Asianet News TeluguAsianet News Telugu

విమానంలో భర్త తిరుపతి తీసుకెళ్లలేదని లేడీ టెక్కీ ఆత్మహత్య

ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంకటరమణ తనను విమానంలో తిరుపతి తీసుకుని వెళ్లలేదని మనస్తాపానికి గురై ప్రవళ్లిక అనే లేడీ టెక్కీ ఉరేసుకుని మరణించింది.

Hyderabad: Husband rejects her wish, lady software engineer ends life
Author
Hyderabad, First Published Oct 18, 2019, 8:51 AM IST

హైదరాబాద్: అతి చిన్న విషయానికి ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు తన ప్రాణాలను తీసుకుంది. విమానంలో భర్త తనను తిరుపతి తీసుకుని వెళ్లలేదని మనస్తాపానికి గురైన లేడీ టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

గుంటూరుకు చెందిన ఎన్. ప్రవళ్లిక (30) మాదాపూర్ లోని ఆదిత్య బిర్లా సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. ఎస్సీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్ లో నివసించే వెంకటరమణను ఆమె ప్రేమించి 2014లో వివాహం చేసుకుంది. ఆ దంపతులకు రిత్విక అనే తొమ్మిది నెలల వయస్సు గల కూతురు ఉంది. 

ఈ నెల 10వ తేదీన కూతురు పుట్టువెంట్రుకలను తిరుపతిలో తీయాలని అనుకున్ారు. వెంకటరమణ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా తిరుపతి వెళ్లాలని అనుకున్నారు. రైలులో వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, అనుకోని కారణాలతో ప్రయాణం వాయిదా పడింది. 

ఆ స్థితిలో విమానంలో కూతురిని తీసుకుని తిరుపతి వెళ్దామని ప్రవళ్లిక భర్త వెంకటరమణను అడిగింది. ఈ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. వారం రోజుల తర్వాత అందరం కలిసి రైలులో తిరుపతి వెళ్దామని వెంకటరమణ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో ఇరువురి మధ్య వరుసగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. 

బుధవారం సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ప్రవళ్లిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత భర్తతో కనీసం మాట్లాడ లేదు. అలిగి పడుకుందని అతను అనుకున్నాడు. ఉదయం తలుపు తట్టాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూశాడు. ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. 

ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించాడు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios