Asianet News TeluguAsianet News Telugu

పోలీసులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగాబుక్కైన తాగుబోతు

పోలీసులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగాబుక్కైన తాగుబోతు
begumpet police arrested drunken fellow

హైదరాబాద్ లో ఓ తాగుబోతు తన అతితెలివి చూపించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తప్పతాగి పోలీసులకు దొరికిపోవడమే కాకుండా కౌన్సెలింగ్ కు  తన స్థానంలో వేరే వ్యక్తిని పంపించి పోలీసులను బురిడీ కొట్టించాలని చూశాడు. అంతే కాదు తన తండ్రి స్థానంలో వేరే వ్యక్తిని పంపించాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు తాగుబోతుతో పాటు అతడికి సహకరించి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ తప్పును కప్పిపుచ్చుకోడానికి మరో తప్పు చేసిన మందుబాబు వ్యవహారం హైదరాబాద్ బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.  

ఈ సంఘటనపై  బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమీర్ పేట సమీపంలోని వెంకటగిరి కాలనీకి చెందిన మనోహర్‌ అనే వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ కొన్ని రోజుల కింద పట్టుబడ్డాడు. ఇలా గోపాలపురం, జూబ్లీహిల్స్‌  పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండుసార్లు ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. ఇందుకుగాను ఇతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సెలింగ్‌ కోసం కుటుంబ సభ్యులను తీసుకుని రావాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులకు విషయం తెలిస్తే తన పరువు పోతుందని భావించిన మనోహర్ తన స్థానంలో కౌన్సెలింగ్ కు స్నేహితుడు లాజర్ ని పంపించాడు. అలాగే తన తండ్రి స్థానంలో మరో మిత్రుడు శివకుమార్ ను పంపించాడు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలోని పోలీసులు లాజర్‌, శివకుమార్‌తో పాటు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలా పోలీసులను చీటింగ్ చేయాలని భావించినందుకు ముగ్గురిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios