Asianet News TeluguAsianet News Telugu

ఆప్యాయతల పాశబువ్వ ఈ "బంతిబువ్వ"

వడ్లకొండ దయాకర్ రాసిన బంతి బువ్వ కవిత్వంపై బండారి రాజ్ కుమార్ రివ్యూ రాశారు. బాపు లేని లోటును  "కవిత్వం" తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడివుంటది అని అంటున్నాడు.

Bandari Raj Kumar reviews Vadlakonda Dayakar poetry Banthi Buvva
Author
Hyderabad, First Published Oct 30, 2019, 12:58 PM IST

రాన్రి నపరింత కలిసి పంచుకుందాం

"తను ఆకాశానికి
ఎగబాకినందుకేమో...
కల్లుకు అన్ని పొంగులు

తను కత్తితో
మెత్తగా ముద్దాడినందుకేమో
కల్లుకు అన్ని సొబగులు

తన చెమటగంధం
చిలకరించినందుకేమో...
కల్లుకు అన్ని రుసులు"

పై మూడు కవితాపాదాలు  మనమిప్పుడు మాట్లాడుకోబోయే కవి సామాజిక వర్గాన్ని పట్టిస్తుంది.చిన్నప్పుడే దూరమైన "బాపు-వడ్లకొండ చంద్రయ్య"ను యాజ్జేసుకుంటూ పలుకుబడి కవి"వడ్లకొండ దయాకర్ "తన తొల్సూరు బిడ్డసొంటి కైతల వయ్యి "బంతి బువ్వ"ను బాపుకే అంకితమిచ్చిండు.

"బాపు గురించి
నేనెవలతో మాట్లాడ
ఒక్క కవిత్వంతో తప్ప"

అని బాపు యాదిలో కవిత సురువైతది.సూత్తానికి అల్కగ కనిపించే బరువైన పదాలు.పాయిరంగ సూసుకునే బాపు పాడెక్కినపుడు ఒంటరితనం పంచిన దుక్కం,ఎడబాటు గొంతులో జీరగా తట్టుకుంటనే వుంటయి.

"యిప్పటికీ ఎక్కడన్న
కాటమయ్య యిగ్రం కానొత్తె
బాపును అండ్లనే సూసుకుంట"
తెలంగాణల నాన్నను నాయిన,బాపు అని పిలుత్తరు.పోయినోళ్లను యాజ్జేసుకుంటాంటె గుండె తడైతాంటది.గావురంగ గుండెల మీన ఆడిచ్చిన బాపు గదా...ఎప్పటికీ కండ్లల్ల మెదులుతనే వుంటడు.

Also Read: ముగింపులేని వాక్యం"గా కొనసాగుతున్న కాసుల రవికుమార్ కవిత్వం

వడ్లకొండ దయాకర్ బహుశా అప్పుడే కవై వుంటడు.బాపు లేని లోటును  "కవిత్వం" తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడివుంటది.కవి హృదయం సున్నితం.మా దయాకరన్న మరీ సున్నితం.కవి గాకుంటె ఎట్ల ? సహజంగానే కవి అయిండు.ఊరి భాషలోనే కవిత్వం రాత్తాండు.పలుకుబడులు,నుడికారాలకు కొత్త వ్యాకరణం అందిత్తాండు.సుతిమెత్తని మనసులే తొందరగా గాయపడుతై.దయాకరన్న అందుకు అతీతుడు కాదు.పైగా సందర్భం "తెలంగాణ ఉద్యమం".ఇగ జూస్కో..ఎట్లుంటదో!

"యాదుంచుకో..కొడుకా"అని ధిక్కార స్వరాన్ని వినిపించిండు.

"వారీ...ఒక్కటి తెల్సుకో
ఈ న్యాలకు ఉరేసుకునుడే కాదు
ఉరేసుడూ తెల్సు
తగలబెట్టుకునుడే కాదు
తగలబెట్టడం ఎర్కే
కాల్సుకోవడమే కాదు
కూల్చడమూ దెల్సు
జర యాదుంచుకో..కొడుకా"

2008 లో కూనూరు రవికిరణ్ గారి సంపాదకత్వంలో వచ్చిన "చైతన్య కిరణాలు" కవితా సంకలనంలోని "ఇ(ఎ)ంగిలీసు పండుగ" దయాకరన్న తొలి అచ్చైన కవిత.ఆంగ్ల సంవత్సరాది ఆగమనాన్ని వ్యంగ్యంగా వ్యక్తీకరించిన తీరు ఆకట్టుకుంటది.
"తెలుగుదనం కరువై
తెలుగు పదం శూన్యమైన
పరాయి సంస్కృతిని
పల్లకిలో మోస్తూ
అహోం అహోం హో
అహోం అహోం హో
శబ్ధనినాదాల మధ్య
మంచుదుప్పటిని
చీల్చుకొచ్చింది
HAPPY NEW YEAR"

బంతిపువ్వు తెలుసు గని గు బంతిబువ్వ ఏంది ? అని అడిగిన వాళ్లున్నరు ? బంతి అంటే వరుస. సామూహిక భోజనాలు అని అర్ధం. వరుసలో కూర్చుని  అందరు కల్సి చిన్నా పెద్దా తేడా తెల్వకుండ భోజనం చేయడం.ఇది తెలంగాణ పల్లెల్లోని ప్రతీ సంబురాన్ని..సంతోషాన్ని...విషాధాల్ని సుత బంతిబువ్వతో పంచుకుంటరు.ఇది ఎప్పుడు ఎక్కడ మొదలయిందో తెల్వదుగని పల్నాటి బ్రహ్మనాయుడు "చాపకూడు" అనే పద్ధతిని ఉద్యమంగా ప్రారంభించి ,కొనసాగించినట్లు చరిత్ర చెబుతోంది.కుల ప్రస్తావన లేకుండా అందరూ సమానమనే భావన పెంపొందించాలని చేసిన ప్రయత్నం విజయవంతమైందనే ఆధారాలు ఉన్నాయి."బంతిబువ్వ" కవితలో  పల్లెల్లో బంతిలో కూసున్నంక జరిగే తంతును మన కండ్ల ముందుంచిండు.

"కులమంతగూడి
ఆత్మీయంగా అల్లుకుని
కట్టసుఖం మాట్లాడుకునే తావు"
అని "బంతిబువ్వ"ను సూత్రీకరించిండు.ఈ కవితా పాదాలతోటే కవిత ప్రారంభమౌతుంది.పల్లెల్లో జరుగుతున్నదిదే.కుల కట్టుబాట్లను తెంచుకుని వసుధైక కుటుంబ భావనతో  ఎటువంటి కలహాలు లేకుండా "బంతిబువ్వ"తినే సంప్రదాయం రావాలని  కవి ఆశించివుంటే  మంచి ముగింపు అయ్యేదేమో ! అనిపించింది.

"వర్సైనోల్లు పరాష్కమాడి
మారర్సుకుంటాంటే
ఏం జెప్పాలే...
పాయిరానికే కడ్పునిండుతది
యిత్తారాకుల పుల్ల
గొంతులిర్కి సరంబడ్తె
నాల్గుజేతులు నెత్తిసర్శి నీళ్లందిత్తె
నలభై గొంతులు సరాయిస్తై

యిత్తారి మల్సి
శెయ్యి కడుగుతాంటే
పభోజనం మల్లెప్పుడొత్తదోనని
పానం తండ్లాడుతది."

ఊరు ఉన్నదంటే ,అది బాగున్నదంటె ఆ ఊరి సెరువు సలువే.జానపద వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న చెరువుపై సక్కని పాటనల్లిండు.
"సెరువోయ్ మా ఊరి సెరువు
ఊరి బరువునంత మోసే ఏకైక ఆదెరువు
సెరీవోయ్ మా ఊరు సెరువు " 

గోరేటి వెంకన్నను అమితంగా ఇష్టపడే దయాకరన్న "కల్లెడ చెరువు" కవితనల్లిండు.

Also Raed: ఖుల్లం ఖుల్లా"గా కవిత్వమవడం అతని నైజం.

"ఆయిటి పూనంగ
మొగులు మురువంగ
వానల తానమాడంగ
ఊరగుట్టపై దున్కిన జలపాతం
వాగులై పారంగ
బంటాలు నిండంగ
సుట్టకుదురుపై కొలువైన
నిండుకుండ నా చెరువు

ఇలా సాగుతూ..

సద్దుల బతుకమ్మను సాగనంపేయాళ్ల
కొప్పున తామెరలు ముడ్సుకున్న
నిండు ముత్తైద నా చెరువు "అని ముగిస్తడు.

1)సుట్టకుదురుపై కొలువైన నిండుకుండ
2)కొప్పున తామెరలు ముడ్సుకున్న నిండు ముత్తైద
3)అలుగుపారంగ ఉబికిన పాలధార
4)తూములు తెర్వంగ ఉరికే కోడెతాసు
5)తీరొక్క పచ్చుల తీర్థయాత్ర
6)గుమ్మిలగాసం...కంచుట్ల బువ్వ...గోళెంల నీళ్లు

దయాకరన్న చెరువును వర్ణించడానికి తీసుకున్న పలుకుబడులు.తెలంగాణ నుడికారంతో రాస్తున్న అచ్చమైన పల్లె కవి.పల్లె పలుకుబడి సంపదను ఒడుపుగ కవితావస్త్రాలు నేస్తున్న నేతగాడు.పదం దొరికితే మూలాలు వెతుక్కుంటఎల్లి కవితనల్లగల ఘనాపాటి.జ్ఞాపకాలు..అనుభూతులు...అనుభవాలు....తనదైన సొంత గొంతుక...ఒదిగిపోయే పల్లె భాషాసౌందర్యం వడ్లకొండ దయాకర్ కవిత్వానికి బలం.

"అరుగు"పై రాసిన కవితల్ని పరిశీలిస్తే వరంగల్ కే చెందిన మరో కవిమిత్రుడు బిల్లా మహేందర్ కవితను ప్రస్తావించాలి.దయాకర్ ,మహేందర్ తీసుకున్న అంశం ఒకటే అయినా ఎత్తుగడ,కొనసాగింపు,ముగింపులో ఎవరి శైలి వారిది.ఎవరి భాష వారిది. 

Also Read: శ్రీరామోజు హరగోపాల్ కవిత: సంజీవి.
ఎత్తుగడ
~~~

1)"ఉన్నదో లేనిదో
ఇంత కడుపులేసుకున్నంక
దండం మీది తువ్వాలను తీస్కొని
తడ్చిన చేతులను పెదవులను తూడ్చుకుంటూ తువ్వాలను భుజం మీద వేస్కొని
అరుగు మీద కూర్చునేటోళ్ళం" 
             (బిల్లా మహేందర్ )

2)"ఎన్నీల రాత్రిల
నా సోపతిగాండ్లకు
మా యింటి ముందు అరుగే 
పరిశిన మంచం"
         (వడ్లకొండ దయాకర్ )

కొనసాగింపు
~~~

1)

"దూరం నుండి
చుట్టాలు దోస్తులు గిట్లొస్తే
చెంబుతో కాళ్ళకు నీల్లందించినంక
కాళ్ళు కడుక్కుని కాసేపు అరుగు మీదనే కూర్చునేటోళ్ళు
మంచి చెడుల ఇచారణ చేస్కుంటూ
తనివితీరా ముచ్చటబెట్టుకునేటోళ్ళు

అరుగు రోజూ
ఎన్ని ముచ్చట్లినేదో
ఎన్ని బతుకులను జూసేదో
ఎన్ని జీవితాల్ని చదువేదో..

మన కష్టాలు..నష్టాలు
సుఖాలు..దు:ఖాలు
ఒక్కటేమిటి..?
మన బతుకుల సారంశమంతా
ఒక్కొక్కటిగా విడమర్చి చెబుతుండేది"
         (బిల్లా మహేందర్ )

2)

"అరుగు మీద మాతాత
బెత్తం పట్టని పంతులై
సెలబస్ ల లేని ముచ్చట్లెన్ని శెప్పిండో

అరుగుపై ఎన్ని కథలిన్నమో
ఎన్ని పొడుపుకథలిప్పినమో
ఎన్ని పాటలల్లినమో
ఎన్ని పద్యాలు నేర్శినమో
అరుగుది ఒడ్వని ముచ్చట"

(వడ్లకొండ దయాకర్ )

అరుగు మన అమ్మ,అరుగు మన తోబుట్టువు అని బిల్లా మహేందర్ అంటే...

అరుగే పరిశిన మంచం,అరుగు అమ్మ ఒడి,అలకపాన్పు,రచ్చబండ అని  దయాకర్ అంటడు

ముగింపు
~~~

1)

"ఇప్పుడు
కూర్చుందామంటే అరుగుల్లేవు
మనసారా ముచ్చటిద్దామంటే  
ఆ పలకరింపుల జాడే కనబడుతలేదు!!"

 -బిల్ల మహేందర్ 

2)
అరుగు ముసలిదై
ఒక్కో బెచ్చూడి
ఆఖరికి అరుగు కనుమరుగైంది
        (వడ్లకొండ దయాకర్ )

"అరుగు" కవితలో దాదాపుగా ఇద్దరి దృష్టికోణం  ఇక్కడిదన్క ఒక్కతీరుగనే నడిచింది.
మహేందర్ అరుగు గురించి ముందుగ రాశిండు.ఆ తర్వాత దయాకర్ రాశిండు.
దయాకర్ సుత మహేందర్ కవిత సదివే వుంటడు.ఇక్కడితోనే దయాకర్ కవితను ముగిస్తే అందులోనూ  మహేందరే కనిపించేటోడు.సరిగ్గా ఇక్కన్నే ...ముగింపు అనుకునే కాడ కవిత ఓ..మలుపు తిరుగుతది.అరుగు కనుమరుగవడానికి కారణాలు వెదుక్కుంటాడు.ఇక్కన్నే కవిగా దయాకర్ నిలబడతాడు.ఇద్దరి కవుల కలవరింతలు ఒకటే.ఒక అడుగు ముందుకేసి వర్తమానాన్ని నిలేసిండంతే.

"ఆటలు,పాటలు,కథలు కంచికొయ్యి
ఇప్పుడింటింటికో..
రం(కు)గుల టీవొచ్చింది

ఒడువని ముచ్చట్లు మింగేసి
ఒంటిమీది బట్టలెక్క
మనిషికో సెల్ ఫోనోచ్చింది

ఇప్పుడాటల్లేవ్ ..పాటల్లేవ్ ..
సుద్దుల్లేవ్ ..బుద్దుల్లేవ్ ..
గిప్పుడంత..
ఏత్తె రూపాయ్ ..తీత్తె రూపాయ్ 

రూపాయ్ ఆశించని
యిసుమంత సార్ధంలేని
మనసున్న  అరుగు
మళ్లీ వత్తె ఎంత మంచిగుండు "

వడ్లకొండ దయాకర్ కవిత్వంలో  వస్తు విస్తృతి,విస్తృత అధ్యయనం ప్రస్ఫుటంగ కనిపిస్తాయి.ఒక వస్తువును ఎన్నుకుని దాని మూలాలనుంచి ప్రారంభించి,అన్ని కోణాలలో వస్తువును దర్శించడం ఈ కవిత్వంలో చూడవచ్చు.వస్తువును విశ్లేషించుకుంటూ సుదీర్ఘంగా కవిత కొనసాగుతుంది.కొనసాగింపు దానంతటదే ముగింపును నిర్ధేశించుకుంటది.దయాకర్ కంటే ముందు ఇలా చాలా మంది కవిత్వం రాసినప్పటికీ అందులో కె.శివారెడ్డి,శిఖామణి మనకు ముందు వరుసలో తారసపడుతరు.అయితే తెలంగాణ నుడికారంతో కవితాత్మను పలికించడమే దయాకర్ కవితాగుణం.అలాంటి కోవలోకి చెందినదే "యాపసెట్టు" కవిత.

 మహాభారతంలో,వేమన పద్యాల్లో సుత వేపచెట్టు ప్రస్తావన ఉంది.మన తాతలు పొద్దటిపూట యాపశెట్టు కింద పడుకుంటే కమ్మగ కన్నంటుకుంటదని చెప్పేటోల్లు.శాస్త్రీయంగా పరిశీలిస్తే ఆక్సీజన్ ఎక్కువ మోతాదులో అందించే వృక్షంగా పేర్కొంటారు.

"ముష్టి వేషచెట్టు మొదలంట ప్రజలకు
బరగ మూలికలకు బనికి వచ్చు
నిర్ణయాత్మకుండు నీచుడెందులకౌను
విశ్వదాభిరామ వినురవేమ"

ఎంతో చేదు వృక్షాలైన వేప ,ముషిణి చెట్లు మందుల తయారీలో వుపయోగపడుతయి.కాని క్రూరాత్ముడైన మనిషి ఎవరికి ఉపయోగపడుతడని వేమన్న ఎన్నడో ప్రశ్నించిండు.ఆ పరంపరలో దయాకర్  యాపచెట్టును యాజ్జేసుకుంటాండు.

"బతుకడమే దాని కులం
బతికించడమే దాని మతం"అని జీవన తాత్వికతను విప్పిజెప్తాండు.

పల్లె నుంచి పట్నానికి ,ఆపై దుబాయి,మస్కట్ ,గల్ఫ్ పేరేదైతేనేం తెలంగాణ వలస బతుకును "ఆకలి పయనాలు"గా కైగట్టిండు.

"తనువే వాళ్లది
మన్సు ఎవని గళ్ల పెట్టెల్నో..
కుదువబడ్డది" 
అని రంది పడుతడు.

"నేను శిల్లర పైసను"అనే కవిత గమ్మతిగుంటది. ఈ కవిత సదువుతున్నప్పుడు మరో వరంగల్ కవి  "అన్వర్ "రాసిన "తలవంచని అరణ్యం" లోని "డబ్బు ముఖాలు" అనే కవిత యాదికొచ్చింది. మనిషికి మనిషికి మాటల్లేకుండ,మట్టి వాసన లేకుండ,ఏనిమేషన్ బొమ్మల్లా ,వింత జంతువుల్లా డబ్బు చుట్టే తిరిగే మనుషులను,వారి మనస్తత్వాన్ని కవి కండ్లకుకడుతడు.

"గిల్ట్ బొమ్మలకు బంగారుపూత పూసినట్టు
ఏ ఆచ్ఛాదన లేకుండా
ఒంటినిండా డబ్బుతాపడమై
కొన్ని రూపాయి నోటు మొఖాలు
మరికొన్ని పెద్దనోట్ల ముఖాలు
మిగిలినవి చిల్లర పైసల ముఖాలు"

     (అన్వర్ —"తలవంచనిఅరణ్యం"కవితా సంపుటి )

పెద్దనోట్ల రద్దు దేశంలో  సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇక్కడ శిల్లర పైస తనను తాను పరిచయం చేసుకుంటుంది.
"డబ్బు ముఖాలు" కవిత మానవసంబంధాలు ఆర్ధికసంబంధాలైన వైనాన్ని కండ్లముందుంచితే...శిల్లరపైస ఎలా అనుకోకుండా ,తెరమీదికొచ్చిందో..అవసరం మనిషిని ఏమైనా చేయించగలదని , ఎత్తేశినోడే నెత్తికెత్తుకునేదన్క తెల్వని రాజకీయం ఈ కవితలో సూడొచ్చు.

"పొట్టోని నెత్తి పొడుగోడు గొడితే
పొడుగోని నెత్తి పోషవ్వ గోట్టిందట" అని ఎరుక
ఈడ పోషవ్వ నెత్తిని పొట్టోడు కొట్టుడే ఇచ్ఛంత్రం.

ఇసోంటి కవితలు "బంతిబువ్వ" నిండా వున్నయి. బంతిల కూసున్నంక ఒక్కొక్కటి నిమ్మలంగ సదువున్రి. "నశ్శెండబ్బ" సదువుడు మరువకున్రి.

సోపతిగాడు వడ్లకొండ దయాకర్ తన తొలి కవితాసంపుటి "బంతిబువ్వ" ను  మనసారా గుండెలకు హత్తుకుంటూ...

- బండారి రాజ్ కుమార్

Follow Us:
Download App:
  • android
  • ios