Asianet News TeluguAsianet News Telugu

"జయజానకినాయక" మూవీ రివ్యూ

  • చిత్రం : జ‌య‌జాన‌కి నాయ‌క
  • న‌టీన‌టులు : బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైస్వాల్ , కేథ‌రిన్ ట్రెసా, సుమ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్‌కుమార్‌, చ‌ల‌ప‌తిరావు, నందు, శివ‌న్నారాయ‌ణ‌, త‌రుణ్ అరోరా, వాణీ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు
  • సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
  • నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి
  • ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను
  • ఆసియానెట్ రేటింగ్- 2.5/5
jayajanaki nayaka movie review

పక్కా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనగానే గుర్తుకొచ్చే పేరు బోయపాటి శ్రీను. దమ్మున్న డైలాగ్స్ తో,, పక్కా కిక్కిచ్చే ఫైట్స్ తో.. చక్కని కుటుంబ కథలతో అందమైన కథలు అల్లి పక్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలను తెర‌కెక్కించ‌డంలో బోయ‌పాటి శ్రీనుకు సాటిలేదు. టాప్ హీరోల‌తో మాత్రమే సినిమాలు చేసే బోయ‌పాటి తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి వ‌ర్ధ‌మాన హీరోతో `జ‌య జాన‌కి నాయ‌క‌` చిత్రం తెరకెక్కించాడు. తనదైన భారీ డైలాగులతో హీరో రేంజ్ మరింత పెంచే బోయపాటి సినిమాల రేంజ్‌లో ఈ మూవీ ఉందా? బోయ‌పాటి మార్కు సినిమా అనిపించుకుందా...

 

కథ‌ :

చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చక్రవర్తి కుమారుడు గగన్(సాయి శ్రీనివాస్) కాలేజీలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే సెంట్రల్ మినిస్టర్ (సుమ‌న్‌) కుమారుడిని చిచకబాదుతాడు. ఎందుకంటే ఒక‌మ్మాయి అత‌నికి భ‌య‌ప‌డి కాలేజీ నుంచి టీసీ తీసుకుని వెళ్తుంది. దాంతో అతను టీసీ తీసుకుంటే వదిలేస్తానా అంటూ మరింత అల్లరి చేస్తుంటాడు. స్వీటీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్) వారిస్తుంది. దాంతో ఆక‌తాయి ఆమెపై కూడా దౌర్జ‌న్యం చేయాల‌నుకుంటాడు. అప్పుడు గ‌గ‌న్, అత‌ని తండ్రి చ‌క్ర‌వర్తి (శ‌ర‌త్‌కుమార్‌), సోద‌రుడు (నందు) కూడా ఆకతాయిని చితక్కొడతారు. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ తన కొడుకును కొట్టిన విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకుని అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ (జ‌గ‌ప‌తిబాబు) ఇంటిలో జరిగే నిశ్చితార్థ వేడుక‌కు హాజ‌ర‌వుతాడు. అక్కడే పెళ్లికొడుకైన బడా కాంట్రాక్టర్ మహేంద్రవర్మ కొడుకు అశ్వత్ కు ఓ వీడియో చూపిస్తాడు. ప‌రువు కోసం కన్నవారి ప్రాణాలైనా తీసే అశ్వత్ వర్మ ఆ వీడియో చూపించిన తన కాబోయే అల్లుడిని, వాడికిచ్చిన మరొక సెక్యురీటీ గార్డ్ ను చంపించి త‌న కుమార్తె ఆత్మ‌హ‌త్య‌కు కారణమవుతాడు. మ‌రోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ను ప్రెస్టీజియ‌స్‌గా తీసుకుంటాడు అశ్వత్ వర్మ. అయితే అంత‌వ‌ర‌కు లిక్క‌ర్ బిజినెస్‌లో డాన్ గా ఉన్న అర్జున్ ప‌వార్(తరుణ్ అరోరా) దృష్టి ఈ క్రాంటాక్ట్ మీద ప‌డుతుంది. పంతం నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా తెగించే ప‌వార్‌, ప‌రువు కోసం పాకులాడే వ‌ర్మ ఈ కాంట్రాక్ట్ కోసం పోటీపడతారు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఏర్పడ్డ వార్ లో నువ్వా నేనా అంటూ ఆడుతున్న గేమ్‌లో తన తండ్రి జేపీ మూలంగా స్వీటీ అలియాస్ జాన‌కి (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) ఇరుక్కుంటుంది. అయితే అప్పటికే ప్రేమించుకున్న గగన్, స్వీటీల ప్రేమ ఏమవుతుంది.. చివరికి వాళ్లిద్దరి ప్రేమ గెలిచిందా లేదా.. అసలు ఆమెను ఆ ఇద్ద‌రి నుంచి హీరో ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ.

 

నటీనటులు :

బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రికి విలువిచ్చే కుర్రాడిగా, ప్రేమికుడిగా, కసితో పోరాడే వీరుడిలా  ఫైట్లు.. పాటల్లో డాన్స్ లు ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని ఎమోషనల్  సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ పండించడంలో హీరో మరింత ఎదగాల్సిన అవసరం వుంది. ఓ సీన్ లో హీరోను హీరోయిన్ ఫ్రెండ్ ముచ్చు మొహమోడా అని తిడుతుంది. అలా అనిపించుకోకుండా వుంటే బాగుండేది. ఇక హీరో తండ్రి పాత్రలో శ‌ర‌త్‌కుమార్‌, అన్న‌గా నందు తమదైన శైలిలో నటించారు. సిన్సియ‌ర్ ఆఫీస‌ర్‌గా, కూతురి విష‌యంలో స్వార్థ‌ప‌రుడిగా జె.పి. బాగా చేశారు. ప‌రువు కోసం ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడని ధనవంతుడిగా జ‌గ‌ప‌తిబాబు, అటు అల్ల‌రి పిల్ల‌గా, బాధ్య‌త‌గల యువతిగా, డిప్రెష‌న్‌కు గురైన విడోగా ర‌కుల్ రకరకాల వేరియేషన్స్ తో అదుర్స్ అనిపించింది. గ్లామ‌ర్ పాత్ర‌లో ప్ర‌గ్యా, ఐట‌మ్ సాంగ్‌లో కేథ‌రిన్ కేక అనిపించారు. త‌రుణ్ అరోరా అర్జున్ పవార్ పాత్రలో కర‌డు గ‌ట్టిన లికర్ డాన్ గా విలన్ అంటే వీడేరా అనిపించాడు. సుమ‌న్ ఈ త‌ర‌హా పాత్ర‌ల్ని ఇంత‌కు ముందు చాలానే చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం బావుంది. కెమెరా ప‌నిత‌నం మెచ్చుకోవాలి. 

ఎలా వుందంటే:

సినిమాలో న‌వ్వుకుందామంటే ఏ సీన్ లోనూ ఆ పరిస్థితి లేదు. ల‌వ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు కూడా ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌వు. హీరోయిన్ ఊత‌ప‌దంగా నాగ‌రాజా అనే ప‌దం త‌ప్పితే, ఎక్క‌డా న‌వ్వొచ్చే స‌న్నివేశాలు లేవు. విల‌న్లు, విల‌న్ల చుట్టూ మ‌నుషులు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. యాక్ష‌న్ సీక్వెన్స్ ఎక్కువ‌య్యాన‌ని అనిపిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు చాలా డ‌ల్‌గా ఉంటాయి. ర‌కుల్ డ‌ల్ మూడ్‌లో ఉండ‌టం కొత్త ప్ర‌య‌త్న‌మే అయినా, కొంచెం సేప‌టికి విసుగు వ‌చ్చేస్తుంది. వాణీవిశ్వ‌నాథ్ ఎంట్రీ బ్ర‌హ్మాండంగా ఉంది. కానీ ఆ పాత్ర కాసేపటికి తేలిపోయింది. ప‌రువు కోసం కూతురినే ఆత్మ‌హ‌త్య‌ చేసుకునేలా ప్రేరేపించిన వ‌ర్మ‌, త‌న ఫ్యామిలీనే మ‌ట్టుబెట్టించాల‌ని.. శత్రువు పవార్ తో చేతులు కలపాలని చూసిన చెల్లిని ఏమీ అన‌క‌పోవ‌డం, చివర్లో త‌న‌కు తానే కాల్చుకుని చనిపోవడం పెద్ద‌గా ర‌క్తి క‌ట్టించ‌వు. ప్ర‌తి ఫ్రేమూ రిచ్‌గా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. పెళ్లి పీట‌ల మీదే భ‌ర్త‌ను పోగొట్టుకున్న హీరోయిన్... అనే కాన్సెప్ట్ కొత్త‌గా అనిపిస్తుంది.

 

హంస‌ల‌దీవి ఎపిసోడ్ కేవ‌లం ఫైట్ల కోసం మాత్ర‌మే అనిపిస్తుంది. సినిమాలో కాసిన్ని న‌వ్వుల‌ను జోడిస్తే బావుండేది. అయితే శరత్ కుమార్.. రోడ్డు ప‌క్క‌న బ‌జ్జీలు తింటే మ‌న‌వాడు బ‌తుకుతాడు. విదేశీ కంపెనీలను ఉద్ద‌రించాల్సిన ప‌నిలేద‌ని చెప్పే సంద‌ర్భంలోనూ.. హీరో చెప్పే రాయిలో దేవుడిని చూసే నువ్వు.. సాటి ఆడ‌దానిలో చూడ‌లేక‌పోయావ్ అనే డైలాగులోనూ, నీకు ప్రాణ‌మే నేను పెట్టిన‌దైన‌ప్పుడు ప‌రువు మాత్రం ఎక్కడిది.. ప్రాణం గొప్పదా పరువు గొప్పదా అని హీరో జగపతిబాబును అడిగేట‌ప్పుడు.. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో బోయపాటి తరహా డైలాగులు మెప్పిస్తాయి. ఇది పక్కా బోయ‌పాటి సినిమా అయితే... ఎమోషనల్ సీన్స్ లో హీరో నటన పేలలవంగా అనిపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో తనేదో ఈ స్థాయి సినిమాలో నేను హీరోనేంటి అని ఫీలైనట్లు కనిపిస్తుంది.

చివరగా:

భారీ కాస్ట్ అండ్ క్రూతో భారీ డైలాగులతో తెరకెక్కిన బోయపాటి మార్క్ సినిమా జయజానకి నాయక

Follow Us:
Download App:
  • android
  • ios