Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అరాచశక్తి: మహేష్ కత్తి తీవ్ర వ్యాఖ్యలు

 రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అరాచశక్తి: మహేష్ కత్తి తీవ్ర వ్యాఖ్యలు

Mahesh Kathi posts Pawan Kalyan image and comments

హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఇద్దరు యువకులతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసి వాళ్లిద్దరు తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వాళ్లంటూ చెప్పారు. ఆ ఫొటోనే కాకుండా తనపై ఎలా దాడి చేశారో చూడండంటూ వీడియోను కూడా పోస్టు చేశారు. 

పవన్ కల్యాణ్ త్వరలో రాష్ట్రంలో తన అభిమానులతో అరాచకం సృష్టించబోతున్నారని ఆరోపించారు. "ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. నా మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కళ్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం?"  అని అన్నారు.

మొన్నటికి మొన్న ఫిల్మ్ ఛాంబర్ కు అభిమానులను పిలవడం వెనక దాగి ఉన్న మతలబు, అమ్మ సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను సాధించడం కాదా అని అన్నారు. అభిమానుల కోసం పవన్ అక్కడికి రాలేదని, తన అక్కసు వెళ్లగక్కడానికి వచ్చాడని అన్ారు. 

మా అసోసియేషన్ ను టెర్రరైజ్ చేసి, మీడియా మీద వార్ ప్రకటించడానికి పవన్ కల్యాణ్ వచ్చారని అన్నారు. అభిమానుల ఆవేశాన్ని తన ఆయుధంగా మలుచుకోవడానికి ప్లాన్ వేసుకునే వచ్చాడని అన్నారు. అక్కడ జరిగింది అదేనని అన్నారు. 

ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి చేసినవారిని అరెస్టు చేస్తే వాళ్లను విడిపించడం మానుకుని అది కూడా మీడియా అరాచకమే అని కలర్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాల్లో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలను చేయిస్తున్నారని మహేష్ కత్తి అన్నారు. 

అన్నపూర్ణ స్టూడియోలో మీటింగ్ అని పిలిచి, అభిమానులు అక్కడ హంగామా చేసేలా చేసి, పవన్ కల్యాణ్ మాత్రం రాలేదని, తద్వారా మీడియాను, అభిమానులు తప్పు దోవ పట్టించారని అన్నారు. దాని వెక ఒక్క హింసాత్మక కుట్ర పునాది దాగుందని తనకు అనిపిస్తే అది తన తప్పే అవుతుందని అన్నారు. కానీ ఈ ఫొటో చూసిన తర్వాత అది అసాధ్యం కాని కుట్ర అనిపించి రాస్తున్నట్లు తెలిపారు. 

పవన్ కల్యాణ్ కోసం చస్తాం, చంపుతాం అనే యువత రాష్ట్రవ్యాప్తంగా ఎంత లేదన్నా 10 నుంచి 20 వేల మంది దాకా ఉంటుందని, పవన్ కు వ్యతిరేకమని భావించే మీడియా మీద, పవన్ కల్యాణ్ కు ఇష్టం లేని మనుషుల మీద దాడి చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడి సృష్టించడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న కుట్ర ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా ప్రముఖుల పేర్లు, ఫొటోలు బయటపెట్టి బెదిరించడం వెనక, తనలాంటి వాళ్ల ఇళ్ల చిరునామాలు వాళ్ల చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉందని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ త్వరలోనే తన అభిమానుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అరాచకం సృష్టించబోతున్నారని మహేష్ కత్తి తీవ్ర వ్యాఖ్య చేశారు. పవన్ కల్యాణ్ ను పిచ్చిగా అభిమానించే యువకులు ఇందులో సమిధలవుతారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుందని అన్నారు. కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తుందని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని, పవన్ కల్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ కావచ్చునని ఆయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios