Asianet News TeluguAsianet News Telugu

అభినందన్ వీడియో రికార్డు: పాకిస్తాన్ కుటిల బుద్ధి

అభినందన్ తో చాలా మాటలు పాకిస్తాన్ బలవంతంగా చెప్పించినట్లు అనుమానిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే విధంగా వీడియోను ఎడిట్ చేశారని అంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం పాకిస్తాన్ ఆ వీడియోను రాత్రి 8.30 గంటలకు విడుదల చేసింది.

IAF pilot made to record video by Pak before being handed over to India
Author
Lahore, First Published Mar 2, 2019, 11:17 AM IST

లాహోర్‌: తమ చెరలో ఉన్న ఐఎఎఫ్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్థాన్‌ అధికారులు అతడి వీడియో ప్రకటనను చిత్రీకరించారు. దాంతో ఆయనను భారత్ కు అప్పగించడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. సరిహద్దు దాటేముందు వీడియో ప్రకటన చేయాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. 

అతడి వీడియో ప్రకటనను చిత్రీకరించి, స్థానిక మీడియాకు విడుదల చేసిన అనంతరం భారత్‌కు అప్పగించారు. అయితే, ఆ వీడియోను పాకిస్తాన్ అధికారులు ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోను కట్స్ చేసి పాకిస్తాన్ మీడియాకు వీడుదల చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వీడియోలో ఇలా ఉంది...

"నా పేరు.. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌. భారత వైమానిక దళంలో యుద్ధవిమాన పైలట్‌ను. నేను లక్ష్యాన్ని వెతికే ప్రయత్నంలో ఉండగా.. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ నా విమానాన్ని కూల్చేసింది. దీంతో.. ధ్వంసమైన నా విమానాన్ని వదిలేయాల్సి వచ్చింది. వెంటనే ఎజెక్ట్‌ అయ్యాను. నా ప్యారాచూట్‌ తెరుచుకుంది. నేను కిందికి దిగాను. నా దగ్గర పిస్తోలు ఉంది. నన్ను నేను కాపాడుకోవడానికి ఉన్న సాధనం అదొక్కటే. కానీ, అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నారు. దీంతో, ఆ పిస్తోలును కింద పడేశాను. అక్కణ్నుంచీ పరుగెత్తడానికి ప్రయత్నించాను.

అక్కడున్నవాళ్లు నా వెంట పడ్డారు. వాళ్లు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లు, కెప్టెన్‌ వచ్చారు. వారు నన్ను అక్కడి నుంచి రక్షించారు. నాకు ఏమీ కాకుండా చూశారు. తర్వాత వారి యూనిట్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నాకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేయించారు. అవసరమైన చికిత్స చేయించారు. పాకిస్థానీ సైన్యం మంచి ప్రొఫెషనల్‌ సైన్యం. 

వారిలో నేను శాంతిని చూశాను. పాకిస్థానీ ఆర్మీతో నేను చాలా సమయం గడిపాను. నాకు బాగా నచ్చింది. భారత మీడియా అన్నీ ఎక్కువ చేసి చెప్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మసాలా చేర్చి (ఆగ్‌ లగాకే, మిర్చ్‌ లగాకే) చెప్తుంది"

అయితే, అభినందన్ తో చాలా మాటలు పాకిస్తాన్ బలవంతంగా చెప్పించినట్లు అనుమానిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే విధంగా వీడియోను ఎడిట్ చేశారని అంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం పాకిస్తాన్ ఆ వీడియోను రాత్రి 8.30 గంటలకు విడుదల చేసింది. ఆయనను రాత్రి 9.20 గంటలకు పాకిస్తాన్ అధికారులు భారత అధికారులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios