Asianet News TeluguAsianet News Telugu

మహారాణి పద్మావతికి రాజమౌళి ప్రశంసలు

  • రాజ్ పుత్ మహారాణి పద్మావతి కథ ఆధారంగా పద్మావతి చిత్రం
  • సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి చిత్రం
  • ఈ చిత్రానికి దర్శక ధీరుడు బాహుబలి జక్కన్న రాజమౌళి ప్రశంసలు
rajamouli appreciates padmavathi for the grandeur

"రాంలీలా, బాజీరావ్ మస్తానీ లాంటి చారిత్రక కథల ఆధారంగా తెరకెక్కించిన ఇదే ర‌ణ్‌ వీర్ సింగ్, దీపికా పదుకొనే ల కలయికలో ఇప్పటికే రెండు విజయవంతమైన చారిత్రాత్మక సినిమాలు నిర్మించిన అనుభవం గల దిగ్ధర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తెరెకెక్కించిన చిత్రం పద్మావతి. రాజ్‌పుత్‌ మ‌హారాణి పద్మిని అలియాస్ ప‌ద్మావ‌తి క‌థ‌తో విలక్షణ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ప‌ద్మావ‌తి` సినిమా ట్రైల‌ర్ నిన్న అంగరంగ వైభవంగా విడుద‌లైన సంగతి పాఠకులకు తెలిసిందే.

 

ఇప్ప‌టికే ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకునే, ఆమె భ‌ర్త రావ‌ల్ ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ క‌పూర్‌, అల్లా వుద్దీన్ ఖిల్జీగా ర‌ణ్‌వీర్ సింగ్‌ల ఫ‌స్ట్‌ లుక్‌లు విడుదలై సినిమాపై భారీ అంచ‌నాలను పెంచేశాయి. నిన్న విడుద‌లైన ట్రైల‌ర్‌లో వారి ఆహార్యాభిన‌యాలు ఆ అంచ‌నాలను రెట్టింపు చేశాయి.  ట్రైల‌ర్‌లో చూపించిన భారీ సెట్టింగులు, యుద్ధ స‌న్నివేశాలు మరింత ఆస‌క్తిని పెంచు తున్నాయి. రాజ్‌పుత్ వంశ‌స్థుల ఖ్యాతిని వివ‌రిస్తూ ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ చివ‌ర్లో ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకునే చెప్పిన.."రాజ్‌పుత్‌ల ఖ‌డ్గంలో ఎంత శ‌క్తి ఉందో... అంతే శ‌క్తి రాజ్‌పుత్ రాణుల గాజుల్లో కూడా ఉంటుంది" అనే డైలాగ్ ఆ ట్రైలర్ కే వన్నె తెచ్చింది. 

 

అల్లావుద్దీన్ ఖిల్జీ గా ర‌ణ్‌వీర్ సింగ్‌ని చూపించిన విధానం కూడా అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది.  "కామాతురాణం నభయం న లజ్జ"  అన్నట్లు రాణి కోసం  భయానక, క్రూర,  కర్కశ, రౌద్ర రూపములో రణవీర్ సింగ్ నటన దిగ్భ్రమ గొలుపుతూ ఉంది.

 

డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకి రానున్న ఈ సినిమా లో సంజయ్ లీలా బన్సాలీ తరహా టేకింగ్.. అత్యున్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా ప్రతిసృష్టి చేస్తూ సినిమా మలిచినట్టు ట్రైలర్‌ లో స్పష్టమవుతోంది.

 

ఈ ట్రైలర్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌ వీర్‌ సింగ్‌ భయానక,  రౌద్రంతో కూడిన నటన అనితర సాధ్యమనిపించింది. అతనితో హోరా హోరీగా వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్‌ క‌పూర్‌ ధీర గంభీరత, దీపికా ప‌దుకునే ముగ్ధమనోహరమమైన సౌందర్యం.. అద్భుతంగా ఆవిష్కరించారు.

 

ఈ ట్రైలర్ పై ఇప్పటికే సినీ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. "పిచ్చి ఎక్కించేంత అందంగా ఉంది. ఇందులోని ప్రతీ ఫ్రేమ్ ని ఎంతో నైపుణ్యంతో దర్శకుడు తెరకెక్కించారు" అని పద్మావతి ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios