store banner



entertainment
By sreedhar nandagiri | 02:31 PM December 07, 2017
సప్తగిరి ఎల్.ఎల్.బి మూవీ రివ్యూ

Highlights

  • చిత్రం : సప్తగిరి ఎల్.ఎల్.బి
  • నటీనటులు : సప్తగిరి, కాశిష్ వోహ్రా
  • సంగీతం : బుల్గేనిన్
  • దర్శకత్వం : చరణ్ లక్కాకుల
  • నిర్మాత : డా. కె.రవి కిరణ్
  • ఆసియానెట్ రేటింగ్ : 2.25/5

కమెడియన్ కేటగిరీ నుంచి హీరో అవతారమెత్తిన సప్తగిరి పలు సినిమాల్లో కమెడియన్ గా నటించినా.. ‘సప్తగిరి ఎక్స్‌ ప్రెస్’ చిత్రంతో హీరోగా మారి ఫరవాలేదనిపించాడు. తాజాగా మరోసారి హీరోగా ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ అనే సినిమాలో నటించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
పుంగనూరులో ‘లా’ చదువు పూర్తిచేసి ప్రాక్టీస్ కోసం హైదరాబాద్‌కు వస్తాడు సప్తగిరి. బాగా అనుభవం సంపాదించి లాయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి రాజ్‌పాల్(సాయి కుమార్) అనే సీనియర్ మోస్ట్ లాయర్ తారసపడతాడు. కోర్టులో రాజ్‌పాల్ వాదనలు విన్న సప్తగిరి ఆయనకి అభిమాని అయిపోతాడు. కానీ ఒక కేసు విషయంలో రాజ్ పాల్‌‌తో తలపడాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ ఆ కేసు ఏంటి..? ఆ కేసులో రాజ్‌పాల్‌తో పోరాడి సప్తగిరి నిలబడగలిగాడా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘జాలీ ఎల్.ఎల్.బి’ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం ఒక కేసు చుట్టూనే తిరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్ మీద పడుకున్న కొందరిపైకి ఎక్కించేస్తాడు. డబ్బు కోసం ఒక ప్రముఖ లాయర్ ఆ కేసును క్లోజ్ చేయిస్తాడు. అదే కేసుని తిరిగి రీఓపెన్ చేయించి వాదించి చనిపోయిన వారి కుటుంబానికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు హీరో.

కేసు వాదించే దిశగా హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయాలను చాలా థ్రిల్లింగ్‌గా చూపించాల్సింది. కానీ ఎక్కడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ అనేది కలగదు. ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు కొంతవరకు కామెడీతో నడిపించి అకస్మాత్తుగా హీరోలో సీరియస్ వేరియేషన్ చూపిస్తాడు. హీరో అలా సడెన్ గా మారడానికి గల కారణాలు పెద్దగా లాజిక్ కనిపించదు. హీరోయిన్ కేవలం పాటల వరకు మాత్రమే పరిమితమైంది. ఆమె ముఖంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా కనిపించదు. పైగా ఇలాంటి కథలకు అనవసరపు పాటలు జోడించి మరింత విసిగించారు.

సప్తగిరి డాన్సులు, ఫైట్ల కోసం చాలా కష్టపడ్డా సినిమాకు బలం చేకూర్చలేకపోయాయి. సాయి కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన పాత్ర సినిమాకు ప్లస్ అయింది. కథలో ఎలాంటి మలుపులు లేకపోవడం, కథనం మరింత రొటీన్‌గా ఉండడంతో ఈ ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ ఓ సాధారణ చిత్రంగా మిగిలిపోతుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ సరేననిపిస్తాయి. సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

న్యాయం కోసం పోరాడే సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాకు మాత్రం సరైన న్యాయం చేయలేదు.

Show Full Article


Recommended


bottom right ad