సినిమాను టి.విలో కూడా ప్రసారం చేయించాడు దర్శకుడు అశోక్‌.  సావిత్రమ్మ మనవరాలు ఆ సినిమాలోని తనబామ్మను తన తండ్రి ఫోటోను చూసి వెంటనే తన తండ్రికి ఫోన్‌ చేసింది.  వెంటనే తన ఆఫీస్‌ రూంలోనే సినిమాను చూసిన రామారావుకు తాను చేసిన తప్పు తెలిసొచ్చింది.  తన తల్లిని ఏ అడవి జంతువో చంపితినేసి వుంటుందని అనుకున్నాడు కానీ ఆ మూగజీవాలే తనతల్లికి ప్రాణం పోస్తున్నాయని  తెలుసుకున్నాడు.  ఈనాటి తన ఉన్నత స్థితికి కారణం ఆతల్లే అన్న విషయం మర్చిపోయి అసమర్థుడిలా భార్యమాటలు విని తల్లిని దూరం చేసుకున్న తనలాంటి దుస్థితి ఎవరికి రాకూడదని కళ్ల నీళ్లతో తల్లిని వెదుక్కుంటూ బయలుదేరారు.  టి.వి.లో సినిమా చివర ఓ వాక్యం వస్తుంది.  ''మిమ్మల్ని కన్న వారిని మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు మీ పరిస్థితి ఎలాగో ఆలోచించండి.'' అని.  

రామారావు కుటుంబంలోని అందరూ అడవికి చేరుకున్నారు.  అప్పటికే గుంపుగా వున్న మూగజీవులను చూచి వడివడిగా దగ్గరకు చేరుకున్నారు.  వన్యప్రాణులన్నీ కన్నీటితో దారిచూపాయి.  బామ్మ మృతదేహం పూలతోకప్పబడి ఉంది. ఆ మృతదేహాన్ని తీసుకొని ఊరేగింపుగా వెళ్తుంటే ఆమూగజీవులు కూడా అరణ్యం చివరివరకు సాగనంపాయి.  ఎందుకంటే జనారణ్యంలో తాము బ్రతకలేమని వాటికి తెలుసు.  రామారావు జరగవల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. 

ఆనాటి నుండి ప్రతిఒక్కరికి ''అమ్మానాన్నలే దైవస్వరూపులు.  వాళ్లను నిర్లక్ష్యం చేయకండి.  వాళ్లు  మనకోసం ఎన్నో త్యాగం చేస్తారు.  వాళ్ల చివరి మజిలీ శాపం కాకూడదు'' అంటూ బోధిస్తున్నాడు.  వీలైౖనపుడల్లా  దంపతులకు కౌన్సిలింగ్‌ క్లాస్స్‌లు నిర్వహిస్తూ తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే వున్నాడు రామారావు.  

Literary corner: Telugu short story by Vanaparthi PadmavatiLiterary corner: Telugu short story by Vanaparthi Padmavati

- వనపర్తి పద్మావతి

Follow Us:
Download App:
  • android
  • ios