store bannerentertainment
By asianet news Telugu Team | 07:54 PM August 12, 2017
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రాజకీయ వేదిక స్థాపన

Highlights

  • రాజకీయ వేదిక స్థాపించిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర
  • తాను రాజకీయం చేయనని ప్రజాకీయం చేస్తానని చెప్తున్న ఉపేంద్ర
  • ప్రజలకు మంచి చేసే వారెవరైనా కలిసి పని చేస్తానంటున్న ఉపేంద్ర

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాట సూపర్ స్టార్ రజినీ తరహాలో పార్టీ పెట్టబోతున్నారన్న ఈహాగానాలకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ తరహాలో తాను ప్రశ్నించేందుకు ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచి చేసే అన్ని పార్టీలతో కలిసి పని చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నాని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకుల మీద తనకు కోపం లేదని, ఆ పార్టీలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం అంటే మేము కచ్చితంగా వారితో కలిసి పని చేస్తామని అన్నారు. బెంగళూరు నగర శివార్లలోని రిప్పీస్ రెస్టారెంట్ లో శనివారం ఉపేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు.

 

ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు అని ఉపేంద్ర చెప్పారు. రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయే తప్పా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. రాజకీయం అనే పదం ప్రజాప్రభుత్వానికి సరిపోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం చెయ్యడానికి తాను సిద్దంగా లేనని ప్రజాకీయం చెయ్యడానికి సిద్దం అయ్యానని అన్నారు. ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరినీ తాను చేరదీస్తానని ఉపేంద్ర చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తాను సిద్దం అయ్యానని ఉపేంద్ర అన్నారు.

 

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాకీ చోక్కా వేసుని అనేక సార్లు బహిరంగ సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే ఖాకీ చొక్కా వేసుకుని వచ్చిన ఉపేంద్ర తాను ఒక కార్మికుడని అన్నారు. రాజకీయ నాయకులు వేసుకునే ఖద్దర్, తెల్లచొక్కాలు తాను వేసుకోనని, ఒక కార్మికుడిగా తాను ప్రజలకు సేవ చెయ్యడానికి ఇష్టపడతానని ఉపేంద్ర వివరించారు.

 

కార్మికులు, రైతులు, పేదల వలనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఉపేంద్ర అన్నారు. అయితే ప్రభుత్వం నుంచి వారికి అందవలసిన పథకాలు అందడం లేదని ఉపేంద్ర విచారం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న వారితోనే నేను పని చేస్తానని ఉపేంద్ర అన్నారు.

 

కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే డబ్బులు కావాలి, అందుకు నిధులు సేకరించాలి. నిధులు సేకరించి మేము అధికారంలోకి వస్తే మాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వారికి అప్పుడు సంపాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలా చేస్తే అవినీతి ఆస్కారం ఉంటుంది, అప్పుడు ప్రజలే నష్టపోతారు అని ఉపేంద్ర చెప్పారు.

 

ఎవ్వరి దగ్గరా నిధులు సేకరించడం తనకు ఇష్టం లేదని ఉపేంద్ర వివరించారు. కొత్త పార్టీ ఏర్పాటు చెయ్యాలన్నా, పార్టీ గుర్తు పెట్టాలన్నా అందుకు సమయం పడుతుందని, ఎన్నికల కమిషన్ దగ్గర అనుమతి తీసుకుని తన పార్టీ గుర్తు చెప్పవలసి ఉంటుందని ఉపేంద్ర వివరించారు. పంట

తాను కొత్త పార్టీ పెట్టడం లేదని, ఒకే వేదిక (ఫ్లాట్ ఫాం) మాత్రం ఏర్పాటు చేశానని ప్రజలు సహకరించాలని, తనకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉపేంద్ర మనవి చేశారు. తనకు సలహాలు సూచనలు ఇచ్చే వారు రిప్పీస్ రెస్టారెంట్ చిరునామాకు లేఖలు పంపించాలని, లేదంటే ఈ-మెయిల్ prajakarana1@gmail.com, prajakarana2@gmail.com, prajakarana3@gmail.com సలహాలు ఇవ్వాలని ఉపేంద్ర మనవి చేశారు. మొత్తం మీద రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఉపేంద్ర ఇప్పుడు ఒక వేదిక తయారు చేసి రానురాను ఏం చేస్తారో ? అన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

Show Full Article


Recommended


bottom right ad